Begin typing your search above and press return to search.

తగ్గేదేలె.. ఏపీలో స్కూళ్లు తెరిచేందుకే జగన్ డిసైడ్

By:  Tupaki Desk   |   18 Jan 2022 4:11 AM GMT
తగ్గేదేలె.. ఏపీలో స్కూళ్లు తెరిచేందుకే జగన్ డిసైడ్
X
మహమ్మారి మూడో వేవ్ మొదలైందన్న మాటకు తగ్గట్లే.. కేసుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళ.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాత్రి వేళ కర్ఫ్యూను అమలు చేస్తున్న ఏపీలో.. స్కూళ్లు.. కాలేజీల మూత విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వం భిన్నంగా ఆలోచిస్తోంది. స్కూళ్లను మూసివేసేందుకు ససేమిరా అంటోంది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో తెలంగాణలో స్కూళ్లు.. కాలేజీల్నిజనవరి 30 వరకు మూసివేసి ఉంచాలని.. ఆన్ లైన్ లో క్లాసుల్ని నిర్వహించాలన్న నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే.

ఏపీలో మాత్రం ఆన్ లైన్ లో విద్యా బోధన కంటే కూడా.. స్కూళ్లు.. కాలేజీల్ని ఓపెన్ చేయాలన్న దాని మీదనే ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్లే.. విద్యా సంస్థల్ని ప్రారంభించారు. కేసులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం సెలవుల్ని పొడిగించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వేళ ఏపీ విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. విద్యార్థుల రోజువారీ హాజరు తీసుకుంటున్నామని.. వారి ఆరోగ్యం గురించి ఆందోళన అక్కర్లేదని చెబుతున్నారు.

కొవిడ్ నేపథ్యంలో రెండేళ్లుగా ఆల్ పాస్ విధానాన్ని అనుసరించామని.. భవిష్త్తులో విద్యార్థులకు ఇబ్బందుల నేపథ్యంలో స్కూళ్లను తిరిగి ప్రారంభించినట్లుగా చెప్పారు. ప్రభుత్వం స్కూళ్లను తెరిచే విషయంలో క్లియర్ గా ఉండటానికి కారణం.. రాష్ట్రంలోని విద్యార్థుల్లో 90 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి కావటమేనన్న మాట వినిపిస్తోంది. రాష్ట్రంలో 26 లక్షల మంది విద్యార్థుల్లో తొంభై శాతం మందికి టీకా కార్యక్రమం పూర్తి కావటం.. ఉపాధ్యాయులకుకూడా కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి అయిన నేపథ్యంలో స్కూళ్లు.. కాలేజీలను తెరవటం ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉందని చెబుతున్నారు.

విద్యా సంవత్సరం నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే స్కూళ్లను నిర్వహిస్తున్నట్లు చెప్పిన విద్యా శాఖా మంత్రి.. అకడమిక్ ఇయర్ ను ముందుగా అనుకున్నట్లే పూర్తి చేయాలని భావిస్తున్నారు. కరోనా సందర్భంగా ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్రకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెబుతున్నారు.

వేరే రాష్ట్రాలతో తమకు పోలిక వద్దని.. గతంలో ఇతర రాష్ట్రాల కంటే ముందుగానే స్కూళ్లను ఆగస్టులోనే తెరిచామనిచెబుతున్న ఆయన.. ఏపీలోని పరిస్థితులకు అనుగుణంగా తాము నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. మిగిలిన రాష్ట్రాల సంగతి మాకు వద్దు.. మేం ఏం చేయాలనుకున్నామో.. అది చేస్తామన్న మాట ఏపీ విద్యా మంత్రి మాటల్లో స్పష్టమవుతుందని చెప్పాలి.