Begin typing your search above and press return to search.

రాజధానిగా విశాఖపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   31 Jan 2023 1:41 PM GMT
రాజధానిగా విశాఖపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు!
X
ఏపీ సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ రాజధానిగా మారుతుందన్నారు. అక్కడ నుంచే తన పరిపాలన సాగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు అక్కడకు వచ్చి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. మార్చి నెలలో విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 31న ఢిల్లీలో ఇందుకు సంబంధించిన సన్నాహక సదస్సు జరగ్గా.. అందులో ఇన్వెస్టర్లను ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగించారు.

ఏపీలో పెట్టుబడులు పెట్టిన వాళ్లందరికీ సీఎం జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్ధమని హామీ ఇచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ప్రపంచ వేదికపై ఏపీని నిలబెట్టడానికి పారిశ్రామికవేత్తల సహకారం తమకు అవసరమని సీఎం జగన్‌ తెలిపారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ గత మూడేళ్లుగా నెంబర్‌ వన్‌గా ఉంటోందని ఈ సందర్భంగా సీఎం జగన్‌ గుర్తు చేశారు. 11.43 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 11 ఇండస్ట్రీయల్‌ కారిడార్లలో మూడు ఏపీకే రావడం శుభపరిణామంగా అభివర్ణించారు.

సింగిల్‌ డెస్క్‌ విధానం ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు కావాల్సిన అనుమతులు అన్నీ ఇస్తున్నామని జగన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను ఆయన పెట్టుబడిదారులకు తెలియజేశారు. పారిశ్రామికవేత్తలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తోనే ఆం«ధ్రప్రదేశ్‌ నెంబర్‌ వన్‌గా ఉందని జగన్‌ తెలిపారు. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని గుర్తు చేశారు.

రాబోయే రోజుల్లో విశాఖ పాలనా రాజధానిగా మారబోతోందని జగన్‌ తేల్చిచెప్పారు. తాను కూడా అక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో విశాఖ రాజధానిలో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామన్నారు. మీతో పాటు ఇతర కంపెనీల ప్రతినిధులను కూడా తీసుకొచ్చి ఏపీలో అభివృద్ధిని చూపించాలని పెట్టుబడిదారులను కోరారు.

కాగా ఇక ఏపీ రాజధాని విశాఖపట్నమేనని జగన్‌ తాజా వ్యాఖ్యలతో స్పష్టత ఇచ్చేసినట్టేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మంత్రులు గుడివాడ అమరనాథ్, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటివారు విశాఖ నుంచే మరికొద్ది నెలల్లో పరిపాలన ప్రారంభమవుతుందని చెబుతున్న సంగతి తెలిసిందే.

అలాగే వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఉగాది నుంచి విశాఖ రాజధానిగా పాలన సాగుతుందని వెల్లడించిన విషయం విదితమే. ఇప్పుడు వైసీపీ నేతల వ్యాఖ్యలను సీఎం జగన్‌ తన తాజా వ్యాఖ్యల ద్వారా సమర్థించినట్టయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.