ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న వైనం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు కొన్ని చేశారు. తన యాత్రలో భాగంగా అనపర్తి ప్రజలు తనకు ఆశ్చర్యకరమైన విషయాల్ని చెప్పారన్నారు.
ఏపీలో జీఎస్టీతో పాటు.. బాబు.. చినబాబు ట్యాక్స్ కూడా అమలవుతున్న విషయాన్ని చెప్పారన్నారు. మరే రాష్ట్రంలోనూ లేని రీతిలో ఏపీలో టీడీపీ పన్ను పేరిట వసూళ్ల కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయంటూ ఎద్దేవా చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ ట్యాక్స్ వసూలు చేసే బాధ్యతను అనపర్తి ఎమ్మెల్యేకు అప్పగించారన్నారు.
ఇక్కడ లంచాలు కలెక్టర్ నుంచి ఎమ్మెల్యేల వరకూ.. చినబాబు నుంచి పెదబాబు వరకూ అందుతున్నాయన్నారు. ఈ నియోజకవర్గంలో లేఔట్లు వేయాలంటే ఎకరాలకు రూ.2లక్షలు చెల్లించాల్సిందేనన్నారు. మద్యం షాపు నుంచి ఎమ్మెల్యేలకు నేరుగా ట్యాక్స్ వెళుతుందన్న జగన్.. మద్యం సరఫరాను విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారన్నారు. ప్రతి మద్యం దుకాణం నుంచి స్థానిక ఎమ్మెల్యేకు రూ.2లక్షల చొప్పున మామూళ్లు కట్టిస్తున్నారన్నారు.
ఎన్నికల వేళ బాబు ఏమో మద్యం దుకాణాల్ని ఎత్తేస్తానని.. బెల్ట్ షాపులపై కొరడా ఝుళిపిస్తానని చెప్పినా.. ఇప్పటివరకూ అలాంటిదేమీ చోటు చేసుకోలేదన్నారు. ప్రస్తుతం ఏపీలో మినరల్ వాటర్ లేని గ్రామం ఉందేమో కానీ.. మద్యం షాపు లేని ఊరు లేదంటే ఆతిశయోక్తి కాదన్నారు. తమ గ్రామాల్లో తమ ఇంటి ముందు.. తమ వీధి చివరన మద్యం దుకాణాల్ని ఏర్పాటు చేసి.. తమ పిల్లల్ని తాగుబోతులుగా చేస్తున్నారంటూ పలువురు మహిళలు శాపనార్థాలు పెడుతున్నారన్నారు.
స్థానిక రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తే.. చెయ్యని రవాణాను చేసినట్లుగా చూపించి రూ.30 చొప్పున పన్ను విధిస్తున్నారని.. అందులో ప్రతి బస్తాకు రూ.10 చొప్పున ఎమ్మెల్యే వాటా కిందకు వెళుతోందని.. మరో రూ.20 కలెక్టర్ ద్వారా చినబాబుకు అందుతోందంటూ మండిపడ్డారు. స్థానికులు చేస్తున్న ఆరోపణల్ని చూస్తే.. ఇక్కడ ల్యాండ్ కన్వెర్జన్ చేస్తే ఎకరాకు రూ.లక్ష చొప్పున లంచం ఇవ్వాల్సి వస్తోందని.. ఏది ముట్టుకున్నా లంచం తప్ప మరింకేమీ కనిపించటం లేదని మండిపడ్డారు. ఏపీలో అవినీతి ఎంత తీవ్రంగా ఉందన్న విషయం తాజాగా జగన్ ప్రసంగం వింటే ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.