Begin typing your search above and press return to search.

చంద్రబాబు మేనిఫెస్టో పై జగన్‌ సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   1 Jun 2023 3:11 PM GMT
చంద్రబాబు మేనిఫెస్టో పై జగన్‌ సంచలన వ్యాఖ్యలు!
X
ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన టీడీపీ మహానాడు సందర్భంగా చంద్రబాబు వచ్చే ఎన్నికల మేనిఫెస్టో ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టో పై ఇప్పటికే వైసీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఏపీలో జగన్, కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను కాపీ కొట్టి చంద్రబాబు తన మేనిఫెస్టో ప్రకటించారని ఎద్దేవా చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం జగన్‌.. చంద్రబాబు మేనిఫెస్టో పై హాట్‌ కామెంట్స్‌ చేశారు. రైతు భరోసా నిధుల విడుల కార్యక్రమంలో పాల్గొన్న జగన్‌... చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ పైనా, మహానాడులో ప్రకటించిన టీడీపీ మేనిఫెస్టో పైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

వైసీపీ మేనిఫెస్టో తన పాదయాత్రలో ప్రజల కష్టాల నడుమ పుట్టిందని జగన్‌ వ్యాఖ్యానించారు. పేదవాడి గుండె చప్పుడు నుంచి వైసీపీ మేనిఫెస్టో పుట్టిందని తెలిపారు. మన మట్టి నుంచి మన మేనిఫెస్టో పుట్టిందని జగన్‌ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు.

ఇక చంద్రబాబు మేనిఫెస్టో ఏపీ లో పుట్టలేదన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో కర్ణాటక లో పుట్టిందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో రెండు పార్టీల మేనిఫెస్టోతో చంద్రబాబు బిస్మిల్లా బాత్‌ వండేశాడన్నారు. అన్ని పార్టీల పథకాలు కాపీ చేసేసి మేనిఫెస్టో తీసుకొచ్చాడన్నారు. మన పథకాలను కాపీ కొట్టేసి పులిహోర కలిపేశాడని జగన్‌ ఎద్దేవా చేశారు. ప్రజల్ని మళ్లీ మోసం చేద్దామని ఎత్తులు వేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు.

వైయస్సార్, కాంగ్రెస్, బీజేపీ పథకాలన్నీ కాపీ చేశారని జగన్‌ మండిపడ్డారు. చివరికి చంద్రబాబు జీవితమే కాపీ, మోసమని నిప్పులు చెరిగారు. బాబుకు ఒరిజినాలిటీ తెలియదన్నారు.

రైతుకు చంద్రబాబు శత్రువు అని జగన్‌ మండిపడ్డారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రాజమండ్రిలో ఒక డ్రామా ఆడారాని.. దాని పేరే మహానాడు అంటూ సెటైర్లు వేశారు. తానే వెన్నుపోటు పొడిచి చంపేసిన మనిషిని కీర్తిస్తూ ఫోటోకు దండ వేశారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇప్పుడు మేనిఫెస్టో పేరుతో వేషం వేస్తున్నాడు అంటూ విమర్శించారు.

చంద్రబాబు సత్యం పలకడు, మాట మీద నిలబడడని జగన్‌ మండిపడ్డారు. విలువలు, విశ్వనీయత అసలే ఉండవంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు అయినా సరే పొడుస్తాడు.. ఎన్నికల అయిపోయిన తర్వాత ప్రజలనైనా సరే పొడుస్తాడని ఎద్దేవా చేశారు. అధికారం కోసం చంద్రబాబు ఎవరినైనా పొడవడానికి ఏమాత్రం వెనకాడడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు 175 నియోజకవర్గాలలో 175 మంది అభ్యర్థులు దొరక్క పొత్తులు కోసం దిగజారుతున్నాడని ఎద్దేవా చేశారు. ఎంతకైనా దిగజారే పార్టీ టీడీపీ అని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఏ గడ్డయినా తినడానికి వెనకాడని వ్యక్తి చంద్రబాబు అని జగన్‌ ఘాటైన విమర్శలు చేశారు. చంద్రబాబుకు విలువలు, విశ్వనీయత లేని పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. అక్క చెల్లెమ్మల కు, పిల్లల కు, యువకుల కు ఇది చేశానని చెప్పుకునేందుకు చంద్రబాబు కు ఒక్క పథకం కూడా లేదని జగన్‌ దుయ్యబట్టారు.

ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు కొంగ జపం మొదలుపెట్టారంటూ జగన్‌ చురకలు వేశారు. వచ్చేది కురుక్షేత్ర యుద్ధమన్నారు. పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతుందని తెలిపారు. తనకు ప్రజల ఆశీర్వాదాలు కావాలన్నారు.