Begin typing your search above and press return to search.

మాటకు కట్టుబడి చరిత్ర సృష్టించాం: జగన్

By:  Tupaki Desk   |   6 April 2018 6:07 PM GMT
మాటకు కట్టుబడి చరిత్ర సృష్టించాం: జగన్
X
వైసీపీ ఎంపీల ఆమరణ దీక్షపై ఆ పార్టీ అధినేత జగన్ ప్రశంసలు కురిపించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని.. ఒక రాష్ర్ట ప్రత్యేక హోదా కోసం అయిదుగురు ఎంపీలు పదవులను వదులుకుని చరిత్ర సృష్టించారని అన్నారు. అయిదు కోట్ల ఆంధ్రుల కోసం అయిదుగురు ఎంపీలు త్యాగం చేశారన్నారు. ప్రత్యేక హోదా కోసం వారి ఆరాటం.. కేంద్రాన్ని ఒప్పించాలన్న వారి పోరాటం అభినందనీయమన్నారు. గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఆఖరి అస్త్రంగా తమ ఎంపీలు రాజీనామాలు చేశారని చెప్పారు. తమ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలూ రాజీనామా చేసుంటే దేశమంతా ఇది మరింత పెద్ద విషయంగా మారేదని.. కేంద్రంపై మరింత ఒత్తిడి కలిగేదని.. కానీ, చంద్రబాబునాయుడు ఈ విషయంలో మోసం చేశారన్నారు.

చంద్రబాబును ఎవరూ నమ్మబోరని.. మొన్నటి ఆయన దిల్లీ పర్యటనలోనూ ఇతర పార్టీల నేతలెవరూ ఆయన్ను నమ్మకపోవడం వల్లే ఎవరూ ఆయన్ను పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో రెండు గంటల పాటు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చినా ఎక‍్కడా ప్రత్యేక హోదా హోదా గురించి కానీ ఎంపీల రాజీనామాల గురించి ఊసెత్తలేదన్నారు. ఇప్పుడాయన అఖిలపక్షం నిర్వహిస్తాననడం కూడా మొన్నటి మాదిరిగా మళ్లీ తాను ఇది చేశాను, అది చేశాను అని చెప్పుకోవడానికేనని.. అలాంటిదానికి వెళ్లాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. అఖిలపక్ష భేటీ పేరిట చంద్రబాబు డ్రామాలాడుతున్నారని దొంగతనాల నివారణ కోసం గజదొంగే మీటింగ్‌ పెట్టినట్టుందని జగన్ వ్యాఖ్యానించారు.

మరోవైపు జనసేన అధినేత పవన్ పైనా జగన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని ముంచినవారిలో పవన్‌ పాత్ర కూడా ఉందని జగన్ మండిపడ్డారు. పవన్‌ సినిమాలో సినిమా తక్కువ - ఇంటర్వెల్‌ ఎక్కువ అని అన్నారు.