Begin typing your search above and press return to search.

జగన్ సర్కార్ కొత్త పథకం.. పేద నిరుద్యోగులకు భారీ వరం

By:  Tupaki Desk   |   24 Nov 2020 4:15 AM GMT
జగన్ సర్కార్ కొత్త పథకం.. పేద నిరుద్యోగులకు భారీ వరం
X
ఓవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు సవాళ్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళలోనూ సంక్షేమ రథానికి ఎలాంటి ఢోకా లేకుండా చూసుకోవటం..మరోవైపు తాను నమ్మిన సంక్షేమ పథకాల్ని పెద్ద ఎత్తున అమలు చేయటం చాలా తక్కువగా ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా తరచూ ఏదో ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకురావటం.. పలు వర్గాలకు లబ్థి చేకూరేలా నిర్ణయం తీసుకోవటంలో జగన్ సర్కారు తర్వాతే ఎవరైనా. తాజాగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులకు అద్భుతమైన అవకాశాన్ని జీవో నెంబరు 69 ద్వారా కల్పించింది ఏపీ సర్కారు.

రాష్టంలోని నిరుపేద ఈబీపీ.. బీసీ.. ఎస్సీ వర్గాలకు చెందిన వారు ఈ పథకంలో లబ్థిదారులు. సరకు డెలివరీ వ్యాన్లను రుణాల మీద ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఫోర్ వీలర్ మినీ ట్రక్కులను 60 శాతం రాయితీతో ఇవ్వనున్నారు. ఇందుకోసం అర్హుల నుంచి అప్లికేషన్లు కోరుతున్నారు. దీని కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఉండాల్సిన అర్హతల విషయానికి వస్తే..

దరఖాస్తు కుటుంబానికి నెలకు రూ.10వేల లోపు ఆదాయం.. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి.. పెన్షన్ సౌకర్యం పొందే వారికి అవకాశం ఉండదు. సదరు కుటుంబంలో నాలుగు చక్రాల బండి ఏదీ ఉండకూడదు. అంతేకాదు 21-45 ఏళ్ల లోపు వారై ఉండాలి. ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి. గతంలో బ్యాంకువద్ద అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా ఉన్న హిస్టరీ ఉండకూడదని పేర్కొంది.

ఈ పథకంలో భాగంగా ఎంపికైన వారు తొలుత రూ.58119 మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీనికి రూ.174,357 మొత్తాన్ని వాహనానికి తీసుకునే లోన్ కింద ఇస్తారు. ఇక ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.3,48,714 మొత్తాన్ని ఇస్తారు. బ్యాంకు రుణాన్ని ఆరేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్లు పెట్టుకోవటానికి చివరి తేదీ డిసెంబరు 5గా చెబుతున్నారు. మరిన్ని వివరాలు గ్రామ సచివాలయంలో తెలుసుకోవచ్చు. ఏమైనా.. ఇంత భారీ పథకం ఏ రాష్ట్ర సర్కారు అమలు చేసి ఉండదన్న మాట వినిపిస్తోంది.