Begin typing your search above and press return to search.

రివ‌ర్స్ టెండ‌రింగ్‌కు మ‌రో ప్రాజెక్టు సిద్ధం...!

By:  Tupaki Desk   |   22 Sep 2019 6:16 AM GMT
రివ‌ర్స్ టెండ‌రింగ్‌కు మ‌రో ప్రాజెక్టు సిద్ధం...!
X
పోలవరం రివర్స్ టెండరింగ్‌ తో తొలి విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ ప్రభుత్వం మ‌రో ప్రాజెక్టు రివ‌ర్స్ టెండ‌రింగ్‌ కు యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం చేసింది. పోలవ‌రం రివ‌ర్స్ టెండ‌రింగ్‌ తో దాదాపు రూ. 58 కోట్లు ఆదా చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్ర‌తిప‌క్షాల నోరు మూసి - ప్ర‌పంచానికి చంద్ర‌బాబు అవినీతి ఎలా?ఉందో క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్లుగా చూపిన వైసీపీ ప్ర‌భుత్వం రివ‌ర్స్ టెండ‌రింగ్‌ లో మ‌రో ముంద‌డు వేస్తోంది. కేంద్రం అడ్డు చెప్పినా - హైకోర్టులో పిటిషన్లు వేసినా దూకుడుగా ముందుకెళ్ళి ఫ‌లితాలు సాధించి కేంద్ర ప్ర‌భుత్వాన్ని కూడా నివ్వెర ప‌రిచింది.

దీంతో ఇదే ఊపులో ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్ట్ పనులలోనూ ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. నిపుణుల కమిటీ సూచన మేరకు వెలిగొండ పనులకు తాజాగా 553.13 కోట్ల అంచనా వ్యయంతో జలవనరుల శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. వెలిగొండ ప్రాజెక్టు పనులను మాజీ సీఎం చంద్ర‌బాబు బినామీగా చెపుతున్న ఏపీ ఎంపీ సీఎం రమేష్ కి చెందిన రిత్విక్ సంస్థకు గత ప్రభుత్వం అప్పగించింది. ఈ ప్రాజెక్ట్ పనుల నుంచి రిత్విక్‌ ని తప్పించింది సీఎం జ‌గ‌న్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం.

ఈ ప్రాజెక్టు టన్నెల్ టెండర్లలో అవినీతి జరిగిందని, రూ. 300 కోట్లకు పైగా కమీషన్ల రూపంలో త‌ర‌లించార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. దీంతో సీఎం జగన్ సర్కార్ రెండో టన్నెల్ పనులకు గాను రివర్స్ టెండరింగ్‌ కు వెళ్లాలని నిర్ణయించింది. వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ పనులకు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌ కు సిద్ధమైంది. 553.13 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 23 నుంచి బిడ్‌ లను స్వీకరించనుంది. బిడ్‌ ల దాఖలుకు అక్టోబర్ 9 తుది గడువుగా నిర్ణయించింది. అక్టోబర్ 11న బిడ్‌ - అదే రోజున మధ్యాహ్నం 2. 45 గంట‌ల‌కు ఈ వేలం నిర్వహించనుంది.

ఈ ప్రాజెక్టులో కూడా సీఎం జ‌గ‌న్ స‌ర్కారు ఇంత‌కు ముందుక‌న్నా త‌క్కువ ధ‌ర‌కు టెండ‌ర్ నిర్వ‌హిస్తే ఇక జ‌గ‌న్ స‌ర్కారుకు తిరుగే ఉండ‌దు. ఎందుకంటే స‌ర్కారు సొమ్మును అప్ప‌నంగా దోచిపెట్ట‌డం పాల‌కుల‌కు అల‌వాటే. అయితే అవినీతిని రూపుమాపేందుకు ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల్లో రివ‌ర్స్ టెండ‌రింగ్ కు పోయి ప్ర‌జాధ‌నం ఆదా చేయడం అంటే గొప్ప‌గా చెప్పుకోవాల్సిందే. జ‌గ‌న్ కు అనుభ‌వం లేని పాల‌న అంటూ విమ‌ర్శ‌లు గుప్పించే ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు ఈ రివ‌ర్స్ టెండ‌రింగ్ తో పెద్ద గుణ‌పాఠ‌మే నేర్పుతున్నారు జ‌గ‌న్‌.