Begin typing your search above and press return to search.

ఫారిన్ నుంచి వచ్చిన జగన్.. ఇంతకూ విదేశీ పెట్టుబడులు తెచ్చిందెంత?

By:  Tupaki Desk   |   31 May 2022 10:17 AM IST
ఫారిన్ నుంచి వచ్చిన జగన్.. ఇంతకూ విదేశీ పెట్టుబడులు తెచ్చిందెంత?
X
విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు దావోస్ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం రాత్రి ఆయన గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు అధికార పార్టీ నేతలు.. అధికారులు పోటీ పడ్డారు. ఇంతవరకు బాగానే ఉన్నా దావోస్ కు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. రాష్ట్రానికి తిరిగి రావటమే కాదు.. ఆయన పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు కూడా. పెట్టుబడుల కోసం వెళ్లినట్లుగా చెబుతున్న సీఎం జగన్.. దావోస్ కు కేటీఆర్ కంటే ఆలస్యంగా చేరుకోగా.. రాష్ట్రానికి తిరిగి రావటం కూడా లేట్ కావటం ఆసక్తికరంగా మారింది.

నిజానికి దావోస్ పర్యటన ఆద్యంతం జగన్ కు ఇబ్బందికరంగానే సాగిందన్న సంగతి తెలిసిందే. అధికారికంగా విడుదల చేసిన సమాచారం ప్రకారం దావోస్ కు నేరుగా వెళ్లాల్సి ఉంది. అందుకు భిన్నంగా ఆయన ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం మాత్రం దావోస్ కు దూరంగా ఉండే లండన్ కు వెళ్లటం.. అక్కడి నుంచి దావోస్ కు చేరుకోవటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రత్యేక విమానాన్ని ఉపయోగించిన తీరుపై విపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబును తప్పు పట్టిన జగన్.. తాను సీఎం హోదాలో మాత్రం కేవలం తన భార్య భారతితో కలిసి ప్రయాణించటాన్ని తప్పు పట్టటం తెలిసిందే.

ఇలా మొదలైన దావోస్ పర్యటన.. పెట్టుబడుల ఆకర్షణ అంశంలోనూ పలు విమర్శలు వెల్లువెత్తాయి. దేశీయ కంపెనీలైన అదానీ.. ఇతర సంస్థలతో ఒప్పందాల కోసం దావోస్ వెళ్లాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాత్రం.. దేశాల వారీగా పలు సంస్థలను తెలంగాణకు తీసుకొచ్చే విషయంలో కీరోల్ ప్లే చేశారని. .పలు సంస్థలతో ఆయన చేసుకున్న ఒప్పందాలే దీనికి నిదర్శనమన్న మాట వినిపిస్తోంది.

మరోవైపు.. ఏపీకి సంబంధించిన విదేశీ పెట్టుబడులు ఎంతమేర వచ్చాయన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం వివరాలు కూడా విడుదల చేయలేదన్న మాట వినిపిస్తోంది.

పెట్టుబడులు పెద్దగా రాని దావోస్ టూర్ వేళలోనే.. కోనసీమలో చోటు చేసుకున్న అనూహ్య హింసాకాండను డీల్ చేసే విషయంలో ముఖ్యమంత్రి జగన్ సమర్థంగా వ్యవహరించలేకపోయినట్లుగా చెబుతున్నారు.

జరిగిన ఘటనపై ఆయన దావోస్ నుంచి ఒక్క ప్రకటన చేయలేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే దావోస్ సమ్మిట్ ముగిసిన తర్వాత కూడా కాస్త ఆలస్యంగా జగన్ రాష్ట్రానికి చేరుకుంటే.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాత్రం ఆయనకంటే ముందు వచ్చేసి.. పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న వైనాన్ని ప్రస్తావిస్తున్నారు.