Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ జోస్యం: మూడేళ్లు దాటితే మూడిన‌ట్లే​

By:  Tupaki Desk   |   23 Feb 2016 4:18 PM GMT
జ‌గ‌న్ జోస్యం: మూడేళ్లు దాటితే మూడిన‌ట్లే​
X
ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసిన అనంత‌రం త‌న‌దైన శైలిలో ఆస‌క్తిక‌ర ప్ర‌సంగం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చేలా చూడాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసిన‌ట్లు చెప్పిన జ‌గ‌న్ ఈ సంద‌ర్భంగా ఏపీలో నెలకొన్న తాజా పరిస్థితులకు రాష్ట్రపతికి వివరించాన‌ని తెలిపారు. అనంత‌రం రాజ‌కీయాల‌పై మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై నిప్పులు చెరిగారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని జ‌గ‌న్‌ విమ‌ర్శించారు. నిసిగ్గుగా కోట్లాది రూపాయ‌లు, మంత్రి పదవులు ఎరవేస్తూ తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌ను త‌ప్ప అంద‌రినీ ప్ర‌లోభానికి గురిచేశార‌ని జ‌గ‌న్ సెటైర్ పేల్చారు. ఆయన జీవితమంతా దొడ్డిదారిన ఎమ్మెల్యేలను లాక్కోవడమే అలవాటని విమర్శించారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లారని చెప్పారు. ప్రలోభాలకు లొంగని మిగిలిన 62 మంది ఎమ్మెల్యేలకు జగన్‌ హ్యాట్సప్‌ చెప్పారు. ప్రజలు నిలదీస్తే పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పించేలా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారని అన్నారు.

రుణమాఫీ విషయంలో రైతులను ప్రభుత్వం మోసం చేసిందని జగన్‌ అన్నారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన ఏ హామీని నిల‌బెట్టుకోలేద‌ని ఆరోపించారు. ప్రజలు, దేవుడు అంతా చూస్తున్నారని, వీరు మొట్టికాయ వేస్తే చంద్రబాబు గూబ గుయ్యిమంటుందని జ‌గ‌న్ ఆక్షేపించారు. త్వరలోనే ఆయ‌న‌ ప్రజా వ్యతిరేకత చూస్తారని.... మూడో సంవత్సరం దాటితే టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి క్యూ కడతారని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఎమ్మెల్యేలు తన దగ్గర లేరని, ఆ సంఖ్య ఉంటే తప్పకుండా ప్రభుత్వాన్ని పడగొడతానని అన్నారు.