Begin typing your search above and press return to search.

సోనియా ఆహ్వానాన్ని చెత్త బుట్ట దాఖలు చేసిన జగన్?

By:  Tupaki Desk   |   15 May 2019 8:37 AM GMT
సోనియా ఆహ్వానాన్ని చెత్త బుట్ట దాఖలు చేసిన జగన్?
X
మొత్తానికి జగన్ ముందు సాగిలా పడేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఏ జగన్ ను అయితే తాము కాంగ్రెస్ నుంచి బయటకు పంపించామో అదే జగన్ ముందు ఇప్పుడు కాంగ్రెస్ మోకరిల్లింది. ఆ పార్టీ పెద్ద దిక్కు సోనియాగాంధీ స్వయంగా జగన్ కు లేఖ రాశారు. ఫలితాల అనంతరం ఢిల్లీకి రావాలని - తమ కూటమి మీటింగులో పాల్గొనాలని జగన్ మోహన్ రెడ్డి కి సోనియాగాంధీ లేఖ రాసింది. ఈ మేరకు ఈ అంశాన్ని జాతీయ మీడియా కూడా ధ్రువీకరిస్తూ ఉంది.

ఇలా జగన్ ముందు కాంగ్రెస్ పార్టీ మోకరిల్లినా వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఆ పార్టీని సీరియస్ గా తీసుకోవడం లేదని తెలుస్తోంది.

ఫలితాలు వచ్చిన వెంటనే ఢిల్లీలో ఎన్డీయేతర - యూపీఏ - తటస్థ పార్టీలతో సమావేశం నిర్వహించాలని సోనియాగాంధీ భావిస్తోంది. అందుకే ఆయా పార్టీల వాళ్లను ఆహ్వానిస్తే ఆమె లేఖలు రాశారు. అందులో భాగంగా జగన్ ను కూడా ఆహ్వానించారు. ఈ మేరకు కథనాలు వస్తూ వున్నాయి.

ఎలాగైనా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రయత్నంలో ఉన్న సోనియాగాంధీ ఇలా ఫలితాల వెల్లడికి ముందే ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగా ఒకప్పుడు తాము తీవ్రంగా ద్వేషించిన జగన్ కు కూడా ఆమె లేఖ రాశారు.

మరి సోనియాగాంధీ ఆహ్వానం మీద జగన్ ఏమనుకుంటున్నారు? సోనియా నిర్వహించే సమావేశానికి ఆయన హాజరవుతారా? అంటే.. ఆ సమస్యే లేదు అని అంటున్నాయి వైఎస్సార్సీపీ వర్గాలు. సోనియా గాంధీ పంపిన ఆహ్వాన పత్రాన్ని జగన్ బుట్ట దాఖలు చేశారని.. ఆ సమావేశానికి హాజరయ్యే ఉద్దేశం జగన్ కు లేదని వైఎస్సార్సీపీ నుంచి సమాచారం అందుతోంది.

ఫలితాలు వచ్చిన తర్వాత.. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రంలో మద్దతు విషయంలో జగన్ స్పందిస్తారని.. ఇలా లేఖలు రాయగానే అలా పరిగెత్తుకుంటూ వెళ్లేందుకు వైఎస్ జగన్ ఏమీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు లాంటి వ్యక్తి కాదనే విషయాన్ని కాంగ్రెస్ హై కమాండ్ గుర్తుంచుకోవాలని వైఎస్సార్సీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.