ఫ్యూచర్ (భవిష్యత్తు) ముందు పాస్ట్ (గతం) పక్కకు వెళ్లిపోయింది. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కోసం తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రపోజల్ కు జగన్ ఓకే చెప్పారు. తన తండ్రి షురూ చేసిన ఫెడరల్ ఫ్రంట్ కాన్సెప్ట్ కు దేశ వ్యాప్తంగా ఉన్న బలమైన నేతలతో భేటీ అవుతున్న కేసీఆర్.. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ తో చర్చలకు తన కుమారుడ్ని పంపుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రపోజల్ ను జగన్ ఓకే చేశారు. ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం హైదరాబాద్ లోని తన నివాసమైన లోటస్ పాండ్ కు కేటీఆర్ అండ్ కోలను రావాలని కోరారు. లంచ్ చేస్తూ మాట్లాడుకోవాలని డిసైడ్ చేశారు. జగన్ తో భేటీ కోసం కేటీఆర్ వెంట ఎంపీ వినోద్ కుమార్.. పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి.. శ్రావణ్ కుమార్ రెడ్డిలు వెళ్లనున్నారు. జగన్ ఇంటికి వెళ్లి వారు కీలక చర్చలు జరపనున్నారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్.. బీజేపీలకు వ్యతిరేకంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కాన్సెప్ట్ ను తీసుకొని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించటం.. పలువురు ముఖ్యనేతలతో భేటీ కావటం తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ జరిపిన టూర్లలో విపక్షంలో ఉన్న అధినేతలతోనూ భేటీ అయ్యారు. కర్ణాటకలో జేడీఎస్ అధినేత దేవెగౌడ.. తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ తో చర్చలు జరిపారు.తాజాగా మాత్రం తనకు బదులుగా తన కుమారుడు కేటీఆర్ ను పంపారు. ఫెడరల్ ఫ్రంట్ విషయమై కేటీఆర్ సమావేశం అవుతున్న మొదటి అధినేత జగన్ కావటం గమనార్హం.