Begin typing your search above and press return to search.

మోడీకి జ‌గ‌న్ చేసిన రిక్వెస్ట్ ఇదేన‌ట‌

By:  Tupaki Desk   |   7 Dec 2017 4:53 AM GMT
మోడీకి జ‌గ‌న్ చేసిన రిక్వెస్ట్ ఇదేన‌ట‌
X
ప్ర‌ధాని మోడీ.. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌ధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఏపీ విప‌క్షం వైపు బీజేపీ చూస్తోందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తుకు అవ‌కాశం ఉందా? బీజేపీతో జ‌గ‌న్ దోస్తీ చేస్తున్నారంటూ ఏపీ ముఖ్య‌మంత్రి వ‌ర్గీయులు చెప్పే మాట‌ల్లో నిజం ఎంత‌? ఆ మ‌ధ్య‌న ప్ర‌ధాని మోడీని క‌లిసిన సంద‌ర్భంగా జ‌గ‌న్ చేసిన రిక్వెస్ట్ ఏంటి? ఏపీ విప‌క్ష నేత చేసిన రిక్వెస్ట్‌కు మోడీ ఎలా రియాక్ట్ అయ్యారు? లాంటి ప్ర‌శ్న‌ల‌కు ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌మాధానాలు ఇచ్చారు.

బీజేపీతో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం ఉంధా? లేదా? అన్న ప్ర‌శ్న‌కు ఆయ‌న అంతే సూటిగా స‌మాధానం ఇచ్చారు. తాజాగా ఇచ్చిన ఒక ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో మ‌న‌సు విప్పిన జ‌గ‌న్‌.. చాలా విష‌యాల మీద స్ప‌ష్టంగా.. సూటిగా జ‌వాబులు చెప్పేశారు. కాంగ్రెస్ తో కుద‌ర‌క బ‌య‌ట‌కు వ‌చ్చేసిన జ‌గ‌న్‌.. బీజేపీతో ఎందుక‌ని పొత్తు పెట్టుకోలేద‌న్న ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. చాలా కార‌ణాల‌తో పొత్తు పెట్టుకోలేద‌న్నారు. ఏపీలో బీజేపీకి కానీ కాంగ్రెస్ కు కానీ వ్య‌క్తిగ‌త బ‌లం ఏమీ లేద‌న్న విష‌యాన్ని గుర్తు చేస్తూ.. ఆ రెండుపార్టీలు ఏదో ఒక పార్టీతో ఆధార‌ప‌డి మాత్ర‌మే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు.

బీజేపీతో పొత్తు విష‌యంలో త‌న‌కు ఎలాంటి దాప‌రికాలు లేవ‌ని.. తాను చాలా క్లియ‌ర్ గా ఉన్న‌ట్లు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. తాను పొత్తు పెట్టుకోవ‌టానికి ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని.. హోదా ఇస్తే తాను బీజేపీ ప‌క్షాన నిలుస్తాన‌ని చెప్పారు. ఆ మ‌ధ్య‌న ప్ర‌ధాని మోడీని క‌లిసిన సంద‌ర్భంగా తాను చేసిన ఏకైక రిక్వెస్ట్ గురించి జ‌గ‌న్ చెప్పారు.

"సార్‌.. నాది ఒక్క‌టే రిక్వెస్ట్‌.. ప్ర‌త్యేక హోదా ఇవ్వండి. హోదా ఇస్తే మీతో క‌లిసి ప‌ని చేస్తాన‌ని చెప్పా. దానికి ఆయ‌న సానుకూలంగా స్పందించారు. ప్ర‌త్యేక హోదా ఇస్తార‌న్న న‌మ్మ‌కం ఉంది. ఇస్తే క‌లుస్తాం. ఇవ్వ‌కుంటే క‌ల‌వాల్సిన అవ‌స‌రం లేదు" అని తాను స్ప‌ష్టంగా చెప్పిన‌ట్లు వెల్ల‌డించారు. బీజేపీతో జ‌గ‌న్ క‌లుస్తార‌న్న ప్ర‌చారం జోరుగా సాగ‌టం వెనుక మ‌త‌ల‌బు ఏమిట‌న్న ప్ర‌శ్న‌కు.. బీజేపీతో జ‌గ‌న్ క‌లుస్తాడ‌ని చెప్పి త‌న‌కు అనుకూల‌మైన మీడియా ద్వారా చంద్ర‌బాబు ప్ర‌చారం చేస్తార‌ని.. తాను అనుకున్న‌ట్లు రాయిస్తార‌ని చెప్పారు. ఓవైపు తాను బీజేపీతో ఉంటూనే.. వారు వేరే వారితో వెళ్లిపోతార‌న్న ప్ర‌చారాన్ని చేయిస్తుంటారు చంద్ర‌బాబు అని చెప్పారు.