Begin typing your search above and press return to search.

లేట్ చేయని జగన్.. నమ్ముకున్న వాళ్లకు!

By:  Tupaki Desk   |   20 July 2019 4:23 AM GMT
లేట్ చేయని జగన్.. నమ్ముకున్న వాళ్లకు!
X
నామినేటెడ్ పోస్టుల భర్తీ.. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్లు చంద్రబాబు తీరుపై ఒక దశలో పూర్తి అసహనం వ్యక్తం చేశారు. తమ పార్టీ చేతిలో అధికారం ఉన్నా నామినేటెడ్ పోస్టుల విషయంలో చంద్రబాబు నాయుడు నియామకాలు చేపట్టలేదు. వివిధ కార్పొరేషన్ల - ఇంకా అనేక నామినేటెడ్ పోస్టుల భర్తీని తన ఐదేళ్ల కాలంలో సరిగా చేపట్టలేదు చంద్రబాబు నాయుడు.

అవసరం అయిన వాటిని కూడా చంద్రబాబు నాయుడు భర్తీ చేయలేదు! ఎందుకు అంటే? అది చంద్రబాబు తీరు అని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఏదీ ఒక పట్టానా తేల్చే రకం కాదు ఆయన. అందుకే.. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఆశలు పెట్టుకున్న నేతలకు కూడా అంత తేలికగా చంద్రబాబు నాయుడు అవకాశం లేదని అంటారు.

తీరా అధికారానికి సమయం పూర్తి అవుతున్న దశల్లో అలాంటి పోస్టులను భర్తీ చేశారు. మంత్రి వర్గ విస్తరణ చేసినప్పుడు కొంతమంది అసంతృప్తులకు ఆ పదవులను ఇచ్చారు చంద్రబాబు నాయుడు. తీరా ఆ పదవులు దక్కిన కొంతకాలంలోనే టీడీపీ నుంచి అధికారం చేజారింది. దీంతో ఆ పదవుల్లోని వారు కూడా రాజీనామాలు చేసేశారు. కొందరు రాజీనామా చేయకపోతే జగన్ ప్రభుత్వం వారిని సాగనంపేలా ఉంది.

అయితే ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి మాత్రం సూటిగా సుత్తి లేకుండా స్పందిస్తూ ఉండటం గమనార్హం. నామినేటెడ్ పోస్టుల భర్తీని చకచకా చేపడుతున్నారు జగన్. అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్నంతలోనే వివిధ నియామకాలను పూర్తి చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు మూడేళ్లకు గానీ చేపట్టిన నియామకాలను జగన్ మూడు నెలల్లో పూర్తి చేసేలా కనిపిస్తూ ఉండటం గమనార్హం!