Begin typing your search above and press return to search.

న్యాయ‌వాదుల‌పై బాబు క‌ప‌ట ప్రేమ‌పై జ‌గ‌న్ ఫైర్

By:  Tupaki Desk   |   26 April 2018 12:28 PM GMT
న్యాయ‌వాదుల‌పై బాబు క‌ప‌ట ప్రేమ‌పై జ‌గ‌న్ ఫైర్
X
బీసీల సంక్షేమానికి తానే బ్రాండ్ అంబాసిడ‌ర్ అని చెప్పుకొనే ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తీరుపై వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ఫైర‌య్యారు. చంద్ర‌బాబు క‌ప‌ట ప్రేమ‌ను చూపుతున్నార‌ని జ‌గ‌న్ దుయ్య‌బ‌ట్టారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బీసీలను అణగదొక్కుతున్నారన్న జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య వెలుగులోకి తెచ్చిన సంగ‌తి తెలిసిందే. హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో బీసీ న్యాయ‌మూర్తుల‌కు అన్యాయం చేసిన విష‌యాన్ని ఆక్షేపించారు. బీసీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన అమర్‌ నాథ్‌ గౌడ్ - అభినవ కుమార్‌ చావల్లితో పాటు కమ్మ కులానికి చెందిన విజయలక్ష్మి - ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు,వెలమ కులానికి చెందిన కేశవరావు, బ్రాహ్మణ కులానికి చెందిన డీవీ సోమయాజులను సిఫార్సు చేశార‌ని పేర్కొంటూ అమర్‌ నాథ్‌ గౌడ్, అభినవ కుమార్ - గంగారావు - డీవీ సోమయాజులపై లేనిపోని ఆరోపణలు చేస్తూ 2017 మార్చి 21న చంద్రబాబు తప్పుడు నివేదిక పంపించారని ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించిన లేఖలను కూడా ఆయన బయటపెట్టడం క‌ల‌క‌లం సృష్టించింది.

దీనిపై న్యాయ‌వాదులు భ‌గ్గుమ‌న్నారు. బాబు త‌మ‌కు అన్యాయం చేసే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆక్షేపించారు. ఈ నేప‌థ్యంలో వైఎస్‌ జగన్ ట్విట్ట‌ర్‌లో స్పందించారు. రిటైర్డ్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య బయటపెట్టిన ఆధారాలు చూస్తే బీసీల మీద చంద్రబాబుకు ఉన్న ప్రేమ ఎంతో తెలుస్తుందని మండిప‌డ్డారు. జడ్జీల నియామకంలో చంద్రబాబు అడ్డుపడటం స‌రికాద‌ని అన్నారు. `చంద్రబాబు నోరు తెరిస్తే బీసీల సంక్షేమ అంటారు. మరి బీసీ లాయర్లు జడ్జిలు కాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు. బీసీ జడ్డిల నియమకాల్ని అడ్డుకునేలా తప్పుడు ఫీడ్‌ బ్యాక్‌ ఎందుకు ఇచ్చారు?`ని వైఎస్ జగన్ సూటిగా నిలదీశారు.

కాగా, చంద్ర‌బాబు నిర్ణ‌యంపై హైద‌రాబాద్‌ లో ప‌లువురు న్యాయ‌వాదులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. న్యాయమూర్తుల ఎంపికలో కులవివక్ష ఎదురవుతున్నదని చెప్పడానికి చంద్రబాబు లేఖ నిదర్శనమని పేర్కొన్నారు. న్యాయమూర్తుల పోస్టులకు సిఫార్సు అయిన ఐదుగురు న్యాయవాదులపై చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారన్నారు. ఆ ఆరోపణలన్నీ తప్పని కేంద్రానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఎస్సీ- బీసీలపై చంద్రబాబు కపటప్రేమ ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రికి చంద్రబాబు పంపిన జాబితాలో ఉన్న న్యాయవాదులకు జడ్జీలుగా వ్యవహరించే సమర్థత లేదని పేర్కొన‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు.