Begin typing your search above and press return to search.

హోదాపై జగన్ పోరుకు డేట్ ఫిక్స్

By:  Tupaki Desk   |   17 Sep 2016 5:10 AM GMT
హోదాపై జగన్ పోరుకు డేట్ ఫిక్స్
X
విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదాను సాధించేందుకు ఏపీ విపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. హోదా ఇవ్వకుండా కేంద్రం ప్యాకేజీతో సరిపెట్టిన వైనంపై ఇప్పటికే తన అసంతృప్తిని వ్యక్తం చేసిన జగన్.. గతంలో హోదా కోసం చాలానే పోరాటం చేశారు. అయినా కేంద్రంలో ఎలాంటి స్పందన లేదు. ఇదిలా ఉంటే.. కేంద్రం చెప్పిన మాటకు తలాడించే తీరును అలవాటు చేసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యమా అని.. హోదా స్థానే ప్యాకేజీ ప్రకటించి చేతులు దులుపుకునే పనిని కేంద్రం చేసింది.

హోదాను వదిలేసి.. ప్యాకేజీ పేరిట రాల్చిన నాలుగు మెతుకుల్ని పరమాన్నంగా ఫీలవుతూ.. ప్యాకేజీకి స్వాగతం పలుకుతున్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించటం తెలిసిందే. ఈ వ్యవహారంపై సీమాంధ్రుల్లో విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో హోదాపై పోరాటానికి సిద్ధమైన. జగన్.. ఈ నెల 22న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో యువభేరి పేరిట భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.

ఏలూరులోని శ్రీ కన్వెన్షన్ హాలులో ఉదయం 10 గంటలకు షురూ అయ్యే యువభేరి కార్యక్రమంలో యువకులు.. విద్యార్థులు.. నిరుద్యోగులు సహా అన్నివర్గాల వారు హాజరు కావాలని జగన్ కోరుతున్నారు. ప్రత్యేక హోదా కోసం సాగుతున్న పోరాటంలో భాగస్వాములు కావాలంటూ పిలుపునిచ్చిన ఆయన.. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్లుగా జగన్ మండిపడిన వైనాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. హోదా కారణంగా ఏపీకి జరిగే ప్రయోజనాల్ని ఆయా వర్గాల వారికి జగన్ వివరించనున్నారు. ముఖాముఖిలో హోదా మీద ఉన్నసందేహాల్ని తీర్చే కార్యక్రమాన్ని జగన్ చేపట్టినట్లుగా చెప్పాలి. హోదాపై ఇప్పటికే రాష్ట్ర బంద్ ను నిర్వహించిన జగన్.. తన తాజా యువభేరీ కార్యక్రమంతో ప్రత్యేక హోదా విషయంలో తన పోరాటం ఆగదన్న విషయాన్ని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్ప చెప్పేసినట్లే.