Begin typing your search above and press return to search.

పవన్‌ ఎజెండాను ముందే చేపట్టిన వైకాపా!

By:  Tupaki Desk   |   12 Sep 2016 4:10 AM GMT
పవన్‌ ఎజెండాను ముందే చేపట్టిన వైకాపా!
X
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు తన పోరాటం మూడంచెల్లో ఉంటుందని హీరో - జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. అయితే వాటికి డెడ్‌ లైన్లు లేవు. ఎప్పటిదాకా ఒకటవ అంచె సాగుతూ ఉంటుందో.. ఎప్పటినుంచి రెండో అంచె పోరాటంలోకి వెళ్తారో తెలియదు. ఇలాంటి నేపథ్యంలో మొత్తానికి కేంద్ర మంత్రులు - ఎంపీలు వారి ఇళ్ల ముందర ధర్నాలు చేస్తాం. ప్రజలు ఇబ్బందికి గురికావడం కాదు.. హోదాను తీసుకురావాల్సిన ఎంపీలు అందరి ఇళ్ల ఎదురుగా ధర్నాలు చేయించడం తన ఎజెండాగా పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. ఇంతవరకు అందరికీ తెలిసిన సంగతే.

అయితే పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం ఉన్న సుషుప్తావస్థలోంచి నిద్ర ఎప్పటికి మేల్కుంటారో, రెండో దశ పోరాటానికి ఎప్పటికి శ్రీకారం చుడుతారో ఎవరికి ఎరుక! కానీ పవన్‌ ఆలోచనల్లోని పనిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు అప్పుడే ఆచరణలో పెట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అలుపెరగని పోరాటాన్ని చేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. బంద్‌ తర్వాత కూడా పలుచోట్ల వైకాపా ఆధ్వర్యంలో హోదా కోసం నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా నెల్లూరు వైకాపా కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేశారు.

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నివాసాన్ని ముట్టడించడానికి కూడా వారు ప్రయత్నించారు. స్థానికంగా వెంకయ్యనాయుడు ఇంటి వరకు వారు ర్యాలీ కూడా నిర్వహించారు. ఇంటికి చేరుకోకముందే.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. చూడబోతే పవన్‌ కల్యాణ్‌ తన రెండో దశలో చేయాలనుకుంటున్న పనిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అప్పుడే మొదలు పెట్టేసినట్టుగా ఉన్నదని జనం అనుకుంటూ ఉండడం విశేషం.