Begin typing your search above and press return to search.

ఈ సలహాలరావులున్నారే... ఏపీలో మరొకరుట...!

By:  Tupaki Desk   |   28 Feb 2023 12:47 PM GMT
ఈ సలహాలరావులున్నారే... ఏపీలో మరొకరుట...!
X
సలహా ఇవ్వడం సులువు. పుచ్చుకోవడం బహు కష్టం. ఎంతటి దగ్గరవారు అయినా సలహా ఇస్తే చెడ్డ చికాకుగా ఉంటుంది. మరీ చొరవ తీసేసుకుంటున్నారు అని మండుతుంది కూడా. సలహాలరావులు కూడా ఊరికే కూర్చోరు. ఏదో ఒకటి గిల్లుతూంటారు. బోరు కొట్టిస్తారు. అందుకే సలహాలు వినడం అన్నది తలకాయ నొప్పి. అలా అని పూర్తిగా పక్కన పెట్టరు కానీ కొందరిని నియమించుకుంటారు. పరిమితికి లోబడి ఆ తల నొప్పిని భరిస్తారు.

ఏపీ ప్రభుత్వం విషయానికి వస్తే ఎంత ఓపికో మరి. సలహాలరావులను అలా పెంచుకుంటూ పోతున్నారు. నాలుగేళ్ళ క్రితం మెల్లగా మొదలెట్టి ఇపుడు ఆ నంబర్ ని ఏ అరవై రెండు దాకానో చేర్చారు. వీరంతా ఏమి చేస్తున్నారు. ఏమి చేయాలి అంటే జవాబు అయితే లేదు. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలు ఎవరి సలహా వినరు అని ఒక ప్రచారం ఉంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. అదే వాస్తవం అనుకుంటే ఒక్క సలహాదారు కూడా అవసరం లేదు.

ఒకవేళ వింటున్నారు అనుకున్నా ఇంతమంది అసలు అవసరం లేదు. కానీ ఇక్కడ ఈ పదవులు అన్నీ కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి కాబట్టి అలా నింపేసుకుంటూ పోతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. దీని మీద రెబెల్ ఎంపీ రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్ ఒకటి విచారణలో ఉంది. అలాగే అసలు సలహాదారులు ఏపీకి అవసరమా వారి విధివిధానాలు ఏంటి అంటూ మరికొన్ని పిటిషన్లు కూడా పడ్డాయి.

ఈ కేసుల విచారణ దశలోనే హై కోర్టు ప్రభుత్వాన్ని ఘాటుగానే ప్రశ్నించింది. అసలే ఏపీ ఆర్ధిక పరిష్తితి ఏమాత్రం బాలేదు కదా. ఇంతమంది సలహాదారులు అవసరమా అని కూడా అడిగింది. ఇలా చూస్తూంటే రేపటి రోజున తాశీల్దారు పదవులకు కూడా సలహాదారులను నియమించేలా ఉన్నారే అని సెటైర్లు వేసింది. అయినా ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు అంటున్నారు.

అందుకే మరో కొత్త సలహాదారుణ్ణి కూడా ప్రభుత్వం అపాయింట్ చేయబోతోందిట. తాజాగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సీఎం జగన్ చాలా నిదానంగా వారి స‌మ‌స్య‌లు విన్నారు. ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ చర్చెస్‌ తరపున హాజరైన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఈ సంద‌ర్భంగా చర్చిల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఛారిటీ సంస్ధలు నడుపుతున్నవారికి స్ధానిక పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నేపధ్యంలోనే జగన్ కొత్త సలహాదారుని నియమిస్తామని ప్రకటించారు. అదేలా అంటే చర్చిలు, వాటి ఆస్తుల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకునే దిశగా అలాగే, క్రిస్టియన్‌ సమాజం, సంఘాల ప్రతినిధుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించేందుకు ఒక సలహాదారును నియమిస్తామ‌ని జగన్ హామీ ఇచ్చారు. అలా కొత్త సలహాదారుణ్ణి నియమిస్తే పూర్తి స్థాయిలో వారి సమస్యలు పరిష్కారం అవుతాయని సీఎం అభిప్రాయపడుతున్నారు అన్న మాట.

అంటే మరో కుర్చీ వేసుకో అన్నట్లుగా అధికారులు అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే సలహదారులు ఇంతవరకూ కుర్చీలలోనే కూర్చుంటున్నారు. ఆ తరువాత నెలవారీ జీతాలను అందుకుంటున్నారు. ఆ విధంగా వారి నంబర్ పెరుగుతోంది తప్ప ప్రభుత్వానికి కానీ ఇటు ప్రజలకు కానీ ఉపయోగం ఏమైనా ఉందా అంటే నిల్ అనే అంటున్నాయి విపక్షాలు అయినా ఈ సలహాల్రావులు ఉన్నారే అని మరోసారి అనుకోవాల్సి వస్తోందటే అందంతా వైసీపీ పుణ్యమే కదా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.