Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ మాటః 2018లోనే ఎన్నికలు

By:  Tupaki Desk   |   30 Nov 2016 5:07 AM GMT
జ‌గ‌న్ మాటః 2018లోనే ఎన్నికలు
X
వైసీపీ అధినేత - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ఆస‌క్తిక‌ర‌మైన జోస్యం చెప్పారు. రెండ్రోజుల పర్యటన కోసం సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన పులివెందులకు వచ్చిన జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో పులివెందుల - జమ్మలమడుగు నాయకులతో పలు సమస్యలపై చర్చించారు. అనంతరం వారితో జ‌గ‌న్ మాట్లాడుతూ 2018లోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయని చెప్పారు. ఇందుకోసం కార్య కర్తలు - నాయకులు సిద్దంగా ఉండాలని జ‌గ‌న్ సూచించారు.

రాష్ట్రంలో అభివృద్ది పడకేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని వైఎస్ జ‌గ‌న్ త‌ప్పుప‌ట్టారు. అధికారంలో ఉండే ఏ ప్రభుత్వమైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీలకతీతంగా పని చేయాలని చెప్పారు. టీడీపీ పథకాలన్నీ పచ్చ చొక్కాలకే దక్కుతున్నాయనీ, సామాన్యు లెవ్వరికీ పథకాలు అందడం లేదని జ‌గ‌న్ అన్నారు. టీడీపీ సర్కార్ చేప‌ట్టిన‌ ఏ పథకమైనా జన్మభూమి కమిటీ సభ్యులు చెప్పిన వారికే ఇస్తున్నారని ఆరోపించారు. వారిలో కూడా పలుకుబడి ఉన్నవారికే మంజూరు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో గూడు లేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారనీ, పార్టీల కతీతంగా అర్హులైన వారికి పక్కా గృహాలు మంజూరు చేయాలని జ‌గ‌న్‌ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రజలు ఎన్నో సమస్య లతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలకు హామీ ఇచ్చారు. అంతకు ముందు సింహాద్రిపురంలో ఎంపి నిధులతో ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంటును ప్రారంభించారు.

కాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏపీ సీఎం చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు. హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆర్కే మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుతో లాభపడింది ఎవరైనా ఉన్నారంటే.. అది చంద్రబాబు నాయుడు - ఆయన బినామీలేనని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల వేధింపులు - మోసాలు భరించలేక పొలాలు అమ్ముకుంటే చివరికి డబ్బులు మిగిలే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు. భూములు అమ్ముకున్న చాలా మంది రైతులకు బ్యాంకు ఖాతాలు లేవని, వారంతా నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఆర్కే ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సామాన్యులు ఎదుర్కొంటున్న నోట్ల కష్టాలపై చర్చించేందుకు తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలని ఆర్కే డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు ప్రతి ఎమ్మెల్యేకు అరగంట సమయం ఇవ్వాలని కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/