Begin typing your search above and press return to search.

జగన్‌ షెడ్యూళ్లు ప్లాన్‌ చేస్తున్నది ఎవరు?

By:  Tupaki Desk   |   10 Sept 2015 3:37 PM IST
జగన్‌ షెడ్యూళ్లు ప్లాన్‌ చేస్తున్నది ఎవరు?
X
అడుసు తొక్కనేల.. కాలు కడగనేల? అనేది పురాతనమైన ఒక సామెత. ఇది దాదాపు అందరూ చదువుకున్నదే. కాకపోతే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం ఆ సామెత చెప్పే నీతిని ఆచరణలో గుర్తుంచుకోవడంలో విఫలమవుతున్నట్లుగా కనిపిస్తోంది. నిర్ణయాలను ప్రకటించడం.. ఆ తర్వాత వాటిలో లోపాలను గుర్తించడం.. ఆ తర్వాత.. నాలిక్కరుచుకుని.. వాటిని సరిదిద్దుకోవడం ఇటీవలికాలంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కు చాలా రివాజుగా మారిపోయింది. ఒకసారి మాత్రమే కాదు.. రెండోసారి కూడా అచ్చంగా అలాగే జరుగుతోంది.

గత నెలలో వైఎస్‌ జగన్‌ ఢిల్లీలో దీక్ష నిర్వహించడానికి సంకల్పించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం కోసం ఆయన ఆ దీక్ష పెట్టుకున్నారు. నెలాఖరులో జరిగిన ఆ దీక్షకు వచ్చిన స్పందన మాత్రం తక్కువ. నిజం చెప్పాలంటే.. దాన్ని గురించి ప్రజలు పట్టించుకున్నది కూడా చాలా తక్కువ. ఎందుకంటే....ప్రజలు పండుగల మూడ్‌ లో ఫుల్‌ బిజీగా ఉండే సమయంలో ఆయన దీక్ష షెడ్యూలు చేశారు. 28న వరలక్ష్మీ వ్రతం, 29న రాఖీ పూర్ణిమ పక్కపక్కనే వచ్చాయి. ఆ తర్వాత ఆదివారం. ప్రజలంతా పండుగలు , సెలవుల మూడ్‌ లోనే ఉండిపోయారు. జగన్‌ దీక్షను పట్టించుకోడానికి కూడా వారికి ఖాళీ లేదు. పూర్‌ స్పందన తర్వాత.. కారణాలు ఆరా తీస్తే ఇది వెల్లడైందిట. 28, 29 తేదీల్లో పండుగలు అనే సంగతి ఎప్పుడో నిర్ణయమైపోయి ఉంటుంది. మరి జగన్‌ దీక్షను షెడ్యూలు చేసిన వారెవరో గానీ.. అనుకున్నంత హిట్‌ కాకుండా చేశారు.

ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్షకు కూడా అలాంటి దుర్ముహూర్తాన్నే సెట్‌ చేశారు గానీ.. మొదలయ్యేలోగానే.. దాన్ని గుర్తించి ముందే సరిదిద్దుకున్నారు. అసెంబ్లీ ముగిసిన రోజునే జగన్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టి.. ఈనెల 15న గుంటూరులో ఆమరణ దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించేశాడు. అయితే ఆమరణ నిరాహార దీక్ష అంటే గరిష్టంగా అయిదురోజుల పాటూ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎటూ పోలీసులు అరెన్టు చేసి ఆస్పత్రికి తరలించి, బలవంతంగా విరమింపజేసేస్తారు. అరటే 15నుంచి 5 రోజుల గ్యాప్‌లో 20 వతేదీ వచ్చేసరికి రాష్ట్రంలో వినాయకచవితి సందర్భంగా పదిరోజులు జరిగే ఉత్సవాలు ముమ్మరంగా ఉంటాయి. 17న చవితి కాగా, జగన్‌ ను అరెస్టు చేసే సమయానికి రాష్ట్రంలో ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించాలంటే. ప్రజలు పెద్దగా సహకరించే పరిస్థితి ఉండదు. ఇవన్నీ లెక్కలు వేసుకుని దీక్షను 26వ తేదీకి మార్చారు.

అసలు ఇన్ని సార్లు షెడ్యూళ్లు మార్చుకోవడం ఏమిటి? ప్రోగ్రాం డిజైన్‌ చేసే ముందు పార్టీ వ్యూహకర్తలు కనీసం క్యాలెండర్‌ కూడా చూసుకోరా అని పలువురు విస్తుపోతున్నారు.