Begin typing your search above and press return to search.

సజ్జ‌ల మండ‌లికి.. జ‌గ‌న్ వ్యూహం ఇదేనా?

By:  Tupaki Desk   |   15 July 2021 6:48 AM GMT
సజ్జ‌ల మండ‌లికి.. జ‌గ‌న్ వ్యూహం ఇదేనా?
X
ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్రభుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి విష‌యంలో జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటారా? అంటే అవున‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. త‌న‌కు విశ్వాస‌పాత్రుడిగా ఉన్న స‌జ్జ‌లను వ‌దులుకునేందుకు ఇష్ట‌ప‌డ‌ని జ‌గ‌న్ ఆయ‌న‌కు రాజ‌కీయంగా ఓ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్పుడు త‌న‌ను చుట్టుముడుతోన్న విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల నేప‌థ్యంతో జ‌గ‌న్ త్వ‌ర‌లోనే స‌జ్జ‌ల‌పై ఓ నిర్ణ‌యం తీసుకునే వీలుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్నాయి. ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఉన్న స‌జ్జ‌ల ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌ను మీడియా ముఖంగా స‌మ‌ర్థిస్తూ వ‌చ్చారు. మ‌రోవైపు వైఎస్సార్‌సీపీ రాజ‌కీయ ప్ర‌త్యర్థుల‌పై ఆయ‌న విమ‌ర్శ‌లూ చేస్తున్నారు.

దీంతో ఇటీవ‌ల హైకోర్టు.. స‌ల‌హాదారుల విధులు ఏమిటీ? వాళ్లు రాజ‌కీయాలు మాట్లాడొచ్చా? అని ప్ర‌శ్నించి.. స‌ల‌హాదారుల విధివిధానాల‌పై ప్ర‌భుత్వం నుంచి స్ప‌ష్ట‌త‌ను కోరింది. దీంతో ఇదే అదనుగా స‌జ్జ‌ల‌ను ప్ర‌త్య‌ర్థి పార్టీలు, వైసీపీ వ్య‌తిరేక మీడియా ల‌క్ష్యంగా చేసుకుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న షాడో సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లూ వ‌చ్చాయి.

స‌జ్జ‌ల తీరు ఇలాగే కొన‌సాగితే ఆయ‌న‌పై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో స‌జ్జ‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించిన జ‌గ‌న్‌.. ఆయ‌న‌ను మండ‌లికి పంపించి నేరుగా రాజ‌కీయాల్లోకి తీసుకునే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఆ దిశ‌గా జ‌గ‌న్ ఇప్ప‌టికే క‌స‌ర‌త్తులు పూర్తి చేశార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. శాస‌న మండ‌లిలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న భ‌ర్తీల్లో భాగంగా స‌జ్జ‌ల‌కు అవ‌కాశం ఇచ్చి.. ఆ త‌ర్వాత మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టినా ఆశ్చ‌ర్యం లేద‌ని అనుకుంటున్నారు. మంచి విష‌య పరిజ్ణానం ఉన్న స‌జ్జ‌ల ప్ర‌భుత్వానికి అద‌న‌పు బ‌లంగా మారే అవ‌కాశ‌ముంది.

ప్ర‌స్తుతం అధికార పార్టీ త‌ర‌పున కానీ ప్ర‌భుత్వం త‌ర‌పున కానీ గ‌ట్టిగా మాట్లాడేవాళ్లు ఎవ‌రూ లేక‌పోవ‌డం ఇబ్బందిగా మారింది. నోటికి ఎంతోస్తే అంతే మాట్లాడే నాయ‌కులున్నారు. ఈ నేప‌థ్యంలో ఆచితూచి.. వివాదాల‌కు తావివ్వ‌కుండా మాట్లాడే స‌జ్జ‌ల లాంటి నాయ‌కుల అవ‌స‌రం ఉంద‌ని జ‌గ‌న్ భావించారు. అందుకే ఆయ‌న మ‌రింత ప్రాధాన్యం ఇవ్వ‌డంతో విమ‌ర్శ‌కుల‌కు చెక్ పెట్టే అవ‌కాశం ఉంద‌ని అనుకుంటున్నారు.