Begin typing your search above and press return to search.

వైఎస్ తరహాలో భారీ పాదయాత్రకు జగన్ ప్లాన్

By:  Tupaki Desk   |   19 April 2016 7:12 AM GMT
వైఎస్ తరహాలో భారీ పాదయాత్రకు జగన్ ప్లాన్
X
మంచి ఊపు మీద ఉన్నప్పుడే ఎన్నికల్లో ఓటమితో అధికారం అందుకోలేకపోయారు జగన్... ఆ తరువాత ఆ ఊపును కొనసాగించడంలో విఫలమై... అనేక తప్పిదాలు చేస్తూ ఎమ్మెల్యేలను పోగొట్టుకుంటూ రోజురోజుకూ కష్టాల్లో చిక్కుకుంటున్నారు. బలం దారుణంగా తగ్గుతోంది. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి మరింత దిగజారినా ఆశ్చర్యపోనవసరం లేనట్లుగా ఉంది. ఇదీ, ప్రస్తుతం ఏపీలో విపక్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుపడిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో మొదలైన జంపింగ్ పర్వం నాన్ స్టాప్ గా కొనసాగుతుండడంతో ఆయన రాజకీయ భవితవ్యం చిక్కుల్లో పడుతోంది.

తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ మళ్లీ జనంలోకి వెళ్లడానికి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఓదార్పు యాత్ర - పరామర్శ యాత్రల పేరిట తెలుగు నేలను చుట్టేసిన జగన్... తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దీక్షలు చేపట్టారు. వీటికి భిన్నంగా ఈసారి ఒకే విడతలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలను కవర్ చేస్తూ ఒకే విడతలో భారీ పాదయాత్ర చేపట్టేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా సమాచారం. గతంలో జగన్ తండ్రి - దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆయనను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఆ తర్వాత గడచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత - ఏపీ సీఎం కూడా భారీ పాదయాత్రను చేపట్టారు. ఈ యాత్ర చంద్రబాబుకు తిరిగి అధికారం కట్టబెట్టడంలో పూర్తిగా కాకున్నా కొంతమేర పనిచేసిందనే చెప్పాలి. ఆ తరహాలోనే జగన్ కూడా భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టేందుకు సమాలోచనలు చేస్తున్నారు. ఈ యాత్రతో అటు ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పిస్తూనే, ఇటు తన పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలను నిలువరించవచ్చన్న యోచనలో జగన్ భారీ కసరత్తే చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ యాత్రకు సంబంధించి త్వరలోనే జగన్ ప్రకటన చేసే అవకాశాలున్నాయి.