Begin typing your search above and press return to search.

గోదావ‌రి జిల్లాల తీర్పును జ‌గ‌న్ మార్చేస్తారా?

By:  Tupaki Desk   |   22 April 2018 9:52 AM GMT
గోదావ‌రి జిల్లాల తీర్పును జ‌గ‌న్ మార్చేస్తారా?
X
ఏపీ రాజ‌కీయాల్లోనే కాదు... తెలుగు నేల ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న స‌మ‌యంలోనూ ఉభ‌య గోదావ‌రి జిల్లాలైన తూర్పు గోదావ‌రి జిల్లా - ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలకు చెందిన ఓట‌ర్లు ఏ పార్టీకి ఓటేస్తే... ఆ పార్టీకే అధికారం ద‌క్క‌డం ఖాయ‌మ‌న్న వాద‌న ఉన్న విష‌యం తెలిసిందే. ఇది వాద‌న‌కే ప‌రిమితం కాని విష‌యం. ఎందుకంటే ఇప్ప‌టిదాకా జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లోనూ ఇదే నిజ‌మైంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లోనూ ఈ రెండు జిల్లాలు టీడీపీకే ప‌ట్టం క‌ట్ట‌గా... రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ వైపు బ‌లంగా గాలులు వీచినా - వెంట్రుక వాసిలో అధికారం టీడీపీకి ద‌క్కింది. అంతేనా.. కేవ‌లం 5 ల‌క్ష‌ల ఓట్ల తేడాతో మాత్ర‌మే వైసీపీ విప‌క్షంలో కూర్చోవాల్సి వ‌చ్చింది. తూర్పు గోదావ‌రి జిల్లాలో కొంత మేర ప్ర‌భావం చూపిన వైసీపీ... ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో మాత్రం పూర్తి స్థాయిలో చ‌తికిల‌బ‌డింద‌నే చెప్పాలి. ప‌శ్చిమ‌లో వైసీపీకి ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా రాలేదు. కాపుల‌తో పాటు క‌మ్మ సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉన్న ఈ జిల్లాలో టీడీపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాగా... కాపులే మెజారిటీగా ఉన్న తూర్పులో వైసీపీ కొంత మేర మంచి ఫ‌లితాల‌నే సాధించింది. అయితే ఆ త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిణామాల్లో భాగంగా వైసీపీ టికెట్ల‌పై ఎమ్మెల్యేలుగా గెలిచిన తూర్పు నేత‌లు టీడీపీలోకి మారిపోయారు. ఓ ఎమ్మెల్సీ కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి జంపైపోయారు. మొత్తంగా ప‌రిస్థితి చూస్తుంటే... ఈ రెండు జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

అయితే ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో మెజారిటీ సామాజిక వ‌ర్గంగా ఉన్న కాపులు మెజారిటీగా ఉన్న ఈ జిల్లాల్లో ఇప్పుడిప్పుడే ప‌రిస్థితి మారుతున్న‌ట్లుగా స్ప‌ష్ట‌మైన సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో మెజారిటీ ఓట‌ర్లుగా ఉన్న కాపుల‌కు ఇచ్చిన హామీని టీడీపీ నెర‌వేర్చ‌ని వైనం కార‌ణంగా ఇప్పుడు ఆ పార్టీపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అంతేకాకుండా అధికార పార్టీ నేత‌ల ఆగ‌డాల‌తో జ‌నం కూడా విసిగిపోయార‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. మ‌రోవైపు మొన్న‌టిదాకా టీడీపీ మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీకి చెందిన కీల‌క నేత‌, త్వ‌ర‌లోనే బీజేపీ ఏపీ శాఖ ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు... టీడీపీ పాల‌న‌పై నిప్పులు చెర‌గ‌డంతో పాటుగా చంద్ర‌బాబునే టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం కూడా ప‌రిస్థితి మార్పున‌కు కార‌ణంగా చెబుతున్నారు. అంతేకాకుండా కాపు సామాజిక వ‌ర్గానికే చెందిన జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా గోదావ‌రి జిల్లాల‌కు చెందిన వారే. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని మొగ‌ల్తూరు ప‌వ‌న్ సొంతూరు. ప‌వ‌న్‌ కు ఏమాత్రం సీట్లు వ‌చ్చినా... ఈ రెండు జిల్లాల నుంచే అదికంగా వ‌స్తాయ‌న్న విశ్లేష‌ణ‌లు కూడా సాగుతున్నాయి. అయితే ప‌వ‌న్ కూడా మొన్న‌టిదాకా టీడీపీకి మిత్రుడిగా వ్య‌వ‌హ‌రించినా... ఇప్పుడు సోము వీర్రాజుకు మ‌ల్లే... టీడీపీకి బ‌ద్ధ శ‌త్రువుగా మారిపోయారు. టీడీపీ పాల‌న‌తో పాటు చంద్ర‌బాబు ఫ్యామిలీపైనా అవినీతి ఆరోప‌ణ‌లు చేసిన ప‌వ‌న్‌... జ‌నం దృష్టిలో బాబు ఫ్యామిలీ ప్ర‌తిష్ఠ‌పై అనుమానాలు రేకెత్తేలా చేశార‌ని కూడా చెప్ప‌క త‌ప్ప‌దు. బాబు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ప‌వ‌న్ చేసిన విమ‌ర్శ‌ల‌కు ఇప్ప‌టిదాకా టీడీపీ నుంచి స‌రైన కౌంట‌రే రాలేద‌న్న వాద‌న ఉంది.

ఇదంతా బాగానే ఉన్నా... వ‌చ్చే ఎన్నిక‌ల్లో వెంట్రుక వాసిలో చేజారిన అధికారాన్ని ఈ ద‌ఫా ఎలాగైనా ఒడిసిప‌ట్టాల్సిందేనన్న క‌సితో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర త్వ‌ర‌లోనే ఈ జిల్లాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంది. రాయ‌ల‌సీమ జిల్లాల‌ను దాటుకుని కోస్తాంధ్ర‌కు చెందిన మూడు జిల్లాల‌ను చుట్టేసిన జ‌గ‌న్‌... ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. కృష్ణా జిల్లాలో యాత్ర ముగిసిన మ‌రుక్ష‌ణ‌మే జ‌గ‌న్ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో అడుగుపెట్ట‌నున్నారు. జ‌గ‌న్ యాత్ర కొన‌సాగుతున్న కొద్దీ జ‌గ‌న్‌కు ప్ర‌జా మ‌ద్ద‌తు అంతకంత‌కూ పెరిగిపోతోంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇందుకు నిద‌ర్శ‌న‌మే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జ‌గ‌న్ యాత్ర‌కు ద‌క్కిన మ‌ద్ద‌తు అని కూడా చెప్పుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాతో పాటు తూర్పు గోదావ‌రి జిల్లాలోనూ జ‌గ‌న్ యాత్ర‌కు జ‌నం పోటెత్తుతార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఎందుకంటే... కాపుల‌కు ఇచ్చిన హామీని చంద్ర‌బాబు నెర‌వేర్చ‌క‌పోవ‌డం... ప‌వ‌న్ - బీజేపీల‌ను దూరం చేసుకోవ‌డంతో టీడీపీ ఈ జిల్లాల్లో బాగానే ప‌లుచ‌నైపోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

అంతోఇంతో ప్ర‌భావం చూపిస్తార‌ని భావిస్తున్న ప‌వ‌న్ కూడా రాష్ట్రంలో అధికారం చేప‌ట్టే అవ‌కాశాలు లేవ‌న్న వాస్త‌వాన్ని ఇప్ప‌టికే ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు గ్ర‌హించార‌ని, దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌యుడిగా, సంక్షేమ పాల‌న‌లో త‌నదైన స‌త్తా చూపుతార‌న్న విష‌యంలో నానాటికీ త‌న‌దైన శైలిలో న‌మ్మ‌కం పెంచుకుంటున్న జ‌గ‌న్ వైపు ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌డం ఖాయ‌మ‌న్న వాద‌నే వినిపిస్తోంది. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌హాప్ర‌స్థానం పేరిట చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు కూడా గోదావ‌రి జిల్లాలు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన విష‌యాన్ని కూడా ఈ సంద‌ర్భంగా విశ్లేష‌కులు ప్ర‌స్తావిస్తున్నారు. రాజ‌న్న బిడ్డ‌గా, అవ‌కాశవాద రాజ‌కీయాల‌కు ఆమ‌డంత దూరంలో ఉండే నేత‌గా జ‌గ‌న్ ఇప్ప‌టికే మంచి మైలేజీలోనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ యాత్ర‌కు ఈ రెండు జిల్లాలు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డం ఖాయ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది. అంతేకాకుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఈ రెండు జిల్లాలు త‌న పార్టీ వెంట న‌డిచేందుకు ఇప్ప‌టికే జ‌గ‌న్ ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనూ ముందుకు సాగుతున్న‌ట్లుగా కూడా ప్ర‌చారం సాగుతోంది. ఈ రెండు జిల్లాల‌కు చెందిన పార్టీ ప‌రిస్థితుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష చేస్తున్న జ‌గ‌న్‌... టీడీపీకి చుక్క‌లు చూపించే విధంగా ఈ రెండు జిల్లాల వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ రెండు జిల్లాల‌కు సంబంధించి పార్టీలో అక్క‌డ‌క్క‌డ లుక‌లుక‌లు వినిపిస్తున్న వైనంపైనా జ‌గ‌న్ దృష్టి సారించేశార‌ని, త్వ‌ర‌లోనే ఈ జిల్లాల్లో వైసీపీ బ‌లం బాగానే పుంజుకుంటుంద‌ని కూడా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.