Begin typing your search above and press return to search.

బ‌డ్జెట్ స‌మావేశాల్లో జ‌గ‌న్ వ్యూహమిదేనా?

By:  Tupaki Desk   |   29 Jan 2017 9:23 AM GMT
బ‌డ్జెట్ స‌మావేశాల్లో జ‌గ‌న్ వ్యూహమిదేనా?
X
ఆంధ్రోళ్ల భ‌విష్య‌త్తును దిశానిర్దేశం చేసే ప్ర‌త్యేక హోదా అంశాన్ని మ‌రింత సీరియ‌స్ గా తీసుకుంటున్నారు ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. మాట‌ల‌తో మ‌భ్య‌పెట్టి.. ఆంధ్రోళ్ల‌ను మోసం చేస్తున్న మోడీ స‌ర్కారుకు షాకిచ్చేలా.. హోదాపై ఆంధ్రోళ్ల ఆకాంక్ష ఏ స్థాయిలో ఉంద‌న్న విష‌యాన్ని అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చేయ‌టం కోసం జ‌గ‌న్ వ్యూహ ర‌చ‌న చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

త్వ‌ర‌లో స్టార్ట్ కానున్న పార్ల‌మెంటు స‌మావేశాల నేప‌థ్యంలో.. అక్క‌డ పార్టీ అనుస‌రించాల్సిన వ్యూహంపై పార్టీ పార్ల‌మెంట‌రీ స‌మావేశాన్ని తాజాగా జ‌గ‌న్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌ల‌తో మాట్లాడుతూ.. హోదా ఏపీకి సంజీవినిగా మారుతుంద‌ని.. హోదా లేకుండా రాష్ట్రానికి భ‌విష్య‌త్తు లేద‌న్న విష‌యాన్ని తేల్చిన జ‌గ‌న్‌.. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా హోదా అంశం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా వ్య‌వ‌హ‌రించాల‌ని స‌భ్యుల‌ను కోరిన‌ట్లుగా తెలుస్తోంది.

హోదా కోసం డిమాండ్ చేస్తుంటే.. ప్యాకేజీ పేరుతో ఏపీ స‌ర్కారు మోసం చేస్తుంద‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చేయాల‌న్న విష‌యాన్ని చెప్పిన ఆయ‌న‌.. పార్ల‌మెంటు ఉభ‌య‌స‌భ‌ల్లోనూ హోదా వాణిని గ‌ట్టిగా వినిపించాల‌న్నారు. హోదా అంశంపై కేంద్ర స‌ర్కారుపై ఒత్తిడిని పెంచ‌టంతో పాటు.. హోదా మీద పార్టీ క‌మిట్ మెంట్ తెలియ‌జేసేలా ఈ స‌మావేశాల్లో ప్రైవేటు బిల్లును ప్ర‌వేశ పెట్టాల‌న్న ఆలోచ‌న‌ను చేసిన‌ట్లుగా చెబుతున్నారు. హోదా కార‌ణంగా ప‌ద‌కొండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాయ‌ని.. హోదాతోనే రాష్ట్రానికి ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయ‌ని నేత‌ల‌తో జ‌గ‌న్ చెప్పారు.

పార్ల‌మెంటు సాక్షిగా ఏపీకి ఇచ్చిన హోదా హామీని స‌భ‌లో ప్ర‌స్తావించ‌టం.. అధికార‌ప‌క్షానికి గుర్తుకు వ‌చ్చేలా చేయాల‌ని చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఆంధ్రోడి ఆకాంక్ష అయిన హోదా విష‌యంపై జ‌గ‌న్‌పార్టీ ఎంపీలు పెద్ద ఎత్తున గ‌ళం వినిపించే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నా వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి.. ఆంధ్రోళ్లు కోరుకుంటున్న హోదాపై జ‌గ‌న్ పార్టీ నేత‌లు ఈ తీరులో గ‌ళం వినిపిస్తున్న వేళ‌.. ఏపీ అధికార‌ప‌క్ష నేత‌లు ఏ విధంగా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/