Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఎదుర్కోనున్న పెను స‌వాల్‌ ఇదే

By:  Tupaki Desk   |   28 Dec 2015 7:07 AM GMT
జ‌గ‌న్ ఎదుర్కోనున్న పెను స‌వాల్‌ ఇదే
X
వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డికి అత్యంత క‌ఠిన‌మైన ప‌రీక్ష ఎదురవుతోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగిన దాదాపు 20 నెల‌ల త‌ర్వాత జ‌ర‌గ‌నున్న కార్పోరేషన్ ఎన్నికలు వైసీపీ స‌త్తాను చాటుకునేందుకే కాదు ఆ పార్టీ రాజ‌కీయ భ‌విష్య‌త్‌ ను తేల్చే అంశంగా మారాయి.

త్వ‌ర‌లో గ్రేటర్ విశాఖ కార్పోరేషన్ ఎన్నికలు జ‌రగ‌నున్నాయ‌ని వార్త‌లు వెలువడుతున్నాయి. వివిధ కార‌ణాల వ‌ల్ల కర్నూలు - గుంటూరు - రాజమండ్రి కార్పోరేషన్ ఎన్నిక‌లు పెండింగ్‌ లో ఉన్నాయి. ఈ నాలుగు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడం బట్టే పార్టీ భవిష్యత్తు నిర్ధారణ అవుతుందన్న ప్రచారం వైసీపీ నేత‌ల్లో జోరుగా సాగుతోంది. ఇందుకు వైసీపీ నేత‌లు వివిధ కార‌ణాలు చూపిస్తున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్‌ సభకు పోటీ చేసిన జ‌గ‌న్ త‌ల్లి వై.ఎస్. విజయమ్మ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఇటీవ‌లి కాలంలో అధికార టీడీపీ దూకుడుగా వెళుతూ తెలుగుదేశం పార్టీలోకి వ‌చ్చేవారికి పెద్ద ఎత్తున ఆహ్వానం ప‌లుకుతోంది. ఇదిలాఉండ‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలు భారీ స్థాయిలో ఒక్కేసారి టీడీపీలోకి వెళ్లాలన్న ఆలోచన ఉన్న‌ట్లు పొలిటిక‌ల్ స‌ర్కిల్‌ లో చ‌ర్చ జ‌రుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ భవిష్యత్తు ఉండదన్నది ఒక కారణమైతే పార్టీ అధినేత తీరు మరో కారణంగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా వైఎస్ ఆర్ పార్టీ అధినేత సమర్థతను కూడా త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ కార్పోరేషన్ ఎన్నికల్లో పార్టీ గెలుపును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మరీ ముఖ్యంగా విశాఖ‌పట్ట‌ణం కార్పోరేషన్‌ ను ఆ పార్టీ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది. అయితే విశాఖజిల్లాలో ఒకప్పుడు వైసీపీకి కీలకంగా ఉన్న నేత కొణతాల రామకృష్ణ - దాడి వీరభధ్రరావు తదితర బలమైన నేతల చూపు టీడీపీ వైపు మ‌ళ్లింది. ఈ ఇద్ద‌రు నేత‌లు టీడీపీ తీర్థంపుచ్చుకొనే అవకాశముంది. వైసీపీతోపాటు ఇతర పార్టీల లోని బలమైన నేతలకు గాలం వేసేందుకు అధికార సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ స్థానాలలో మెజార్టీ స్థానాలు దక్కించుకొంటనే పార్టీకి భవిష్యత్తు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గన్‌ పార్టీ ముఖ్యనేతల వద్ద చెప్పుకొంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు పార్టీ కైవసం చేసుకోవాలని పార్టీ నేతలకు ఆయన ఇప్పటినుంచే దశాదిశా నిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. ఆయా కార్పోరేషన్ల పరిధిలోని నేతలతో ఇప్పటికే జగన్ ప్రత్యేకంగా మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికలు, కార్యాచరణ దిశగా ఆ పార్టీ నాయకత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.