Begin typing your search above and press return to search.

జ`గన్‌`.. గురి తప్పిందా?

By:  Tupaki Desk   |   19 Dec 2015 11:30 AM GMT
జ`గన్‌`.. గురి తప్పిందా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో సంచ‌ల‌నం సృష్టించిన కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్ వ్యవహారంలో తెలుగుదేశం సర్కారును ఇరుకున పెడతారని భావించిన ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తానే ఇరుకున పడ్డారా? ఆ అంశంపై జగన్ అనుసరించిన వ్యూహం బెడిసికొట్టిందా? చెప్పిందే చెప్పడం వల్ల తన వద్ద విషయం లేదన్న సంకేతాలు పంపారా? రోజా సస్పెన్షన్‌ పై విపక్ష నేత ప్రతిఘటన పేలవంగా ఉందా? గద్దె రామ్మోహన్‌ రావు ఆవేదనాభరిత ప్రసంగంతో జగన్ ఇరుక్కున్నారా? .. ఇవన్నీ వైసీపీ అధినేత జగన్ శాసనసభలో వ్యవహరించిన తీరుపై సొంత పార్టీలో వ్యక్తమవుతోన్న అభిప్రాయాలు.

కాల్‌ మనీ సెక్స్ కుంభకోణంపై తన వద్ద ఉన్న సమాచారంతో జగన్ సర్కారును కడిగేస్తారని భావించారు. చివరకు జగన్ తన వద్ద దానికి సంబంధించిన విషయం లేదని నిరూపించుకునే విధంగా మాట్లాడి, తన విషయరాహిత్యాన్ని బయటపెట్టుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అంశంలో ఆయన సభలో మాట్లాడిన తీరు సొంత పార్టీ నేతలకే పెద్దగా రుచించలేదు. చెప్పిందే చెప్పడం, ఫొటోలను పలుమార్లు ప్రదర్శించడం తప్ప, సర్కారును ఇరికించేలా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేకపోయారు. జగన్ ప్రసంగం ఎక్కువభాగం పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులకే సరిపోయిందన్న వ్యాఖ్య లు వినిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడును విమర్శించడంలో ముందున్నప్ప టికీ, జరిగిన కుంభకోణంలో సీఎం పాత్రను నిరూపించడంలో విఫలమయ్యారు. జరిగిన చర్చ కాల్‌ మనీ కి సంబంధించినదయితే.. అంగన్‌వాడీ, ఇతర అంశాలకు వెళ్లడం బట్టి, ఆయనకు కాల్‌ మనీకి సంబంధించి సరైన సమాచారం లేదన్న విషయం స్పష్టమయింది. దానితోపాటు సభకు సరైన కసరత్తు లేకుండా జ‌గ‌న్‌ వచ్చారని తేలిపోయింది.

మ‌రోవైపు ప్ర‌తిదానికి జ‌గ‌న్ ముందుకు వెళ్ల‌డాన్ని కూడా త‌ప్పుప‌డుతున్నారు. కాల్‌ మనీపై తన బదులు రోజాతోనే మాట్లాడిస్తే పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు. అప్పుడు రోజాను సస్పెండ్ చేసే అవకాశం ప్రభుత్వానికి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. మహిళలకు సంబంధించిన విషయం కాబట్టి, వారితోనే మాట్లాడిస్తే మంచి ఫలితాలు వచ్చేవని, అప్పుడు మైలేజీ కూడా వచ్చేదని విశ్లేషిస్తున్నారు. ప్రతిదానికీ తానే మాట్లాడాలన్న వైఖరి మంచిదికాదంటున్నారు.

ఇదిలాఉండ‌గా...విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ రావు మాట్లాడిన తర్వాత జగన్ వైఖరి పూర్తి ఆత్మ రక్షణలో పడింది. ఎక్కడో ఒక చిన్న టిఫిన్ సెంటర్ ప్రారంభోత్సవం ఫొటో చూపి, అక్కడున్న నిందితుడికి తనతో స్నేహాన్ని ఆపాదిస్తూ జగన్ చేసిన ప్రయ త్నంపై గద్దె తీవ్రంగా స్పందించారు. 'మీరు చెప్పినట్లు నేను బోడె వెంకటేశ్వరరావు గెస్ట్‌ హౌస్‌ లో విందులో పాల్గొన్నట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండటమే కాదు. ఈ భూమ్మీదనుంచే శాశ్వతంగా వెళ్లిపోతా!! అక్కడ పైనున్న వైఎస్ ను కలసి మీ అబ్బాయి ఇలాంటి రాజకీయాలు చేస్తున్నాడని అడుగుతా. కృష్ణా జిల్లాలో మీ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలున్నారు. వారితో మీరు చూపించిన ఫొటో లపై విచారణ జరిపించండి. వారంతా నేను నేరస్తుడినని తేలిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అని గద్గద స్వరంతో చెప్పడం వైసీపీ సభ్యులనూ కదిలించింది. తన మీద తనకు అంత నిజాయితీ, నమ్మకం ఉండబట్టే గద్దె ఆ విధంగా మాట్లాడి ఉంటారని అంచ‌నావేస్తున్నారు.

అదేవిధంగా జగన్ చెప్పినదాంట్లో ఇసుమంతయినా నిజం లేదన్న భావన కూడా కలిగిందని విశ్లేషిస్తున్నారు. గద్దె వ్యాఖ్యలతో జగన్ మాటలు అబద్ధమన్న విషయం టీవీలు చూసిన వారికీ అర్ధమయింది. అందుకే జగన్ తాను నాయకులతో ఫొటోలు దిగడాన్ని తప్పు పట్టడం లేదని మాట మార్చారు. అక్కడి నుంచి మరో పాయింట్ మాట్లాడకుండా మళ్లీ పాత ఫొటోలనే ప్రదర్శించడంతో జగన్‌లో విషయం లేదన్న వాస్తవం అర్ధమయింది.

మొత్తంగా జ‌గ‌న్ దూకుడుగా వెళ్లాల‌నే ఆతృత త‌ప్ప స‌రైన క‌స‌ర‌త్తు లేకుండా రావ‌డాన్ని సొంత పార్టీ నేత‌లు కూడా జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఆరోప‌ణ‌లు చేయాల‌న్న అభిప్రాయంతో ఉండ‌టం ఎంత స‌రైన‌దో....స‌రైన వ‌ర్క‌వుట్ చేయ‌డం కూడా అంతే అవ‌స‌ర‌మ‌ని వైసీపీ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.