Begin typing your search above and press return to search.

జగన్‌ అంత ఇంట్రావర్ట్‌ గా ఉంటారెందుకు?

By:  Tupaki Desk   |   2 Oct 2015 9:30 PM GMT
జగన్‌ అంత ఇంట్రావర్ట్‌ గా ఉంటారెందుకు?
X
వైఎస్‌ జగన్మోహనరెడ్డి వ్యవహార సరళి చాలా సందర్భాల్లో పలువురికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఆయన ప్రజానాయకుడిగా తిరుగులేని గుర్తింపు ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి. చాలాకాలంనుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పటినుంచో ఎంపీ. ఆ తర్వాత.. తండ్రి మరణించిన తర్వాత.. పార్టీని స్థాపించి.. రాష్ట్రంలో అధికారంలోకి రాదలచుకున్న పార్టీస్థాయిలో దాన్ని నిర్వహించారు. వచ్చే ఎన్నికలకెల్లా.. ఎట్టి పరిస్థితుల్లోనూ తామే అధికారంలోకి వచ్చేస్తాం అని కూడా ఆయన తరచూ చెబుతూ ఉంటారు. కానీ చాలా సందర్భాల్లో ఆయనలోని 'ఇంట్రావర్ట్‌' బయటకు వస్తుంటారని మానసిక విశ్లేషకులు వ్యాఖ్యానిస్తుంటారు. నిజానికి జగన్‌ పెద్ద ఇంట్రావర్ట్‌ అని.. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకించి.. కలివిడిగా కనిపిస్తుంటారని.. కూడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తుంటారు. ఇదేమీ విమర్శ కాదుగానీ.. రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణం మాత్రం కాదు. ఇంతటి రాజకీయ భవిష్యత్‌ ఉన్న నాయకుడిగా ఆయన ఎందుకంత ఇంట్రావర్ట్‌ గా ఉంటారన్నదే అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం. ఇలాంటి వాదనకు బలం ఇచ్చే ఒక సంగతి శుక్రవారం నాడు కూడా చోటు చేసుకుంది.

గాంధీజయంతి సందర్భంగా.. రాజకీయ ప్రముఖులు అందరరూ తమ తమ వ్యక్తిగత, పార్టీగత భావజాలం ఎలా ఉన్నప్పటికీ కూడా.. మహాత్ముడికి నివాళి అర్పించడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. హైదరాబాదులో ఉన్న నాయకులందరూ.. విధిగా బాపూఘాట్‌ కు వెళ్లి.. అక్కడ నివాళి అర్పిస్తుంటారు. హైదరాబాదులో బాపూఘాట్‌ ఉన్నది గనుక.. అక్కడే నివాళి అర్పిస్తుంటారు. తమ తమ నియోజకవర్గాల్లో తమ ప్రజలు, అనుచరుల మధ్య కార్యక్రమాన్ని జరుపుకోవాలనుకునే వారు మాత్రం ఊర్లకు వెళ్లి.. అక్కడ ఉండే బాపూ విగ్రహాలకు పూలమాలలు వేసి.. నివాళి అర్పిస్తుంటారు. జగన్‌ తీరు మాత్రం వెరైటీ. హైదరాబాదులోని ఆయన నివాసం.. నిజానికి బాపూఘాట్‌కు చాలా సమీపంలోనే ఉంటుంది. కానీ ఆయన మాత్రం.. ఎంచక్కా.. పార్టీ కార్యాలయంలో గాంధీజీ మరియు లాల్‌బహదూర్‌ శాస్త్రిల ఫోటోలు పెట్టి.. వాటికి కొన్ని పూలు సమర్పించుకుని.. సింపుల్‌గా నివాళి అర్పించేశారు. యథా నేతా.. తథా అనుచర గణం కూడా!

నిత్యం ప్రజల్లో ఉండాల్సిన, ఎప్పటికైనా తాను ముఖ్యమంత్రిని అని కూడా విశ్వసించే ఒక నాయకుడు, ఇలా గుట్టుచప్పుడు కాకుండా పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించుకోవడంలో అంతరార్థం ఆయనలోని ఇంట్రావర్ట్‌ తత్వమే అని పలువురు అంటున్నారు. అయితే విశ్లేషకుల వ్యాఖ్యలకు ఇదొక్కటే ఆధారం అనడానికి లేదు. ఎప్పుడో ఒకసారి మాత్రమే జగన్‌ విలేకర్ల సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. అంతకు మించి, పెక్కు సందర్భాల్లో ఆయన తరఫున ప్రెస్‌నోట్‌లు మాత్రమే వస్తుంటాయి. ప్రెస్‌మీట్‌ పెట్టినప్పుడు కూడా.. తాను చెప్పదలచుకున్నదంతా చెప్పేసి.. ఒకరిద్దరి ప్రశ్నలకు మాత్రం జవాబిచ్చి.. ఆయన ఇంకెవరినీ పట్టించుకోకుండా వెళ్లిపోతుంటారు. తొలిరోజుల్లో అయితే.. అసలు ప్రశ్నలకు అవకాశమే ఇచ్చేవాళ్లు కాదు. నిత్యం ప్రజల్లో ఉండాల్సిన, నాయకుడు.. తనలోని ఇలాంటి ఇంట్రావర్ట్‌ వ్యక్తిత్వాన్ని ప్రయత్నపూర్వకంగానైనా మార్చుకోకపోతే.. ఆయనకే నష్టం అని మానసిక విశ్లేషకులు సూచిస్తున్నారు.