ఈ దరిద్రమేదో మొదటి రోజే చేసి ఉంటే బాగుండేది కదా జగన్

Thu May 26 2022 09:54:48 GMT+0530 (IST)

jagan on anantha uday bhaskar

సినిమాల్లో మాత్రమే కనిపించే బరితెగింపు.. రియల్ లైఫ్ లో దాదాపు ఉండదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా సినిమాలకు మించిన దారుణ నేరానికి పాల్పడిన వైసీపీ నేత కమ్ ఎమ్మెల్సీ అనంతబాబు  తీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది.తన దగ్గర పని చేసి మానేసిన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపేసి.. అది ప్రమాదంగా అభివర్ణిస్తూ.. అతడి డెడ్ బాడీని తన కారులోనే బాధితుడి ఇంటికి తీసుకొచ్చిన వైనం విన్నంతనే షాకింగ్ గా అనిపించటం ఖాయం. హత్య చేసినట్లుగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన్ను.. పోలీసులు అదుపులోకి తీసుకోవటానికే మూడు.. నాలుగు రోజులు పట్టటం.. హైడ్రామా అనంతరం అతడ్ని అదుపులోకి తీసుకోవటం.. హత్యా నేరాన్ని అంగీకరించినట్లుగా జిల్లా ఎస్పీ పేర్కొనటం తెలిసిందే.

అయితే.. అనంతబాబు చేసిన హత్యా నేరంపై పోలీసు అధికారులు వినిపించిన వాదనకు.. ఆ తర్వాత వెలుగు చేసిన వాస్తవాలకు మధ్య అంతరం ఉందన్న మాటలు ఇప్పుడు ఎక్కువ అయ్యాయి. ఏపీ అధికార వైసీపీని దారుణంగా డ్యామేజ్ చేసిన ఈ ఉదంతంపై ఎట్టకేలకు ఆ పార్టీ రియాక్టు అయ్యింది. దాదాపు హత్యా నేర ఆరోపణలు తెర మీదకు వచ్చిన వారానికి పైనే మౌనాన్ని ఆశ్రయించి.. తాజాగా మాత్రం ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా వైసీపీ ప్రకటించింది.

పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు.. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణానికి తానే కారకుడినని ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసులకు వాంగ్మూలాన్ని ఇచ్చినట్లుగా పోలీసులు ప్రకటించటంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను వైసీపీ ప్రధాన కార్యాలయం విడుదల చేసింది. నిందితుడు తనకు తానుగా నేరాన్ని అంగీకరించటం.. అది కూడా పోలీసుల ఎదుట ఒప్పుకొని వాంగ్మూలాన్ని ఇచ్చిన నేపథ్యంలోనే ఆయన మీద వేటు వేస్తూ నిర్ణయాన్ని తీసుకోవటం గమనార్హం.

ఇదంతా చూసినప్పుడు.. దారుణ నేరాలకు పాల్పడినా.. చేష్టలుడిగినట్లుగా చూస్తుండిపోవటమే తప్పించి.. కొరడా ఝుళిపించటం.. వెంటనే చర్యలు తీసుకోవటం లాంటివి ఉండవా? అన్న సందేహాలకు అవకాశం ఇచ్చేలా చర్యల నిర్ణయం ఉందన్న విమర్శ వినిపిస్తోంది.

పార్టీని దారుణంగా డ్యామేజ్ చేసిన ఇష్యూలోనూ.. చర్యలు తీసుకోవటానికి ఇన్ని రోజులు పట్టటం ఏమిటన్నది అసలు ప్రశ్న. ఒకవేళ.. తనపై వచ్చిన తీవ్ర ఆరోపణలను అనంతబాబు అంగీకరించకుంటే.. వేటు పడేది కాదుగా? అన్న అనుమానం వ్యక్తమయ్యేలా వైసీపీ ప్రధాన కార్యాలయం విడుదల చేసిన ప్రకటన సారాంశం ఉందన్న విమర్శ పలువురి నోట వినిపిస్తోంది. మిగిలిన అంశాల్ని పక్కన పెడితే.. దారుణ నేరాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు తెర మీదకు వచ్చినంతనే చర్యలు తీసుకుంటే.. అనవసరమైన నష్టం జరగకుండా నివారించే అవకాశం ఉంది కదా? ఆ దిశగా వైఎస్ జగన్ ఎందుకు ఆలోచించట్లేదు?