Begin typing your search above and press return to search.

ఇద్దరు ఎంపీల ఇంటికి జగన్... స్వీట్ న్యూస్ చెబుతారా...?

By:  Tupaki Desk   |   25 Jan 2023 9:52 AM GMT
ఇద్దరు ఎంపీల ఇంటికి జగన్... స్వీట్ న్యూస్ చెబుతారా...?
X
ముఖ్యమంత్రి జగన్ని కలవడం సొంత పార్టీ వారికైనా అంత సులువు కాదని ప్రచారంలో ఉన్న మాట. ఆయనను కలవాలన్న కోరిక తీరకపోవడం వల్లనే నర్సాపురం ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు రెబెల్ గా మారిపోయారని అంటారు. ఇక జగన్ తో అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యేలు కలసి విన్నపాలు చేసుకుంటారు అంటారు. ఎంపీలకు మాత్రం ఏదైనా కార్యక్రమం పెట్టుకుని తమ ఇంటికి పిలిస్తేనో లేక జిల్లా టూర్లలోనో కలిసే చాన్స్ దక్కుతుంది.

ఇదిలా ఉంటే విశాఖకు ఈ నెల 28న వస్తున్న జగన్ ముందు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. శ్రీ శారదాపీఠంలో ఆయన రాజశ్యామల యాగానికి హాజరవుతారు. ఆ తరువాత అటు నుంచి నేరుగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడి వివాహ కార్యక్రమానికి వెళ్తారు. అక్కడ నుంచి అనకాపల్లి ఎంపీ సత్యవతి కుమారుడి వివాహ కార్యక్రమానికి కూడా హాజరవుతారు అని అంటున్నారు.

ఈ సందర్భంగా ఇద్దరు ఎంపీల ఇంట్లో జగన్ కొంతసేపు గడుపుతారు అని తెలుస్తోంది. అయితే ఇద్దరు ఎంపీలకు జగన్ ఏమైనా స్వీట్ న్యూస్ చెబుతారా అన్న చర్చ కూడా సాగుతోంది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు వచ్చే ఎన్నికల్లో టికెట్ అయితే దక్కేలా లేదు. ఆయన 2019 ఎన్నికల్లోనే కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో లక్కీగా గెలిచారు. ఈసారి ఆయనకు టికెట్ లేదనే టాక్.

ఇక ఎంవీవీ సైతం తనకు ఎంపీ టికెట్ వద్దు ఎమ్మెల్యే సీటుకే అని అంటున్నారు. దాని కోసం ఆయన విశాఖ తూర్పు సీటుని ఎంచుకున్నారు. అక్కడ ఆయన పోటీకి అంతా రెడీ చేసుకుంటున్నరు. జగన్ ఓకే అంటే ఆయన ఇప్పటి నుంచే రంగంలోకి దిగుతారు అని అంటున్నారు. అయితే జగన్ ఏమి చెబుతారో అన్న బెంగ అయితే ఉంది. సామాజిక సమీకరణలు ఎంవీవీ సీటుకు అడ్డుపడేలా ఉన్నాయని అంటున్నారు. బీసీలు ఎక్కువగా ఉండే ఆ సీట్లో ఓసీని ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఎంవీవీకి టికెట్ ఇస్తే గెలుపు మాట దేముడెరుగు జగన్ సోషల్ ఇంజనీరింగ్ కి దెబ్బ తగిలే ప్రమాదం ఉంది అంటున్నారు.

ఇక అనకాపల్లి ఎంపీగా చివరి నిముషంలో ఎంపిక అయి జగన్ వేవ్ లో మంచి మెజారిటీతో గెలిచిన భీశెట్టి సత్యవతి కూడా ఎమ్మెల్యే సీటు మీదనే ఆశలు పెట్టుకున్నారు. ఆమెకు మరోసారి ఎంపీ సీటు దక్కదని అంటున్నారు. ఆమె పనితీరు కూడా అంతంతమాత్రంగా ఉంది అంటున్నారు. అయితే అనకాపల్లిలో బలమైన గవర సామాజికవర్గానికి చెందిన సత్యవతికి అనకాపల్లి అసెంబ్లీ సీటు మీద కన్ను ఉంది. అయితే ఆ సీటు విషయంలో చాలా పెద్ద పోటీ ఉంది.

తాజాగా మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ సోదరుడు కొణతార రఘురాం వైసీపీలోకి వస్తారని ఆయన అదే సీటు ఆశిస్తున్నారు అని అంటున్నారు. జగన్ టూర్ లో ఆయన చేరిక కూడా ఉంది అని తెలుస్తోంది. మరి సత్యవతి ఇంటికి వెళ్ళే జగన్ స్వీట్ న్యూస్ చెబుతారా అన్నదే ఇక్కడ పాయింట్. ఏది ఏమైనా ఈ ఇద్దరు ఎంపీలకు మరోసారి ఎంపీ టికెట్ దక్కదు అన్నది నిజమని అంటున్నారు. మరి రీప్లేస్ మెంట్ విషయంలో జగన్ హామీ ఇస్తే వారికి అది వారికి మంచి గిఫ్ట్ గా ఉంటుంది. శుభ కార్యం చేసుకుంటున్న వారి ఇంటికి వెళ్లిన వారు బహుమతులు ఇస్తారు. జగన్ అలా ఏమి గిఫ్ట్ ఇస్తారు అన్నదే చర్చగా ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.