Begin typing your search above and press return to search.

'అమరావతి' తప్పు మాదిరే పొత్తులపై అంత పంతం ఎందుకు జగన్?

By:  Tupaki Desk   |   20 March 2023 12:00 PM GMT
అమరావతి తప్పు మాదిరే పొత్తులపై అంత పంతం ఎందుకు జగన్?
X
రాజకీయాల్లో ఉన్నంత అనిశ్చితి మరే రంగంలోనూ ఉండదు. ఒక్క సంఘటన చాలు.. అప్పటివరకు ఎంతో జాగ్రత్తగా కట్టుకున్న కోటకు బీటలు వారేందుకు. అందుకే.. ఏదైనా అంశం మీద బలమైన వాదనను వినిపించే ముందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుందని చెబుతారు. ఎందుకంటే ఒకసారి ఒక మాట రావటం వేరు. ఒకే అంశాన్ని ఒకటికి పదిసార్లు చెప్పటం వేరు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే.. ఆయన ఇప్పటికి ఒకే మాటను పదే పదే చెబుతున్నారు.

తన మీద విమర్శలు చేసే వారు.. తన మీద రాజకీయ యుద్ధాన్ని ప్రకటించిన వారు ఎన్నికల వేళలో ఒక్కొక్కరుగానే రావాలే తప్పించి..కలిసి రావటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తన పాలనతో ఏపీ ప్రజలంతా హ్యాపీగా ఉంటారని బలంగా నమ్మే జగన్ కు.. ప్రత్యర్థులు ఏకమై వస్తే ఏంటి? సింగిల్ గా వస్తే ఏంటి? ఆ తేడా ఎందుకు.. అదే పనిగా ప్రస్తావిస్తారు? అన్నది ప్రశ్న. తనకు తిరుగులేని బలం ఉందని.. ప్రజాభిమానం ఉందని నమ్మినప్పుడు ఎదుటోళ్ల గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు కదా?

తన ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని ఆవేదన చెందే జగన్.. ఒకవేళ అదే నిజమైతే ప్రజలు నమ్మరు కదా? ఒంటరిగా పోటీ చేసి 151 స్థానాల్ని సొంతం చేసుకున్న ఆయన.. వచ్చే ఎన్నికల్లోనూ ప్రత్యర్థులంతా విడివిడిగా పోటీ చేయాలని మాత్రమే ఎందుకు కోరుకుంటున్నారు? ఇలాంటి వ్యాఖ్యలతో తన బలహీనతను.. భయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నారా? అన్నది మరో ప్రశ్న. అంతేకాదు.. ఈ మాటతో తాను సాధించిన 151 సీట్ల విజయాన్ని సైతం ఆయన తప్పుదారి పట్టిస్తున్నట్లుగా మారిందన్న మాట వినిపిస్తుంది. జగన్ చెప్పినట్లుగా టీడీపీ.. జనసేనలు కలిసి 2019లో పోటీ చేస్తే జగన్ కు 151 సీట్లు కచ్ఛితంగా రాకపోవటమే కాదు.. అధికారం కూడా వచ్చేది కాదన్న వాదన ఇటీవల ఎక్కువ అవుతుంది.

అంటే.. తనకు తానుగా తాను ప్రస్తావించిన అంశాలతో తన బలాన్ని సైతం బలహీనతగా మార్చుకుంటున్న పరిస్థితి ఏపీ సీఎం జగన్ లో ఈ మధ్యన ఎక్కువ అవుతుంది. తాను పదే పదే ప్రస్తావించే అంశాలతో జగన్ తన బలహీనను ఇట్టే చెప్పుకుంటున్నారని చెప్పాలి. సాధారణంగా ప్రత్యర్థులకు తమ బలహీనతలు ఏమిటన్న విషయాన్ని తెలియజేసేందుకు రాజకీయ అధినేతలు ఇష్టపడరు.

కానీ.. జగన్ మాత్రం అందుకు భిన్నంగా ఓపెన్ గా చెప్పేసుకుంటున్నారు. పొత్తుల విషయం మీద ఆయన అదే పనిగా వ్యాఖ్యలు చేస్తే.. విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. 'మనందరి ప్రభుత్వంపై వారు ఎందుకు రాళ్లు వేస్తున్నారు? వారు చెబుతున్నదే నిజమైతే ఒంటరిగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నేను సవాలు చేస్తున్నా. ఈ సవాల్ ను స్వీకరించే దమ్ము.. ధైర్యం ఉందా?' అని ప్రశ్నిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో ఏ రీతిలో వ్యవహరించాలి? ఎవరితో పొత్తు పెట్టుకోవాలి? ఎలా పోటీ చేయాలి? ఎన్ని సీట్లకు పోటీ చేయాలి? లాంటి వాటిపై కండిషన్లు పెడతారా? అన్నది ప్రశ్నలుగా మారుతున్నాయి.

పొత్తుపై ఎలా వ్యవహరించాలన్న విషయం మీద జగన్ చేసే వ్యాఖ్యలు దీర్ఘకాలంలో ఆయనకు డ్యామేజ్ ఖాయమంటున్నారు. ఎందుకుంటే రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని.. అలాంటప్పుడు ఒక అంశాన్ని పట్టుకొని దాన్ని హైలెట్ చేయటం ప్రస్తుతానికి బాగానే ఉన్నా.. రాబోయే రోజుల్లో అది ప్రతిబంధకంగా మారుతుందంటున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వారికే అధికారంలోకి వచ్చేందుకు పొత్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆయనే చేసిన పనిని.. ఈ రోజున ఆయన కారణంగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ తప్పు పట్టటం ఏమిటి? వేలెత్తి చూపటం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా? అని ప్రశ్నిస్తున్నారు.

ఏపీ రాజధాని అమరావతి విషయంలోనూ జగన్ ఇలాంటి తప్పులే చేశారన్న మాటను గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల వేళలోనూ ఏపీ రాజధాని అమరావతే అంటూ లక్షలాది ప్రజల ముందు చెప్పిన ఆయన.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మూడు రాజధానుల జపాన్ని ఆలపించటం ఒక ఎత్తు అయితే.. గడిచిన మూడున్నరేళ్లలో రాజధానికి సంబంధించి ఒక్క అడుగు ముందుకు పడిందా? ఒక్క భవనాన్ని అయినా కట్టారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ ప్రభుత్వానికి..గత ప్రభుత్వానికి మధ్యనున్న తేడా గురించి ప్రస్తావిస్తూ.. గత ప్రభుత్వం గ్రాఫిక్స్ చూపించిందని వ్యాఖ్యానించారు. జగన్ చెప్పింది నిజమే అనుకుందాం? మరి.. ఆయన ఈ వ్యాఖ్య చేసిన వేదిక ఎవరి కాలంలో నిర్మించింది? ఒకవేళ.. అది గ్రాఫిక్సే అయితే.. ఆయన అక్కడ నిలబడి మాట్లాడే వీలు ఉండేది కాదు కదా? ఇలాంటి తర్కబద్ధమైన ప్రశ్నలు వాస్తవం ఏమిటన్న విషయాన్ని అర్థమయ్యేలా చేయటంతో పాటు.. ముఖ్యమంత్రి మాటల్లో నిజం ఎంతన్న విషయాన్ని అర్థం చేసుకునేలా చేస్తుందంటున్నారు.

తమది మాట తప్పని.. మడమ తిప్పని కుటుంబంగా చెప్పే జగన్.. రాజధాని అమరావతిపై తన స్టాండ్ మార్చిన నాటి నుంచి తనకు అలవాటైన మాట తప్పని.. మడమ తిప్పని మీ బిడ్డను వాడటం మానేశారన్నది మర్చిపోకూడదు. ఇలా.. తన మాటలతో తనకు తానే ప్రతిబంధకాల్ని క్రియేట్ చేసుకునే జగన్.. ఇదే రీతిలో ముందుకు వెళితే మాత్రం రానున్న రోజుల్లో తిప్పలు ఖాయమంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.