Begin typing your search above and press return to search.

సూపర్ కలెక్టర్.... ఏపీలో ఈ పోస్టే కీలకం

By:  Tupaki Desk   |   20 Jan 2020 5:06 AM GMT
సూపర్ కలెక్టర్.... ఏపీలో ఈ పోస్టే కీలకం
X
నవ్యాంధ్రప్రదేశ్ పాలనలో తనదైన శైలి దూకుడు ప్రదర్శిస్తున్న వైసీపీ అధినేత - సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి ఇప్పటిదాాకా ఒకటే రాజధాని ఉండగా... ఇకపై మూడు రాజధానుల దిశగా సోమవారం ఉదయం కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కారు... పాలనలో మరో సరికొత్త సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా రాష్ట్ర పాలనలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూపర్ పవర్ గా కొనసాగితే... జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ పవర్ ఫుల్ పోస్టుగా కొనసాగింది, అయితే ఇకపై రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ - జిల్లా స్థాయిలో కలెక్టర్ పోస్టులు కొనసాగిస్తూనే... నాలుగు జిల్లాలకు ఓ సూపర్ కలెక్టర్ పోస్టును ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు తలచింది. దీనిపై ఇప్పటికే కేబినెట్ లో నిర్ణయం తీసుకోగా... మరికాసేపట్లో భేటీ కానున్న అసెంబ్లీలోనూ దీనిపై తీర్మానం చేయనున్నట్లుగా సమాచారం.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ దిశగా సాగేందుకు అధికార వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని కూడా కేబినెట్ తీర్మానించినట్లు సమాచారం. ఇందులో భాగంగా అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం గత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఆర్డీఏను రద్దు చేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఏపీకి సింగిల్ రాజధానిగా ఉన్న అమరావతిని కేవలం లెజిస్లేటివ్ కేపిటల్ కు మాత్రమే పరిమితం చేయడంతో పాటు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖను, జ్యుడిషియల్ కేపిటల్ గా కర్నూలును మార్చేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పనిలో పనిగా... అధికార వికేంద్రీకరణ జరగాలంటే... రాష్ట్రంలోని ప్రతి నాలుగు జిల్లాలకు ఓ ప్రాంతీయ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా జగన్ కేబినెట్ తీర్మానించింది.

ప్రాంతీయ మండళ్లుగా పిలవనున్న ప్రాంతీయ అభివృద్ధి కేంద్రాల నిర్వహణకు కొత్తగా సూపర్ కలెక్టర్ పోస్టును సృష్టించాలని కూడా జగన్ కేబినెట్ నిర్ణయించింది. అంటే... జిల్లాకు కలెక్టర్ ఏ మాదిరిగా సూపర్ పవర్ గా వ్యవహరిస్తారో, ప్రాంతీయ మండళ్లకు కొత్తగా సృష్టించనున్న సూపర్ కలెక్టర్ చీఫ్ గా వ్యవహరిస్తారన్న మాట. అంటే రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ, జిల్లాకు కలెక్టర్ ఎలాగైతే బాసులుగా వ్యవహరిస్తారో, ప్రాంతీయ మండళ్లకు సూపర్ కలెక్టర్ బాస్ గా వ్యవహరిస్తారన్న మాట. అంటే.... జిల్లా, రాష్ట్ర స్థాయిల మధ్య సూపర్ కలెక్టర్ అనుసంధానకర్తగా వ్యవహరిస్తారన్న మాట. ఆయా ప్రాంతీయ మండళ్లకు బాస్ గా వ్యవహరించనున్న సూపర్ కలెక్టర్ తన పరిధిలోని జిల్లా కలెక్టరేట్లను కోఆర్డినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్లారన్న మాట. ఎలా చూసినా... కొత్తగా తెరమీదకు రానున్న సూపర్ కలెక్టర్ పోస్టే కీలకంగా మారనుందన్న వాదన వినిపిస్తోంది.