Begin typing your search above and press return to search.

సోనియా, చంద్రబాబులు కలిసి చేసిన కుట్ర ఇది..

By:  Tupaki Desk   |   7 April 2017 11:47 AM GMT
సోనియా, చంద్రబాబులు కలిసి చేసిన కుట్ర ఇది..
X
ఏపీలో ఫిరాయింపు నేతలకు మంత్రి పదవులు ఇచ్చి ప్రజాస్వామ్యానికి పాతరేసిన నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఢిల్లీలో వివిధ జాతీయ పార్టీల నేతలను కలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ తనపై ఉన్న కేసుల గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. తన మీద ఉన్న కేసులన్నీ కుట్రతో పెట్టినవే కానీ, అందులో ఏ ఒక్కటీ నిలిచేది కాదని తేల్చేశారు. తాను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తరువత చంద్రబాబు, సోనియాలు కుట్రతో తనపై కేసులు పెట్టించారని ఆయన ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌ లో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఢిల్లీలో వివిధ జాతీయ పార్టీల నాయకులను కలుస్తున్న జగన్ ఈ రోజు సీపీఐ అగ్రనేతలు సురవరం సుధాకర్ రెడ్డి - డి. రాజా తదితరులను కలిశారు. వైఎస్ ఆర్‌ సీపీ నుంచి ఎన్నికైన 21 మందిని టీడీపీలో చేర్చుకోవడమే కాక, వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చిన వైనాన్ని వారికి జగన్ వివరించారు. అనంతరం సురవరం, రాజాలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసుల గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానం ఇచ్చారు. తన మీద కేసులు కొత్తేమీ కాదని, అవన్నీ రాజకీయ ప్రేరేపితమేనని, పదేళ్ల క్రితమే దీనిమీద విచారణ జరిగిపోయిందని ఆయన చెప్పారు.

రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం తన మీద ఏ కేసులు లేవని, అలాగే తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కేసులు లేవని, దానిలోంచి బయటికొచ్చిన తరువాతే ఇలా కేసుల్లో ఇరికించారని ఆయన ఆరోపించారు. ఒక వ్యక్తి తప్పు చేసినట్లు ఇంకా రుజువు కాకపోతే.. మూడు నెలల కంటే ఎక్కువ కాలం జైల్లో పెట్టే అధికారం లేదని, అయినా తనను 16 నెలల పాటు జైల్లో పెట్టారని తెలిపారు. తనను రాజకీయంగా నిర్మూలించాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేశారని ఆయన ఆరోపించారు.రాష్ర్టంలో చంద్రబాబు సాగిస్తున్న అరాచకాల గురించి ఆయన జాతీయ పార్టీల నేతలకు వివరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/