Begin typing your search above and press return to search.

'వంద రోజుల' జగన్ హామీ..హామీలన్నీ అమలు చేస్తా!

By:  Tupaki Desk   |   6 Sep 2019 4:20 PM GMT
వంద రోజుల జగన్ హామీ..హామీలన్నీ అమలు చేస్తా!
X
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వంద రోజులను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్లిన జగన్... అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కీలక ప్రసంగం చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు తానిచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే దిశగానే సాగుతానని మరోమారు ఆయన క్లిస్టర్ క్లియర్ హామీ ఇచ్చారు. రేషన్ కార్డుదారులకు నాణ్యమైన బియ్యం పంపణీని లాంఛనంగా ప్రారంభించిన జగన్... అక్కడే ఉద్ధానం కిడ్నీ బాధితులకు ఊరట కల్పించేందుకు ఉద్దేశించిన కిడ్నీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కిడ్నీ బాధితులకు పలు వరాలు ప్రకటించిన జగన్... వంద రోజుల పాలనలో ఏమేం చేశాను? భవిష్యత్తులో ఇంకేం చేయబోతున్నానన్న విషయాలపైనా సమగ్రంగా ప్రసంగించారు.

ఈ సందర్భంగా జగన్ ఏమన్నారన్న విషయానికి వస్తే... పాదయాత్రలో చెప్పినట్లుగా కిడ్నీ బాధితుల కష్టాలు తీరుస్తానన్న మాటను ఈరోజు నిలబెట్టుకున్నానని పేర్కొన్నారు. ఇదంతా ప్రజల ఆశీర్వాదం వల్లే సాధ్యమైందని - తమ పార్టీని 151 స్థానాల్లో గెలిపించినందుకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రిగా వందరోజుల పాలన ముగించుకుని మేనిఫెస్టోలో పేర్కొన్న ఒక్కో హామీని నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. కిడ్నీ బాధితులకు 10 వేల పెన్షన్‌ ఇచ్చే ఫైలుపై తొలి సంతకం చేశానని గుర్తు చేశారు. కిడ్నీ బాధితుల కోసం నిర్మిస్తున్న ఆస్పత్రిలో ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. కిడ్నీ బాధితులకు అన్ని విధాలుగా తోడుగా ఉంటామని... నాణ్యమైన మందులు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. సమస్యకు మూల కారణాన్ని అన్వేషించి వ్యాధులు రాకుండా ఉండేందుకు ఉద్ధానం ప్రాంతమంతా మంచినీటి సరఫరాకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. పలాస - ఇచ్చాపురం మొత్తం అన్ని గ్రామాల్లో నేరుగా ఇంటి వద్దకే తాగునీటిని అందించే కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తున్నానని తెలిపారు.

పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చినట్లుగా తిత్లీ బాధితులకు పరిహారం పెంచుతున్నామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ. 1500 నుంచి 3 వేల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. అదే విధంగా జీడితోట హెక్టారుకు పరిహారాన్ని రూ. 30 వేల నుంచి రూ. 50 వేలకు పెంచుతున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం నుంచే చెక్కుల పంపిణీ మొదలవుతుందని ఆయన వెల్లడించారు. ఆ రోజు పాదయాత్రలో మత్స్యకార సోదరులు ఫిషింగ్‌ జెట్టీ కావాలని అడిగారని గుర్తు చేసుకున్న జగన్... ఆ ఆలోచనను గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. మత్స్యకారుల సమస్యలు విని నేనున్నానంటూ నాడు భరోసా ఇచ్చానని.. ఈ రోజు మంచినీళ్లపేట - నువ్వులరేవులో ఫిషింగ్‌ జెట్టీ పెడుతున్నామని.. దీంతో పాటు మత్స్యకార సోదరుల కోసం జెట్టీ నిర్మాణంతో పాటు అక్కడే అన్ని వసతులు కల్పిస్తామని ప్రకటించారు. అదేవిధంగా మత్స్యకార్మిక దినోత్సవం సందర్భంగా పడవలు - బోట్లు ఉన్న మత్స్యకార్మికులకు రూ.10వేల చొప్పున ఇవ్వబోతున్నామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ పథకం తీసుకువచ్చామని పేర్కొన్నారు.

వంశధార నదిపై నేరేడు వద్ద బ్యారేజీ కట్టడంతో పాటు యుద్ధప్రాతిపదికన పనులు జరిగేందుకు చర్యలు తీసుకుంటామని జగన్ ప్రకటించారు. మహేంద్ర తనయ ఆఫ్‌ షోర్‌ ప్రాజెక్టును పరుగులు తీయిస్తా మీ అందరికీ హామీ ఇస్తున్నాని జగన్ పేర్కొన్నారు. అదే విధంగా సెప్టెంబరు చివరికల్లా సొంత ఆటో - ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి రూ. 10 వేలు ఇస్తామని - అవ్వాతాతల పెన్షన్‌ కూడా సగటున 3 రెట్లు పెంచి వారిని ఆదుకుంటామని ప్రకటించారు. అక్టోబరు 15న రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు రూ. 12500 ఇస్తామని. 100 రోజుల్లోపే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. లంచాన్ని - అవినీతిని అరికట్టేందుకు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చామని... ప్రతీ ప్రభుత్వ పథకాన్ని ఇంటింటికీ డోర్‌ డెలివరీ చేస్తామని ప్రకటించారు. డిసెంబరు 21న చేనేత కుటుంబాలకు నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్లి రూ. 24 వేలు అందజేస్తామని జగన్ సంచలన ప్రకటన చేశారు.

అదేవిధంగా జనవరి 26న అమ్మఒడి పథకం ప్రారంభిస్తామని... ఫిబ్రవరి చివరి వారంలో షాపులున్న నాయిబ్రాహ్మణులు, రజకులు, టెయిలర్లకు రూ.10 వేలు ఇస్తామని... మార్చి చివరి వారంలో అర్చకులు - ఇమామ్‌ లు - పాస్లర్లకు పూర్తి చేయూత అందిస్తామని చెప్పారు. ఉగాది రోజు అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని... ఏప్రిల్‌ 2న శ్రీరామనవమి సందర్భంగా వైఎస్సార్‌ పెళ్లి కానుక పథకం అమలు చేస్తామని తెలిపారు. అలాగే సున్నావడ్డీ పథకం ద్వారా డబ్బు మొత్తాన్ని నేరుగా అక్కాచెల్లెమ్మల అకౌంట్‌లో వేస్తామని... అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 19 చట్టాలు తెచ్చామని... ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనార్టీలకు గత పాలకులు మాటలు చెప్పి మభ్యపెట్టారని ధ్వజమెత్తారు. అందుకు భిన్నంగా తాను ఇచ్చిన హామీలను నేరవేర్చి చూపిస్తున్నానని... నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం వారికే కేటాయించేలా చట్టం తెస్తున్నామని జగన్ ప్రకటించారు. మొత్తంగా వంద రోజుల పాలనను పూర్తి చేసుకున్న జగన్... ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన హామీల్లో ఇప్పటిదాకా ఎన్నింటిని అమలు చేశానన్న విషయాన్ని చెప్పడంతో పాటుగా హామీలన్నింటినీ అమలు చేస్తామని కూడా మరో కీలక హామీ ఇచ్చారు.