Begin typing your search above and press return to search.

కరోనాకు జ్వరం గోళి..ఈ మాట సారు వదిలేశారు జగనన్నా

By:  Tupaki Desk   |   15 March 2020 3:30 PM GMT
కరోనాకు జ్వరం గోళి..ఈ మాట సారు వదిలేశారు జగనన్నా
X
కరోనాకు ప్రపంచం మొత్తం వణికిపోతూ.. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్న వేళ.. ఆ మహమ్మారి వైరస్ ను సింఫుల్ గా తీసిపారేసిన తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే.. ఇప్పుడు ఆయన బాటలోనే నడుస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దగ్గర దగ్గర వారం క్రితం కరోనా మీద మాట్లాడిన కేసీఆర్.. కరోనా మీద లొల్లి చేస్తున్నారని.. తనతో ఒక శాస్త్రవేత్త మాట్లాడారని.. కరోనాకు జ్వరం గోళి (పారాసిటమాల్) సరిపోతుందన్న ఆయన.. శనివారం కరోనా తీవ్రతను గుర్తించి..ఆచితూచి వ్యాఖ్యలు చేయటమే కాదు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కరోనా మీద కేసీఆర్ ఆప్డేట్ ను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరిగా ఫాలో అయినట్లుగా లేరు. ఎందుకంటే.. కేసీఆర్ నోటి నుంచి వారం క్రితం చెప్పిన మాటల్ని.. తాజాగా ఆయన వ్యాఖ్యానించటమే దీనికి నిదర్శనం. కరోనాను చిన్న మందుబిళ్లతో తగ్గించొచ్చని.. పారాసిటమాల్ వేస్తే సరిపోతుందన్నారు. కరోనా పాజిటివ్ కేసుల్లో 81 శాతం ఇంట్లో ఉండి రికవరీ అయ్యారని.. కేవలం 13 శాతం మంది మాత్రమే ఆసుపత్రుల్లో చేరినట్లు చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారికి ఎయిర్ పోర్టులో.. పోర్టుల్లో ప్రయాణికుల్ని స్క్రీనింగ్ చేస్తున్నట్లు చెప్పారు.

తప్పనిసరి అయితే తప్పించి ప్రయాణాలు చేయాలని.. షాపింగ్ మాల్స్.. థియేటర్లకు అవసరమైతేనే వెళ్లాలని చెప్పారు. కరోనా విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్న ఆయన.. ఏపీలో 70 శాంపిల్స్ తీసుకుంటే ఒకటే పాజిటివ్ కేసు వచ్చిందన్నారు. కరోనాపరీక్షల కోసం విజయవాడ.. తిరుపతిలో ల్యాబ్ లు సిద్ధం చేసినట్లు చెప్పారు. విశాఖలో మాత్రమే క్వారంటైల్ ఆసుపత్రి ఉందన్నారు. విశాకలో 300 బెడ్లు.. విజయవాడలో 50 బెడ్లు సిద్ధం చేశారని.. నెల్లూరు కరోనా పాజిటివ్ కేసు బయటపడగానే కిలోమీటర్ చటు్టూ 20వేల ఇళ్లకుటీములు వెళ్లిన విషయాన్ని ఆయన చెప్పారు.

కరోనా విషయంలో భయపడాల్సిన అవసరం లేదంటూ.. సింఫుల్ అన్నట్లుగా తేల్చేస్తున్న జగన్.. వారం క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి వెంట ఇలానే మాటలు వచ్చాయని.. తాజాగా ఆయన రూ.5వేల కోట్లు ఖర్చుకైనా సిద్ధమని చెప్పటాన్ని మర్చిపోకూడదు. జ్వరం గోళితోనే కరోనాకు చెక్ చెప్పేటట్లైయితే.. రూ.5వేల కోట్లు ఖర్చు పెట్టటానికైనా తాను సిద్ధమన్న మాట కేసీఆర్ నోట ఎందుకు వస్తుంది చెప్పండి? కరోనా మీద సారు అప్డేట్ అయ్యారు.. జగన్ కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉందన్న మాట తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూసినోళ్లు అభిప్రాయపడుతున్నారు.