Begin typing your search above and press return to search.

జగన్ మార్కు దెబ్బ..రాజధానిలో ఆందోళనలకు చెక్!

By:  Tupaki Desk   |   27 Dec 2019 5:25 PM GMT
జగన్ మార్కు దెబ్బ..రాజధానిలో ఆందోళనలకు చెక్!
X
నిజమే... ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలుపరచిన తనదైన మార్కు వ్యూహంతో పది రోజులుగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో కొనసాగుతున్న ఆందోళనలకు చెక్ పడినట్టేనని చెప్పక తప్పదు. గత వారం ముగిసిన అసెంబ్లీ సమావేశాల చివరి రోజున... ఏపీలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే... రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండాల్సిందేనని - ఆ దిశగానే ఇప్పుడు మూడు రాజధానులు వస్తాయేమోనని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నోట నుంచి వచ్చిన ఆ కొద్ది మాటలు రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులను ఆందోళన బాట పట్టించేసింది. రైతుల్లో కంటే కూడా... రాజధానిపై తనదైన మార్కు వ్యూహంతో ముందుకు సాగిన చంద్రబాబు అండ్ కో... తాము కొనుగోలు చేసిన భూములు ఎటూ కాకుండా పోతాయోమోనన్న భయంతో రైతుల ఆందోళనలకు ఆజ్యం పోశారన్న వాదనలూ వినిపించాయి.

ఈ నేపథ్యంలో రోజు రోజుకూ ఆందోళనల ఉధృతి పెరగడం, రాజధాని రైతులతో పాటు టీడీపీ నేతలు కూడా నిరసనలకు దిగారు. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో జగన్ సర్కారు... రాజధానిపై తుది నిర్ణయం తీసుకుంటుందని కూడా అంతా భావించారు. ఈ భావనతోనే గడచిన రెండు, మూడు రోజుల నుంచి రైతుల ఆందోళనలు మరింత ముమ్మరంగా జరిగాయి. అయితే రైతుల ఆందోళనలు, టీడీపీతో పాటు బీజేపీ నేతలు చేస్తున్న వరుస కామెంట్లను నిశితంగానే పరిశీలిస్తూ వచ్చిన జగన్... కేబినెట్ భేటీలో వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పక తప్పదు రాజధానిపై అంత తొందరెందుకు? అంటూ తన మంత్రివర్గ అనుచరులతోేనే చెప్పిన జగన్... రాజధానిపై ఎలా ముందుకు సాగుదామన్న విషయంపై అందరికీ చెప్పే ముందడుగు వేద్దామని కూడా జగన్ చెప్పారట. ఈ మాటలు బయటకు వచ్చినంతనే అటు రైతులతో పాటు వారి ఆందోళనలకు మద్దతు పలికిన టీడీపీ, బీజేపీలు షాక్ తిన్నాయని చెప్పాలి.

రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేసేది లేదని, అసలు వారు వినిపిస్తున్న వాదనలను సావదానంగా వినడంతో పాటుగా ఏ దిశగా చర్యలు చేపడితే వారికి పూర్తి న్యాయం జరుగుతుందన్న విషయంపై అధ్యయనం చేద్దామని కూడా జగన్ అన్నారట. ఇవే విషయాలను కేబినెట్ భేటీ ముగిశాక... వివరాలను వెల్లడించేందుకు మీడియా ముందుకు వచ్చిన మంత్రి పేర్ని నాని చాలా స్పష్టంగానే వివరించారు. రాజధానిపై ఏ నిర్ణయం తీసుకున్నా... ఏదో దొంగచాటుగా తీసుకునేది లేదని, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరికీ చెప్పే తీసుకుంటామని కూడా నాని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులకు ఎలాంటి అన్యాయం చేయబోమని, రైతులకు పూర్తి న్యాయం చేస్తామని కూడా నాని పేర్కొన్నారు. ఈ దెబ్బకు శుక్రవారం సాయంత్రం నుంచే రాజధాని రైతులు ఆందోళనలు విరమించేశారు. శనివారం నిర్వహించతలపెట్టిన నిరసనలను కూడా విరమించుకుంటున్నట్లు జేఏసీ ప్రకటించేసింది. మొత్తంగా జగన్ వ్యూహంతో రైతుల ఆందోళనలకు చెక్ పడిందన్న మాట.