Begin typing your search above and press return to search.

హైకోర్టు విష‌యంలో జ‌గ‌న్ అదిరిపోయే వ్యూహం

By:  Tupaki Desk   |   17 Jan 2020 5:28 PM GMT
హైకోర్టు విష‌యంలో జ‌గ‌న్ అదిరిపోయే వ్యూహం
X
ఏపీలో ఓ వైపు మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌పై వాదోప‌వాదాలు - భిన్నాభిప్రాయాల ప‌రంప‌ర కొన‌సాగుతుండ‌గా...మ‌రో సాంకేతిక స‌మ‌స్య తెర‌మీద‌కు వ‌చ్చింది. అదే, క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటు. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకొని హైకోర్టు మార్చ‌డం అంత ఈజీ విష‌య కాద‌ని తెలిసిన‌ప్ప‌టికీ... సీఎం జ‌గ‌న్ ఎందుకు ఈ నిర్ణ‌యం తీసుకుంటున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం హైదరాబాద్ హైకోర్టును విభజించేందుకు సుప్రీంకోర్టు చాలా స‌మ‌యం తీసుకోవ‌డం - భవనాలను చూపించిన తర్వాతనే హైకోర్టు విభజనకు అంగీకరించడం వంటివి సీఎం జ‌గ‌న్ దృష్టిలో ఉన్నాయ‌ని అందుకే ప్లాన్ `బి`తో హైకోర్టు ఆలోచ‌న కొనసాగిస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేందుకు దాదాపుగా డిసైడ‌యిన సంగ‌తి తెలిసిందే. అయితే, ప్ర‌భుత్వ నిర్ణ‌యం కంటే...సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ఈ ప్ర‌క్రియ‌లో కీల‌క పాత్ర పోషిస్తుంది. హైకోర్టును తరలించడం - బెంచీలను వేరే చోట ఏర్పాటు చేయ‌డం విష‌యంలో వారి అనుమ‌తి అతి ముఖ్య‌మైన అంశం. అమరావతిలోని హైకోర్టును మూడుగా విభజించి, ప్రధాన భాగాన్ని కర్నూలులో ఏర్పాటు చేసేందుకు సీజెఐ కార్యాలయం సాంకేతిక అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ ఒప్పుకునే అవ‌కాశాలు త‌క్కువ‌ని సీఎం జ‌గ‌న్ గ‌మ‌నించిన‌ట్లు స‌మాచారం. అందుకే అసెంబ్లీ తీర్మానం అనే అస్త్రం తెర‌మీద‌కు తెస్తున్నార‌ట‌.

రాజధాని వికేంద్రీకరణ అంశాన్ని శాస‌న‌స‌భ‌లో చ‌ర్చకు తీసుకురావ‌డం - ఆమోదింప‌చేయ‌డం అనే ఎజెండాతో జ‌గ‌న్ హైకోర్టు విష‌యంలో ముందుకు సాగుతార‌ని స‌మాచారం. జ్యుడిషియ‌ల్ క్యాపిట‌ల్ ఏర్పాటుకు అనుకూలంగా శాసనసభలో తీర్మానం చేయడం లేదా ప్రత్యేక బిల్లును ఆమోదింప‌చేసి దాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు నివేదించ‌డం జ‌గ‌న్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. హైకోర్టు తరలింపు లేదా విభజనకు ఈ రూపంలో అనుమతి తీసుకుంటార‌ని తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించినందున సీజెఐ ఆమోదం తెల‌ప‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్నార‌ట సీఎం. ఒకవేళ గ్రీన్‌సిగ్న‌ల్ రాకపోతే.. హైకోర్టు హెడ్ క్వార్టర్స్ అమరావతిలోనే వుంచి.. కర్నూలులో రెండు లేదా మూడు హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయడం, విశాఖలో ఒక బెంచ్ ఏర్పాటు చేయడం వంటి ప్రత్యామ్నాయాలు జ‌గ‌న్ రెడీ చేసుకున్నార‌ని అంటున్నారు. మొత్తంగా సాంకేతిక అంశాలతోనే త‌న కార్యం నిర్వ‌ర్తించుకుంటార‌ని కాదంటే... నిబంధ‌న‌ల ఆధారంగా జగ‌న్ ముందుకు సాగుతార‌ని అంటున్నారు.