Begin typing your search above and press return to search.

బ‌డా నేత‌లు ఎంట్రీ!..బాబుకు బ‌లం పెరిగిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   26 March 2019 1:51 PM GMT
బ‌డా నేత‌లు ఎంట్రీ!..బాబుకు బ‌లం పెరిగిన‌ట్టేనా?
X
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో పొలిటిక‌ల్ హీట్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. విప‌క్ష వైసీపీతో గ‌ట్టి పోటీనే ఎదుర్కొంటున్న అధికార టీడీపీకి ఈ ఎన్నిక‌లు చాలా కీల‌క‌మ‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో అందుబాటులో ఉన్న ఏ చిన్న అవ‌కాశాన్ని కూడా వ‌దులుకునేందుకు సిద్ధంగా లేని టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... అన్ని అస్త్రాల‌ను సంధిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్రంలో అధికారంలోని బీజేపీకి వ్య‌తిరేకంగా ఉన్న ప‌లు పార్టీల‌కు చెందిన కీల‌క నేత‌ల‌ను ప్ర‌చార బ‌రిలోకి దించేస్తున్నారు. ఇందులో భాగంగానే నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత‌ - జ‌మ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫ‌రూఖ్ అబ్దుల్లాను మంగ‌ళ‌వారం నాటి ప్ర‌చారానికి ర‌ప్పించేశారు.

క‌డ‌ప‌ - క‌ర్నూలు జిల్లాల్లో ప్ర‌చారం నిర్వ‌హించిన చంద్ర‌బాబు.... త‌న వెంట ఫ‌రూఖ్ అబ్దుల్లాను వెంట‌బెట్టుకుని వెళ్లారు. క‌డ‌ప జిల్లా ప్ర‌చారంలో భాగంగా చంద్ర‌బాబు ఆశించిన‌ట్టుగానే అద్భుతంగా ప్ర‌స‌గించిన అబ్దుల్లా... వైసీపీ అధినేత వైఎస్ జ‌న్ మోహ‌న్ రెడ్డిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌ను సీఎంగా చేస్తే... ఏకంగా రూ.1500 కోట్ల‌ను ఇస్తాన‌ని గ‌తంలో సోనియాతో జ‌గ‌న్ చెప్పార‌న్న సంచ‌ల‌న విష‌యాన్ని అబ్దుల్లా బ‌య‌ట‌పెట్టారు. ఇక అబ్దుల్లాతో పాటుగా ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ - జేడీఎస్ నేత‌ - మాజీ ప్ర‌ధాని దేవేగౌడ‌ - ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ యాద‌వ్‌ - డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌ - ఆర్జేడీ నేత తేజ‌స్వీ యాద‌వ్ - ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ త‌దిత‌రుల‌ను కూడా చంద్ర‌బాబు త‌న ప్ర‌చారం కోసం ర‌ప్పిస్తున్నారు. వీరంద‌రితో ఈ నెల 31న విశాఖ‌లో భారీ బ‌హిరంగ స‌భ‌ను కూడా నిర్వ‌హించేందుకు చంద్ర‌బాబు య‌త్నిస్తున్నారు.

వీరితో పాటు బీజేపీలోని అసంతృప్త నేత య‌శ్వంత్ సిన్హా - అరుణ్ శౌరీ లాంటి నేత‌ల‌ను కూడా బాబు రంగంలోకి దించే అవ‌కాశాలున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. వీరిని ప్ర‌త్య‌క్ష ప్ర‌చారంలోకి దింప‌డం ద్వారా... తాను గెలిస్తే... వీరంద‌రి స‌హ‌కారంతో రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా తీసుకురాగ‌ల‌న‌ని చంద్ర‌బాబు జ‌నంలో ఓ భ‌రోసాను నింపే య‌త్నం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ జట్టుక‌ట్టిన ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ తోనూ ఏమీ ఒరిగేది లేద‌న్న సంకేతాల‌ను కూడా చంద్ర‌బాబు పంప‌నున్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మొత్తంగా జాతీయ స్థాయి నేత‌లుగా ముద్ర ప‌డ్డ ఈ నేత‌ల‌తో బాబు భారీ ఎత్తున ప్ర‌చారం చేయ‌డంతో పాటు జ‌నాల్లో త‌న ప‌ట్ల సానుకూల‌త‌ను పెంచుకునే య‌త్నం చేస్తున్నార‌ని విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.