Begin typing your search above and press return to search.

మహానేతను అలా అంటున్నా రియాక్ట్ కావా జగన్?

By:  Tupaki Desk   |   1 April 2016 4:00 AM GMT
మహానేతను అలా అంటున్నా రియాక్ట్ కావా జగన్?
X
ఏపీ అసెంబ్లీలో గత ప్రభుత్వాల తీరును ఆక్షేపించినా.. విమర్శలు చేసినా వెనువెంటనే వైఎస్ జగన్ స్పందిస్తారు. ‘‘ఆ దివంగత మహా నేత వైఎస్’’ అంటూ తండ్రి మీద అంతులేని మమకారాన్ని ప్రదర్శిస్తారు. మన మధ్య లేని నేత గురించి అన్నేసి మాటలు అంటారా? అని ప్రశ్నిస్తారు. నిజమే.. తన తండ్రిని ఉద్దేశించి విమర్శలు చేసినప్పుడు కొడుకుగా ఆ మాత్రం స్పందించటాన్ని తప్పు పట్టలేం. మరి.. అదే విధానాన్ని అన్ని విషయాల్లోనూ అమలు చేయాలి కదా.

చంద్రబాబు విమర్శిస్తే.. వెంటనే కౌంటర్ ఇచ్చే జగన్.. మరి అదే పనిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తే ఎందుకు రియాక్ట్ కారు? తాజాగా తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల రీ డిజైనింగ్ అంశంపై మూడు గంటలకు పైగా నాన్ స్టాప్ ప్రసంగాన్ని చేసిన కేసీఆర్.. తన ప్రసంగంలో భాగంగా గత పాలకుల తీరును తీవ్రంగా తప్పు పట్టారు. అవసరానికి తగ్గట్లు చురకలు వేసిన విషయాన్ని మర్చిపోకూడదు.

ఈ చురకల్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని ప్రకటించిన వైఎస్ జమానాను కూడా కేసీఆర్ ప్రస్తావించటం మర్చిపోకూడదు. తెలంగాణ ప్రయోజనాల్ని భారీగా దెబ్బ తీసేలా గత పాలకులు అనుసరించారని.. తెలంగాణ ప్రజల్ని దారుణంగా మోసం చేశారంటూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన విమర్శలు ఏవో ఉత్త మాటలు కాదని.. సబ్జెక్ట్ ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. గూగుల్ మ్యాప్ ల్ని ఉదాహరణలుగా చూపించారు. ఇన్ని సాక్ష్యాలు చూపించి విమర్శలు చేయటం ఒక ఎత్తు అయితే.. ఇన్నేసి మాటలు అన్నా.. జగన్ వాటిపై ఎలాంటి రియాక్షన్ లేకపోవటం గమనార్హం.

ఏపీ అసెంబ్లీలో గత పాలకుల పాలన మీద విమర్శలు చేసే సమయంలో ఆ దివంగత మహా నేత అంటూ అదే పనిగా తన తండ్రి గురించి వీలైనన్ని విశేషణాలు పెట్టి మరీ ప్రస్తావించే జగన్.. తన తండ్రి పాలనను పదునైన విమర్శల కత్తితో ముక్కలు ముక్కలు చేస్తుంటే.. కనీసం స్పందించకపోవటం ఏమిటి? కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ మౌనాన్ని చూసినప్పుడు.. కేసీఆర్ ఆరోపించినట్లుగా.. తెలంగాణ ప్రజల్ని దారుణంగా మోసం చేసిన వారిలో వైఎస్ కూడా ఉన్నట్లేనన్న విషయాన్ని జగన్ ఒప్పేసుకున్నట్లా..? జగన్ మౌనం ఆ విషయాన్నే చెప్పకనే చెప్పేస్తుందన్నది మర్చిపోకూడదు.