Begin typing your search above and press return to search.

జగన్‌ పార్టీకి.. ఏపీ ప్రజలు అక్కర్లేదా?

By:  Tupaki Desk   |   28 Jun 2015 4:20 AM GMT
జగన్‌ పార్టీకి.. ఏపీ ప్రజలు అక్కర్లేదా?
X
ముసుగు తొలిపోయిన చందంగా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తుందన్న విషయం మీద స్పష్టత వచ్చేసినట్లే. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాట్లాడిన తీరు చూసినప్పుడు.. వారికి ఎవరి ప్రయోజనాలు అవసరం అన్నది తేలిపోయేలా మాట్లాడేశారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో.. పార్టీలు ప్రాంతాల వారీగా చీలిపోయాయి. రెండు ప్రాంతాల్లో అధికారం కావాలనుకునే తెలుగుదేశం లాంటి పార్టీలు కిందామీదా పడుతూ.. ఇద్దరికి సమ ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో తీవ్ర ఒత్తిళ్లకు గురి అవుతోంది. ఆశ్చర్యకరంగా.. విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు మాత్రం తమకు విపక్ష హోదా ఇచ్చిన ఏపీ ప్రజల కంటే.. నాలుగుసీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రయోజనాలే ఎక్కువన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ మొదలుకొని.. పార్టీలన్నీ కూడా ప్రాంతాల వారీగా.. నాయకులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంత ప్రయోజనాల గురించి మాట్లాడుతుంటే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రాయలసీమకు చెందిన ఎస్వీ మోహన్‌రెడ్డి.. తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారే కానీ.. ఏపీ ప్రయోజనాల గురించి మాత్రం మాట్లాడటం లేదు.

చివరకు.. కర్నూలు ప్రజలపై ప్రభావం చూపించే పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి మాట వరసకు మాట్లాడటం లేదు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన కర్నూలు ప్రజల కంటే కూడా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల గురించి మాట్లాడేందుకే ఆయన ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న అంశంపై తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. యూటీ ప్రతిపాదన అర్థం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగా హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు శాశ్విత రక్షణ కల్పించే అవకాశాన్ని ఆయన కాదనేస్తున్నారు.

తెలంగాణ ప్రాంత పార్టీల్ని చూసైన బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. తెలంగాణ ప్రయోజనాలకు ఒక శాతం భంగం వాటిల్లే అవకాశం ఉందని భావించినా.. అడ్డదిడ్డంగా మాట్లాడే తెలంగాణ అధికారపక్షానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తెలంగాణ పార్టీలు ఉంటున్నాయి. ఎందుకలా అంటే.. తమకు తమ ప్రాంత ప్రయోజనాలే ముఖ్యమని వారు చెబుతుంటారు. అందుకు పూర్తి వ్యతిరేకంగా ఏపీలోని పార్టీలు వ్యవహరిస్తున్నారు. అందునా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి వాటిల్లో ముందు ఉంటోంది.

పాలమూరు ఎత్తిపోతల పథకం కావొచ్చు.. విద్యుత్తు ఉద్యోగుల్ని ఏకపక్షంగా రిలీవ్‌ చేయటం కావొచ్చు.. తొమ్మిది.. పదో షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులన్నీ తమవేనని వాదించటం కావొచ్చు.. ఇలా ఏ విషయంలోనూ ఏపీ సర్కారుకు.. ఏపీ ప్రజలకు అండగా నిలవని ఆ పార్టీ.. సెక్షన్‌ 8 అమలు చేయాలన్న విషయం మీదా నీళ్లు నములుతున్న పరిస్థితి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జెరూసలేం ట్రిప్పులో ఖుషీగా గడిపేస్తుంటే.. ఆ పార్టీ నేతలు మాత్రం సెక్షన్‌ 8 అమలుకు తాము కట్టుబడి ఉన్నామని చెబుతూనే.. ఇదంతా చంద్రబాబు తన ప్రయోజనాల కోసమే తెరపైకి తెచ్చారని వాదిస్తున్నారు.

ఒకవేళ మోహన్‌రెడ్డి మాటలే నిజం అని నమ్ముదాం. వారి పార్టీ సెక్షన్‌ 8 అమలుకు కట్టుబడి ఉందని నమ్ముదాం. ఒకవేళ అదే నిజమైతే.. 13 నెలల కాలంలో సెక్షన్‌ 8 అమలు చేయాలని ఎందుకు వాదించలేదు? ఎందుకు పోరాటం చేయలేదు? చేతకాని వాళ్లు చేతకానట్లు ఉండకుండా.. పోరాడే వారిని విమర్శించటం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారన్నది వారికే తెలియని పరిస్థితి. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల పక్షాన పోరాటం చేయలేని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏపీ ప్రజలకు ఎంతమేరకు అవసరం అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.