గెలుపు కోసం వైసీపీ ఇపుడు నానా హైరానా పడుతోంది. వివిధ పద్ధతులలో సర్వేలు చేస్తోంది. అనేక రకాలుగా జనాల నుంచి నివేదికలు తెప్పించుకుంటోంది. అయినా సరే గెలుపు అన్నది ఖాయమన్న ధైర్యం చిక్కడంలేదు. మరో వైపు చూస్తే పార్టీ పరిస్థితి బాగుంది కానీ ఎమ్మెల్యేలు ఎంపీల పనితీరు బాలేదని పెద్ద ఎత్తున నివేదికలు వస్తున్నాయట. అంటే వారిని మార్చి కొత్తవారిని పెడితే గెలుపు ఖాయమే అంటున్నారు. మరి అలా కనుక చేస్తే సిట్టింగుల సంగతేంటి, వారు రెబెల్స్ అయితే అసలుకే ఎసరు వస్తుంది.
అందుకే ఇపుడు కొత్త విధానాన్ని వైసీపీ ఎంచుకుంటోంది అని అంటున్నారు. అదేంటి అంటే షిఫ్టింగులు అన్న మాట. ఒక ఎమ్మెల్యే సీట్లో మరొకరిని దింపడం, ఈయనని ఇంకో చోట నుంచి పోటీ చేయించడం, దాని వల్ల ఈ ఇద్దరూ కొత్త అభ్యర్ధులే అవుతారు. రెండు చోట్లా విజయావకాశాలు మెరుగుపడతాయన్న అంచనాలు ఏవో వైసీపీకి ఉన్నాయట. అదే విధంగా ఎంపీలుగా పనిచేసిన వారిని ఎమ్మెల్యేలుగా కొన్ని చోట్ల బరిలోకి దించడం, అదే విధంగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని తెచ్చి ఎంపీలుగా పోటీ చేయించడం.
ఇలా అనేక రకాలైన షిఫ్టింగులు చేయడానికి వైసీపీ ఇపుడు రెడీ అయిపోయింది. ఏపీలో చూస్తే దాదాపుగా అరవైదాక నియోజకవర్గాల్లో ఈ జంబ్లింగ్ విధానం అమలు చేస్తారు అని అంటున్నారు. అలాగే సగానికి సగం మంది ఎంపీలను ఈసారికి మార్చేస్తారు అని తెలుస్తోంది. వారిలో కొందరిని తెచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేయిస్తారు అని తెలుస్తోంది.
ఇక గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి మేరుగ నాగార్జునను బాపట్ల నుంచి ఎంపీగా పంపాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే తాడికొండ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి అక్కడ గెలవదు అని సర్వే నివేదికలు చెప్పడంతో ఆమెను మాజీ మంత్రి సుచరిత నియోజకవర్గం అయిన ప్రతిపాడుకు పంపాలని ఆలోచిస్తున్నారుట. ఇక సుచరితను కూడా వేరే చోటకు షిఫ్ట్ చేస్తారు అని తెలుస్తోంది. తాడికొండలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ని కానీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ని కానీ పోటీ చేయిస్తారు అని అంటున్నారు.
అదే విధంగా చూస్తే ఉత్తరాంధ్రాలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపుతారు అని తెలుస్తోంది. కురుపాం ఎమ్మెల్యేగా ఉన్న పుష్ప శ్రీవాణికి అరకు ఎంపీగా పంపాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక కురుపాం సీటుని బలమైన క్యాండిడేట్ కి ఇవ్వాలని నిర్ణయించారని అంటున్నారు. అలాగే శ్రీకాకుళం ఎచ్చెర్ల సీటుని విజయనగరం ఎంపీ బెల్లాల చంద్రశేఖర్ కి ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఇక వారసులు బలంగా లేని చోట్ల టికెట్లకు నో చెప్పి పార్టీలోని సీనియర్లకు ఇస్తారని అంటున్నారు. ఆ విధంగా చూస్తే చాలా మందిని ఆశాభంగం కలుగుతుంది అంటున్నారు.
ఇక అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ కి ఈసారి విశాఖ జిల్లాలో సీటు ఇస్తారని అంటున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే సీటుకు ఎంపీ సత్యవతి పేరుని కూడా పరిశీలిస్తున్నారుట. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఈసారి ఎంపీ సీటు దక్కదని, ఎమ్మెల్యేగా ఆయనకు విశాఖ తూర్పు నుంచి పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. విశాఖ ఎంపీగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ని పంపించి భీమిలీ లో కూడా బలమైన క్యాండిడేట్ ని కానీ టీడీపీలో ఒక బిగ్ షాట్ ని రప్పించి కానీ టికెట్ ఇస్తారని అంటున్నారు. ఇలా చాలా మార్పులు చేర్పులు షిఫ్టులులతో కొత్త స్ట్రాటజీకి వైసీపీ తెరలేపుతోంది. మరి ఇదంతా వర్కౌట్ అవుతుందా అంటే చూడాలి మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.