Begin typing your search above and press return to search.

మరోసారి ‘రావాలి’జగన్ నినాదం

By:  Tupaki Desk   |   27 Nov 2021 3:30 PM GMT
మరోసారి ‘రావాలి’జగన్ నినాదం
X
ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు జనాలకు చేరువయేందుకు తెగ ఆరాటపడుతున్నాయి. ఒకరిదేమో తిరిగి పాలనా పగ్గాలు అందుకోవాలని ఆరాటం. మరొకరు ప్రజల కరుణ తమపై పడితే అధికారంలోకి రాకపోతామా అనే తాపత్రయం. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ యాత్రలకు రెడీ అవుతున్నారు. ఏపీలో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు.

చంద్రబాబు కూడా అంతే సేమ్ టు సేమ్ అసెంబ్లీని వాకట్ చేశారు. తిరిగి సీఎం అయిన తర్వాత అసెంబ్లీలో అడుగుపెడతానని ప్రతిజ్ఞ చేశారు. ఇద్దరు నేతలు పాదయాత్రలు చేసే అధికారంలోకి వచ్చారు. జనం నాడికి పట్టుకోవడంతో ఎవరికీ ఎవరూ తీసిపోరు. ఇప్పుడు ఈ ఇద్దరూ ప్రజలకు దగ్గరయేందుకు సిద్ధమవుతున్నారు.

2019లో జగన్ అదికారాన్ని కైవసం చేసుకున్నారు. అయితే జగన్ సీఎం పీఠంపై కూర్చుకున్న కొద్దిరోజులకే కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఇలా రెండున్నర ఏళ్లు గడిపోయాయి. ఎన్నికల ముందు ప్రజల్లోకే కనిపించిన జగన్.. ఆ తర్వాత ప్రజాక్షేత్రానికి దూరంగా గడిపారు.

ఇప్పుడు పరిస్థితులు మారాయి. వైసీపీ ప్రభుత్వంపై అన్ని రకాలుగా టీడీపీ వత్తిడి పెంచుతోంది. అసెంబ్లీలో ఉంటే ఉపయోగం లేదని చంద్రబాబు భావించినట్లు ఉన్నారు. జనంతోనే కలియ తిరిగేందుకు ఆయన రెడీ అవుతున్నారు.


అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు తమకు తిరుగులేదని అనిపించారు. చంద్రబాబు నియోజకవర్గంలోనే వైసీపీ, టీడీపీని దెబ్బకొట్టింది. వరుస విజయాలను చూస్తే ఇప్పట్లో వైసీపీని ఎదుర్కొవడం కష్టమేనని అనిపిస్తోంది. అయితే రాజకీయాల్లో రోజులు ఎప్పుడూ ఒకలాగే ఉండవు. పరిస్థితులు తారుమారువుతున్నాయి. అసెంబ్లీని బహిష్కరించిన చంద్రబాబు ఇప్పుడు ప్రజాయాత్రలకు శ్రీకారం చుట్టబోతున్నారు.

ఇలాంటి సమయంలో అధికార పార్టీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. జగన్ ప్రజల్లోకి రావాలని వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. వాస్తవానికి డిసెంబర్ నుంచే జగన్ జిల్లాల్లో పర్యటించాలని అనుకున్నారట. సచివాలయాలను సీఎం స్వయంగా సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకుని, పరిష్కారిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది.

ప్రభుత్వ తీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు?. నవరత్నాల పథకంపై ప్రజల అభిప్రాయం ఏమిటి?. ప్రభుత్వం పథాకాలు అందరికీ అందుతున్నాయా?. ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా?. ఇంకా ఏం చేయాలి? ఏలా చేయాలి? ఇలా స్వయంగా ప్రజల నుంచే అభిప్రాయాలను తీసుకోవాలని జగన్ భావించారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

అయితే ఏమైందో ఏమోగాని జగన్ ప్రయత్నం అక్కడే ఆగిపోయింది. ఇప్పటికీ వరకు జగన్ జిల్లాల పర్యటనపై క్లారిటీ రాలేదు. వరదల తర్వాత చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. చంద్రబాబు బస్సు యాత్రలు చేయాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. లోకేష్ కూడా జనవరి నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.

పాదయాత్రలో జగన్ పల్లెపల్లెను చుట్టారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. అంతకుముందు జగన్ చేసిన ఓదార్పుయాత్ర ఆయనను ప్రజల మనిషిని చేసిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రజల్లోకి వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. కరోనా సమయంలో ఎలాంటి పర్యటనలు చేయలేదు.

ఇప్పుడు వరదలు ప్రజలకు కన్నీటిని మిగిల్చాయి. మామూలు సమయంలో యాత్రలు చేయకపోయనా పర్వాలేదు కానీ.. జనం కష్టాల్లో ఉన్నప్పుడు జగన్ ప్రజలను ఓదార్చాల్సిన అవసరం ఉందని వైసీపీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. అడుగు బయటపెట్టడమే పార్టీకీ ప్రభుత్వానికి మంచిదని వైసీపీ నేతలు సూచిస్తున్నారు.