Begin typing your search above and press return to search.

జగన్ శాపం అంత పవర్ ఫుల్లా?

By:  Tupaki Desk   |   19 March 2016 11:30 AM GMT
జగన్ శాపం అంత పవర్ ఫుల్లా?
X
`జగన్ పేరెత్తితే చాలు పెద్దపులిలా విరుచుకుపడతారు కొందరు నేతుల. తమతమ అధినాయకుల మెప్పుకోసం జగన్ ను టార్గెట్ చేసి ఆయనపై అన్ని రకాలుగా విమర్శలు కురిపిస్తారు. అయితే సుమారు అయిదేళ్ల జగన్ క్రియాశీల రాజకీయ జీవితాన్ని పరిశీలించినవారంతా ఓ విషయం గుర్తుచేస్తున్నారు. జగన్ ను టార్గెట్ చేసి దూషించినవారంతా రాజకీయంగా తెరమరుగు అయిపోయారని అంటున్నారు. ఆయన్ను బాగా ఇబ్బంది పెట్టి తాత్కాలిక ప్రయోజనాలు పొందినా కొద్దికాలంలోనే కనిపించకుండా పోతున్నారని అంటున్నారు. అందుకు పలు ఉదాహరణలూ చూపిస్తున్నారు.

జగన్ ఆస్తులపై హైకోర్టుకు లేఖ రాసి కాంగ్రెస్ వ్యూహంలో పావుగా మారిన నేత శంకరరావు గుర్తుండే ఉంటారు. జగన్ కేసు నడిచినంత కాలం శంకరరావు ఫుల్లుగా హైలైట్ అయ్యారు. కానీ, ఆయన కొద్దికాలంలోనే తీవ్ర ఇబ్బందుల్లోపడ్డారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో మంత్రి పదవి పొగొట్టుకోవడమే కాకుండా అరెస్టయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంట్లో ఉన్న శంకరరావు బట్టలు వేసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. తరువాత ఆయన రాజకీయంగా అడ్రస్ లేకుండా అయిపోయారు.

కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి టార్గెట్ గా జగన్‌ పై ఒంటికాలితో లేచిన నేత డీఎల్ రవీంద్రారెడ్డి గుర్తుండే ఉంటారు. ఇప్పుడాయన ఎక్కడున్నారో కూడా తెలియదు. అప్పట్లో జగన్‌ ను తిట్టిపోసి కాంగ్రెస్ అధిష్టానం మొప్పుపొంది మంత్రి పదవి పొందారు. కానీ అనంతరం కిరణ్‌ కుమార్ రెడ్డి కేబినెట్ నుంచి బర్తరఫ్‌ అయి పరువు పోగొట్టుకున్నారు. రాజకీయాల్లో ఇప్పుడు ఆయన పేరే వినపడడం లేదు. మరోవైపు జగన్‌ ను తీవ్రంగా దూషించిన వారిలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. జగన్‌ కు జైల్లో చిప్పకూడు తిన్నాక కూడా బుద్ధిరాలేదని పలుమార్లు విమర్శించిన రేవంత్ కూడా ఓటుకు నోటు కేసులో చాలా సింపుల్ గా దొరికిపోయి జైలుకెళ్లారు.

రాష్ట్ర నేతలే కాకుండా అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం కూడా జగన్ కేసుల్లో సీబీఐని ప్రొవోక్ చేశారని అంటారు. ఇప్పుడు చిదంబరం తన కుమారుడిని సీబీఐ వెంటాడుతుంటే తెగ ఇబ్బంది పడుతున్నారు. జగన్ ను టార్గెట్ చేసిన కాంగ్రెస్ నేతలకు మంచి ప్రాధాన్యమిచ్చిన సోనియాగాంధీ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ఏపిలో కాంగ్రెస్ పుట్టగతులు లేకుండా పోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఆ దేవుడికే తెలియాలి. కేంద్రంలోనేమో కనీసం ప్రతిపక్ష స్థాయి కూడా దక్కలేదు. వ్యక్తిగతంగానూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్య సమస్యల్లో చిక్కుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కుమారుడు రాహుల్ సహా సోనియా కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. ఇలా జగన్ ను ఇబ్బంది పెట్టినవారంతా కొద్దికాలం లాభపడినా ఆ వెంటనే ఇబ్బందిపడుతున్నారని వైసీపీలో పలువురు నేతలు అంటున్నారు. ప్రస్తుతం టీడీపీలో కొందరు నేతలు జగన్ మాటెత్తితే విరుచుకుపడుతున్నారని... వారికీ అదే పరిస్థితి తప్పదని అంటున్నారు.