చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పీఠం దక్కడంతో ఏదో చేయాలనే తపన జగన్ లో కనిపిస్తూ ఉంది. జగన్ మోహన్ రెడ్డి గత ఐదేళ్లు కేవలం రాజకీయం మాత్రమే చేయలేదు. ప్రజల్లో తిరుగుతూ.. వారి సమస్యలను జగన్ దగ్గర నుంచి గమనించారు. సుదీర్ఘ పాదయాత్రతో జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను దగ్గరుండి గమనించారు. అలా ప్రజల ఇక్కట్ల ను గమనించారు. వారి కోసం ఏదో చేయాలనే తపనా జగన్ లో ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని అంశాల మీద జగన్ స్వయంగా దృష్టి సారించనున్నట్టుగా తెలుస్తోంది.
మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన అనంతరం.. శాఖల కేటాయింపు విషయంలో కూడా జగన్ పక్కా ప్లాన్ తో ఉన్నారని - కొన్ని అంశాల మీద తన పర్యవేక్షణే అవసరం అనేభావనతో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని సమాచారం.
అలా జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టిన శాఖలు మూడు ఉన్నాయట. అవే వైద్య- ఆరోగ్య శాఖ - విద్యా శాఖ - నీటి పారుదల శాఖ. వీటిని సీఎం జగన్ మోహన్ రెడ్డి తన వద్దే ఉంచుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
వైద్య-ఆరోగ్య శాఖలో గత ప్రభుత్వ హయాంలో చాలా లోటు పాట్లు వెలుగు చూశాయి. ఆసుపత్రుల్లో అత్యంత దారుణమైన పరిస్థితులు గోచరించాయి. ఇటీవల సమీక్షలో కూడా జగన్ ఆ అంశాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖను తన వద్దే పెట్టుకుని వైద్య సేవలను పర్యవేక్షించవచ్చు అనే మాట వినిపిస్తోంది.
ఇక విద్యాశాఖ మీద కూడా జగన్ పక్కా ప్లాన్ తో ఉన్నారట. జగన్ కూతుళ్లు చదువుకునే వయసులో ఉన్నారు. కాబట్టి విద్యా వ్యవస్థలో ఏం జరుగుతోందో జగన్ కు పక్కాగా తెలిసే ఉంటుంది. పాదయాత్ర సందర్భంగా బోలెడంత సమాచారం స్వయంగా తెలుసుకోగలిగారు జగన్ మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో విద్యాశాఖలో సంస్కరణలకు తెరతీయడానికి ఆ శాఖను తన వద్దే ఉంచుకోనున్నారట జగన్ మోహన్ రెడ్డి.
ఇక నీటి పారుదల రంగానికి జగన్ ప్రాధాన్యతను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ అంశం మీద కూడా జగన్ ప్రత్యక దృష్టి పెట్టవచ్చు. ఈ శాఖను తనే ఉంచుకోవడం లేదా, తన మనసెరిగిన వారికి జగన్ ఆ శాఖ బాధ్యతలను అప్పగించడం జరుగుతుందనే మాట వినిపిస్తోంది.