Begin typing your search above and press return to search.

ఆ మాత్రం దానికి తిరుపతికి వెళ్లి రావటం ఎందుకు జగన్?

By:  Tupaki Desk   |   13 Nov 2021 7:30 AM GMT
ఆ మాత్రం దానికి తిరుపతికి వెళ్లి రావటం ఎందుకు జగన్?
X
ప్రజాధనాన్ని ఆచితూచి అన్నట్లుగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా అడ్డగోలుగా ఖర్చు చేయటం వల్ల జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ప్రభుత్వం అనుసరించే పాలసీలతో.. ప్రజల్ని మచ్చిక చేసుకునేందుకు వీలుగా సంక్షేమ పథకాల్ని భారీగా అమలు చేయటం లాంటి వాటితో భారీగా ఖర్చులు పెట్టేస్తున్నారు. ఖర్చులకు కోత వేసేలా ముఖ్యమంత్రి తీరు ఉండాలి. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి షెడ్యూల్ చూస్తే.. ఈ మాటలో నిజం ఎంత ఉందో ఇట్టే అర్థమవుతుంది.

తిరుపతిలో జరిగే సదస్సుకు హాజరయ్యేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వస్తున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత నుంచే ప్రోగ్రాం తేడా కొట్టేలా ఉందన్న మాట వినిపిస్తోంది.

తిరుపతిలోని తాజ్ హోటల్ లో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు స్వాగతం పలికేందుకు ఈ రోజు (శనివారం) సాయంత్రం రూ.6.15 గంటలకు గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రాయానికి చేరుకుంటారు. అమిత్ షాకు స్వాగతం పలికి.. అక్కడి నుంచి తిరుమలకు వెళతారు.

కేంద్ర మంత్రి అమిత్ షాతో కలిపి సీఎం జగన్ శ్రీవారి దర్శనాన్ని చేసుకుంటారు. రాత్రి 9.30 గంటల వేళలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మళ్లీ తిరుపతికి రిటర్న్ అవుతారు. అనంతరం రేణిగుంటకు వెళ్లి ఫ్లైట్ లో తిరిగి గన్నవరం చేరుకుంటారు. రాత్రి 11 గంటల వేళలో తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

అనంతరం ఆదివారం మధ్యామ్నం 1.15 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తిరుపతికి బయలుదేరి.. మధ్యాహ్నం 3 గంటల వేళకు తిరుపతి తాజ్ హోటల్ కు చేరుకుంటారు. కేంద్రమంత్రి అమిత్ షా హాజరయ్యే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కానున్నారు.

సీఎం జగన్ షెడ్యూల్ చూసినప్పుడు.. కేవలం పది గంటల సమయానికి తిరుపతి నుంచి గన్నవరం వచ్చి.. మళ్లీ గన్నవరం నుంచి తిరుపతికి అంత హడావుడిగా వెళ్లాల్సిన అవసరం ఏమిటి? ఎంచక్కా తిరుపతిలోనో.. లేదంటే కొండ మీదనో ఉండి.. ఆదివారం మధ్యాహ్నం నేరుగా సదస్సుకు హాజరైతే సరిపోయేది. అందుకు భిన్నంగా అదరాబాదరాగా తిరుపతి వచ్చి పోవటం.. మళ్లీ రావటం వల్ల అనవసరమైన ఖర్చు అవుతుందన్న విషయాన్ని ఏపీ సీఎం జగన్ గుర్తిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తవుతోంది.