Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌తో బ‌య‌ట‌కొచ్చిన నిజాలు

By:  Tupaki Desk   |   17 Jun 2017 7:00 AM GMT
జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌తో బ‌య‌ట‌కొచ్చిన నిజాలు
X
రైతుల కోసం చాలా చేస్తున్న‌ట్లు చెబుతారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. అయితే.. వాస్త‌వ ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న‌ది ఏపీలోని ఏ రైతును అడిగినా చెబుతారు. ఆ మ‌ధ్య‌న అనంత‌పురం జిల్లాలో రెయిన్ గ‌న్లు అంటూ చేసిన హ‌డావుడిపై ఆ జిల్లా రైతులు క‌థ‌లు క‌థ‌లుగా చెబుతారు. ట్యాంక‌ర్ తో తీసుకొచ్చిన నీళ్ల‌తో రెయిన్ గ‌న్ల‌ను ఉప‌యోగించి.. అద్భుతంగా జ‌రుగుతున్న‌ట్లుగా ప్ర‌చారం చేసుకొని ప‌త్తా లేకుండా పోయార‌ని చెబుతారు. రెయిన్ గ‌న్ల ఎపిసోడ్ ను తెలుసుకుంటే చాలు.. ఏపీ ముఖ్య‌మంత్రి మాట‌ల‌కు.. చేత‌ల‌కు మ‌ధ్యనున్న తేడా ఏమిటో ఇట్టే తెలుస్తుంది.

అన్న‌దాత‌ల క‌ష్టాల్ని తీర్చ‌టంలో బాబు స‌ర్కారు చేస్తున్న త‌ప్పుల‌తో రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు. క‌డ‌ప జిల్లా వీర‌పునాయునిప‌ల్లె మండ‌లం పాయ‌సంప‌ల్లె గ్రామానికి చెందిన సి. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రెడ్డి అప్పుల బాధ తాళ‌లేక మే 5న ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.ఆ రైతు కుటుంబాన్ని తాజాగా ఏపీ విప‌క్ష నేత‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. జ‌గ‌న్ రావ‌టానికి ముందు.. ఒక్క అధికారి అంటే ఒక్క అధికారి వ‌చ్చింది లేద‌ని.. రూపాయి సాయం అందించింది లేద‌ని బాధిత కుటుంబం వాపోయింది.

ప్రాజెక్టుల్ని స‌కాలంలో పూర్తి చేసి ఉంటే ఇలాంటి దారుణం జ‌రిగేది కాద‌ని వ్యాఖ్యానించారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు లేవ‌ని.. మూడేళ్లుగా ఇన్ పుట్‌ స‌బ్సిడీ లేద‌ని.. బీమా కూడా లేద‌ని.. మొత్తంగా రైతుల జీవితాల‌తో చంద్ర‌బాబు ఆడుకుంటున్నార‌న్నారు. బీమా ఇస్తే ఇన్ పుట్ స‌బ్సిడీ ఇవ్వొద్ద‌ని ఉత్త‌ర్వులు ఇస్తున్నారంటూ విమ‌ర్శించిన చంద్ర‌బాబు.. అవ‌కాశం ఉండి కూడా ప్రాజెక్టుల్ని పూర్తి చేయ‌టం లేద‌న్నారు.

బాబుపాల‌న‌తో రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే ప‌రిస్థితుల్ని క‌ల్పిస్తున్నార‌ని మండిప‌డ్డ జ‌గ‌న్‌.. తాజాగా ఆత్మ‌హ‌త్య చేసుకున్న హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రెడ్డి మూడున్న‌ర ఎక‌రాల పొలంలో చీనీ చెట్లు వేశాడ‌ని.. ఆ చెట్ల‌ను బ‌తికించుకునేందుకు బోర్లు వేసి అప్పుల పాల‌య్యాడ‌ర‌న్నారు.

ఎనిమిది బోర్లు వేస్తే ఒక్క బోరుకు కూడా నీళ్లు ప‌డ‌లేద‌ని.. మ‌రోవైపు భార్య పేరిట డ్వాక్రా ఖాతాలో ఉన్న రూ.ల‌క్ష రుణం మాఫీ కాలేద‌న్నారు. తాను అధికారంలోకి వ‌చ్చిన‌ మూడేళ్ల వ్య‌వ‌ధిలో చంద్ర‌బాబు గండికోట ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే రైతు ఆత్మ‌హ‌త్య చేసుకునే అవ‌కాశం ఉండేది కాద‌న్నారు. గండికోట ప్రాజెక్టు పూర్తి చేసి ఆ ప్రాజెక్టులో 26 టీఎంసీల నీటిని నింపాల‌న్న ఆలోచ‌న‌లో బాబు స‌ర్కారు లేద‌ని మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా బాధితుడి భార్య మాట్లాడుతూ.. త‌న భ‌ర్త ఆత్మ‌హ‌త్య చేసుకొని నెల గ‌డిచినా ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి సాయం అంద‌లేద‌ని.. రైతుల‌కు బాబు స‌ర్కారు సాయం చేస్తుంద‌న్న న‌మ్మ‌కం పోయింద‌ని వాపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/