Begin typing your search above and press return to search.

సైకిల్ ఎక్కిన జగన్ బ్యాచ్ లో కోవర్టులు

By:  Tupaki Desk   |   3 Jun 2016 9:23 AM GMT
సైకిల్ ఎక్కిన జగన్ బ్యాచ్ లో కోవర్టులు
X
ఏపీ అధికారపక్షంలో ఒక చర్చ హాట్ హాట్ గా సాగుతోంది. తాను చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా సైకిల్ ఎక్కేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో జగన్ పంపిన కోవర్టులు ఉన్నారా? ఓటుకు నోటు వ్యవహారంలో కేసీఆర్ పావులు కదిపిన తీరులోనే జగన్ కూడా స్కెచ్ వేశారా? తాను అనుకున్నట్లే విజయవంతంగా ఏపీ అధికారపక్షంలోకి తన కోవర్ట్ లను ఎంటర్ చేశారా? లాంటి ప్రశ్నలు తెలుగు తమ్ముళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిజానికి ఈ తరహా వాదనతో టీడీపీ అధినేతను గందరగోళానికి గురి చేయాలన్న ఆలోచనతోనే జగన్ ఈ ప్రచారాన్ని షురూ చేసినట్లుగా చెబుతున్నారు.

ఎందుకంటే.. ఎంత ప్రయత్నించినా వలసలు ఆగని నేపథ్యంలో ఈ ప్రవాహానికి చెక్ చెప్పేందుకు వీలుగా కొత్త మైండ్ గేమ్ కు తెర తీసినట్లుగా వాదనలు ఉన్నాయి. పార్టీ మారుతున్న జగన్ పార్టీ ఎమ్మెల్యేల మీద సందేహాలు వ్యక్తమయ్యేలా చేయటం ద్వారా.. ఇప్పటికే వచ్చిన వారి పట్ల సందేహంగా చూడటం.. కొత్త వారిని చేర్చుకునే విషయంలో వేగాన్ని తగ్గిస్తారన్నది జగన్ బ్యాచ్ ఐడియాగా చెబుతున్నారు. తాము వేసిన అనుమాన విత్తనాలు ఏపుగా పెరిగితే.. పార్టీ మారి తప్పు చేసినట్లుగా జగన్ పార్టీ నేతలు ఫీలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే.. జగన్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల్లో జగన్ కోవర్టులు ఉన్నారన్న వాదన రాగానే.. అందులో నిజానిజాల్ని మరిచి అందరిని సందేహాంగా చూడటం ఖాయం. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా రిస్క్ తీసుకోవటానికి బాబు శిబిరం ఏ మాత్రం ఇష్టపడరు.

అదే జరిగితే.. పార్టీ మారి తాము చాలా పెద్ద తప్పు చేసినట్లుగా జగన్ పార్టీ ఎమ్మెల్యేలు వాపోవటం ఖాయం. విపక్షంలో ఉన్నా ఫర్లేదు కానీ.. అధికారపక్షంలో చేరి అక్కడ ఎలాంటి మర్యాద లేకుండా ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండేందుకు నేతలు ఇష్టపడరు. ఇలాంటి పరిస్థితుల్లో సైకిల్ ఎక్కాలని సన్నాహాలు చేసుకుంటున్న జగన్ బ్యాచ్ ఎమ్మెల్యేలు వెనకడుగు వేయటం ఖాయం. తాము పార్టీ మారినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్న సంగతి తెలిసిన తర్వాత కూడా జగన్ పార్టీ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కే ఆలోచనను విరమించుకోవటం ఖాయం.

ఇలాంటి వాతావరణం కోసమే జగన్ బ్యాచ్ ఈ తరహా వాదనల్ని తెర మీదకు తీసుకొచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్యనే ఒక వైఎస్సార్ కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. జగన్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ కావాలనుకుంటే వారి సెల్ ఫోన్లను భద్రతా సిబ్బంది ముందుగా తీసుకొని.. తిరిగి వెళ్లే సమయంలో ఇచ్చేస్తారంటూ వ్యాఖ్యాలు చేయటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో ఏపీలో జరుగుతున్న నాలుగు స్థానాల్లో బలం లేకున్నా పోటీ చేయాలని చంద్రబాబు అనుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన కసరత్తు కాస్త జరిగింది కూడా. అయితే.. బీజేపీ అధినాయకత్వం నుంచి సూచనతో వెనక్కి తగ్గినట్లుగా వార్తలు వచ్చినా.. అసలు కారణం వేరే ఉందంటున్నారు. జగన్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు నలుగురు రాజ్యసభకు అభ్యర్థిని దింపే విషయంలో సానుకూలత వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. దీంతో.. బాబు పునరాలోచనలో పడటంతో పాటు.. నాలుగో అభ్యర్థి గెలుపునకు అవసరమైన ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు చేసే ప్రయత్నాల్లో ఏ మాత్రం దొరికి పోయినా దాని ప్రభావం ప్రభుత్వం మీద పడుతుందని అందుకే రాజ్యసభ పోటీకి దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజ్యసభకు నాలుగో అభ్యర్థి ఎంపిక ఎపిసోడ్ లో.. జగన్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల్లో కోవర్ట్ లు ఉన్నారన్న వాదన మరింత బలపడటమే కాదు.. చంద్రబాబు మరింత జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు.