Begin typing your search above and press return to search.

పొగాకు రైతులపై గళం విప్పిన జగన్

By:  Tupaki Desk   |   13 July 2016 12:27 PM GMT
పొగాకు రైతులపై గళం విప్పిన జగన్
X
కొద్దిరోజులుగా కామ్ గా ఉన్న ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలు విదిల్చారు. ఇప్పటికే గడప గడపకూవైఎస్సార్ కాంగ్రెస్ అంటూ భారీ కార్యక్రమానికి తెర తీసిన జగన్.. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో పొగాకు రైతులకు ముఖాముఖిన మాట్లాడారు. ఈ సందర్భంగా తమ సమస్యల్ని ఏకరవు పెట్టుకున్న పరిస్థితి. టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే జంగారెడ్డి గూడెంలో జగన్ కు భారీ ఆదరణ లభించటం.. పెద్ద ఎత్తున జనసందోహం తరలి రావటం గమనార్హం.

ఈ సందర్భంగా ఏపీ అధికారపక్షంపై జగన్ చేసిన విమర్శల్ని చూస్తే..

= చంద్రబాబు విమానాల్లో విదేశాలకు వెళ్లటం కాదు. రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలి.

= ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్ని అధికారంలోకి వచ్చాక విస్మరించటం సరి కాదు.

= రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు రావట్లేదు. మరోవైపు పండించిన పంటకు మద్దతు ధర లభించటం లేదు.

= తీసుకున్న అప్పులపై బ్యాంకులు రూపాయిన్నర నుంచి రెండు రూపాయిల వరకూ అపరాధ రుసుం వసూలు చేస్తున్నారు.

= ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రైతులు బతికేదెలా? వర్షాకాలం ప్రారంభమైన ఇప్పటివరకూ పొగాకు కొనుగోళ్లు చేప్టటటం లేదు.

= జులై వచ్చినా సగం పొగాకు కూడా కొనుగోలు చేయకపోవటం దారుణం.

= ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ప్రభుత్వం కళ్లు తెరవకపోవటం ఏమిటి?

= పొగాకు రైతుల పరిస్థితే కాదు.. పామాయిల్ రైతుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. కోనసీమలో క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి దాపురించింది.

= గిట్టుబాటు ధరలు రాక రైతులంతా అవస్థలు పడుతున్నారు.

= రైతుల రుణాల్ని భేషరతుగా మాఫీ చేస్తామన్న చంద్రబాబు మాట తప్పారు.

= కొత్త రుణాలు రాక.. పాత రుణాలు రెన్యువల్ కాక రైతులు కష్టాల్లో కూరుకుపోయారు.

= పొగాకు రూ.20 బోనస్ ఇస్తామని చెప్పి.. కేవలం పశ్చిమగోదావరి జిల్లాకు రూ.70 లక్షలు ముష్టి వేశారు.

= వైఎస్ హయాంలో పొగాకుకు కనీస మద్దతు ధర రూ.165 లభిస్తే.. బాబు గతేడాది రూ.114 ఇచ్చారు. పామాయిల్ కు వైఎస్ హయాంలో రూ.10వేలు పలికితే.. ఇప్పుడు రూ.5500లకు పడిపోయింది.

= నాయకులు మాట మీద నిలబడాలని.. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి.