Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్: రామోజీరావుతో జ‌గ‌న్ మీటింగ్‌

By:  Tupaki Desk   |   24 Oct 2017 4:10 AM GMT
హాట్ టాపిక్: రామోజీరావుతో జ‌గ‌న్ మీటింగ్‌
X
మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. ఉప్పు నిప్పులా ఉండే మీడియా మొఘ‌ల్ రామోజీ.. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిల మ‌ధ్య శ‌త్రుత్వం తెలుగోళ్లంద‌రికి సుప‌రిచిత‌మే. అలాంటి వీరిద్ద‌రి మ‌ధ్య గ‌డిచిన కొంత‌కాలంగా స‌హృద్భావ వాతావ‌ర‌ణం చోటు చేసుకోవ‌టం తెలిసిందే. అది మ‌రింత బ‌ల‌ప‌డిన‌ట్లుగా తాజా ప‌రిణామం చెప్ప‌క‌నే చెప్పేసింద‌ని చెప్పాలి.

2015 సెప్టెంబ‌రు 24న జ‌గ‌న్‌.. రామోజీ ఫిలింసిటీకి వెళ్ల‌టం.. రామోజీతో భేటీ కావటం అంద‌రికి ఆశ్చ‌ర్య‌ప‌ర్చ‌ట‌మే కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అదో హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఈ వ్య‌వ‌హారం కొంద‌రు మీడియా ప్ర‌తినిధుల‌కు మాత్రం పెద్ద ఆశ్చ‌ర్య‌మ‌నిపించ‌లేదు. ఎందుకంటే.. తెర వెనుక జ‌రిగిన అంశాల మీద అవ‌గాహ‌న ఉండ‌ట‌మే. రామోజీ పెద్ద కోడ‌లు క‌మ్ మార్గ‌ద‌ర్శి ఎండీ శైల‌జా కిర‌ణ్ కు.. జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తికి మ‌ధ్య‌నున్న స్నేహం చాలా త‌క్కువ‌మందికి మాత్ర‌మే అవ‌గాహ‌న ఉంది. వారి మ‌ధ్య‌నున్న ఫ్రెండ్ షిప్ కాల‌క్ర‌మంలో రెండు కుటుంబాల మ‌ధ్య శ‌త్రుత్వాన్ని త‌గ్గించ‌ట‌మే కాదు.. స‌త్ సంబంధాల‌కు కార‌ణ‌మైంద‌న్న మాట‌ను చెబుతారు.

హోం డిపార్ట్ మెంట్ నుంచి వ‌చ్చిన సూచ‌న‌ల‌కు జ‌గ‌న్ సైతం ఓకే అన‌టం.. అదే స‌మ‌యంలో పెద్ద కోడ‌లి మాట‌ల‌కు ప్ర‌యారిటీ ఇచ్చే రామోజీ.. జ‌గ‌న్ తో సంధికి ఓకే అన్నార‌ని చెబుతారు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య నెల‌కొన్న స్నేహం పుణ్య‌మా అని రామోజీ.. జ‌గ‌న్ ల మ‌ధ్య వైరం తొల‌గింద‌ని చెప్పాలి. త‌న తండ్రి నుంచి వార‌స‌త్వంగా వ‌చ్చిన రామోజీతో వైరాన్ని కొంత‌కాలం న‌డిపినా.. అది ఇరువురికి న‌ష్ట‌మేన‌న్న విష‌యాన్ని రెండు కుటుంబాల వారు గుర్తించిన‌ట్లుగా చెబుతారు. తామిద్ద‌రి మ‌ధ్య వైరం కార‌ణంగా ఆర్థికంగా రామోజీకి.. రాజ‌కీయంగా జ‌గ‌న్‌ కు న‌ష్ట‌మ‌న్న విష‌యంపై ఒక అవ‌గాహ‌న వ‌చ్చిన నేప‌థ్యంలో రెండు కుటుంబాల మ‌ధ్య‌న సంధి ప్ర‌క్రియ మొద‌లైంద‌ని చెబుతారు.

మొద‌ట్లో గ్రీటింగ్స్‌.. పూల‌బొకేలు ఇచ్చి పుచ్చుకోవ‌టంతో మొద‌లైన స్నేహం.. క్ర‌మ‌క్ర‌మంగా పెర‌గ‌ట‌మే కాదు.. ఒక‌రిపై ఒక‌రు వ్య‌తిరేక వార్త‌లు రాసే వైఖ‌రికి స్వ‌స్తి ప‌లికారు. ఒక‌ప్పుడు త‌న ప‌త్రిక‌లో రామోజీని గోచిగుడ్డ‌తో ఉన్న క్యారికేచ‌ర్ వేసిన జ‌గ‌న్‌.. ఈరోజు ఏకంగా ఆయ‌న నివాసానికి వెళ్లి గంట‌కు పైగా చ‌ర్చ‌లు జ‌ర‌ప‌టం గ‌మ‌నార్హం.

ప్ర‌త్యేక హోదా కోసం 2015లో రెండు రోజుల నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేయ‌టానికి ముందు ఒక‌సారి రామోజీని ఆయ‌న ఫిలింసిటీలో భేటీ అయిన జ‌గ‌న్‌.. తాజాగా మ‌రోసారి క‌ల‌వ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. త్వ‌ర‌లో పాద‌యాత్ర నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో రామోజీ ఆశీస్సులు అన్ని విధాలుగా సాయం చేస్తాయ‌న్న భావ‌న‌ను కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు.

రామోజీని క‌ల‌వ‌టం ద్వారా జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న వాద‌న లేక‌పోలేదు. మొండిఘ‌టంగా పేరున్న జ‌గ‌న్‌.. ఎవ‌రి మాట విన‌ర‌ని.. విప‌రీత‌మైన అహంభావంగా అభివ‌ర్ణిస్తుంటారు. నిజానికి ఈ త‌ర‌హా మాట‌లు ఆయ‌న ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీయ‌టంతో పాటు.. కొన్ని వ‌ర్గాల వారిని దూరం చేసింది కూడా. రామోజీని క‌ల‌వ‌టం ద్వారా అంద‌రూ త‌న మీద వేసేవి నింద‌లు మాత్ర‌మేన‌న్న విష‌యాన్ని త‌న చేత‌ల‌తో జ‌గ‌న్ నిరూపించార‌ని చెబుతారు.

త‌న తండ్రి నుంచి వార‌స‌త్వంగా వ‌చ్చిన వైరాన్ని వ‌దిలేయ‌టం అంత సులువైన ప‌ని కాద‌ని.. అందుకు ఎంతో పెద్ద మ‌న‌సు అవ‌స‌ర‌మ‌ని చెబుతారు. ఆ కోణంలో చూసిన‌ప్పుడు జ‌గ‌న్ చాలా వ‌ర‌కు త‌గ్గిన‌ట్లుగా చెప్పాలి. ఒక‌ప్పుడు తాను ఏకిపారేసిన రామోజీని.. ఆయ‌న ఇంటికి వెళ్లి గంట పాటు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌టం అంటే మాట‌లు కాదుగా. ఇంత‌కీ.. తాజా భేటీలో ఏం మాట్లాడుకొని ఉంటారు? అన్న విష‌యం బ‌య‌ట‌కు రాకున్నా.. కొన్ని అంచ‌నాల ప్ర‌కారం అయితే.. తాను చేసే పాద‌యాత్రకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని.. ఈనాడు దిన‌ప‌త్రిక‌లోనూ.. ఈటీవీ క‌వ‌రేజ్ విష‌యంలోనూ ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కోరి ఉండొచ్చని చెబుతారు.

త‌న ఇంటికి వ‌చ్చి సాయం చేయాల‌ని కోరిన ఎవ‌రినైనా ఓకే అనేసే రామోజీ (ఒక‌వేళ ఆయ‌న‌కు ఇష్ట‌మే లేకుంటే ఇంటి వ‌ర‌కూ రానివ్వ‌క‌పోవ‌టం అనే విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే) జ‌గ‌న్‌ కు సైతం అదే రీతిలో రియాక్ట్ అయి ఉంటార‌ని చెబుతుంటారు. మొన్నామ‌ధ్య రామోజీ మ‌న‌మ‌రాలి పెళ్లికి హాజ‌రైన జ‌గ‌న్ ప‌ట్ల ప్ర‌త్యేక అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించిన రామోజీ.. తాజా భేటీతో యువ‌నేత ప‌ట్ల త‌న‌కున్న సానుకూల‌త‌ను ప్ర‌ద‌ర్శించార‌ని చెప్పాలి. పాద‌యాత్ర సంద‌ర్భంగా ఈనాడులో ఇచ్చే క‌వ‌రేజీతో.. రామోజీ.. జ‌గ‌న్ భేటీ ప్ర‌భావం ఎంత‌న్న విష‌యంపై కాస్తంత క్లారిటీ వ‌స్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.