Begin typing your search above and press return to search.

జంపింగ్ రేటు చెప్పిన జగన్

By:  Tupaki Desk   |   23 April 2016 8:12 AM GMT
జంపింగ్ రేటు చెప్పిన జగన్
X
తెలిసి అన్నారో.. తెలియక అన్నారో కానీ ఏపీ విపక్ష నేత నోటి వెంట వచ్చిన ఒక మాటకు ఆయన భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. విపక్షనేత నోటి నుంచి వచ్చిన ఒక్కమాటతో చెలరేగిపోతున్న చంద్రబాబు.. వెల్లువెలా వచ్చేస్తున్న జగన్ ఎమ్మెల్యేల్ని సాదరంగా ఆహ్వానించి సైకిల్ మీద ఎక్కించేస్తున్నారు. తాను ఒక్క మాట అంటే చాలు.. పాతిక నుంచి ముప్ఫై మంది అధికారపక్ష ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వచ్చేయటానికి సిద్ధంగా ఉన్నారని.. టైం వచ్చినప్పుడు వారి వివరాలు చెబుతానన్న మాటతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ ను షురూ చేయటం తెలిసిందే.

బాబు ఆకర్ష్ ను మొదట్లో లైట్ తీసుకున్న జగన్.. రోజుల గడిచే కొద్దీ జంపింగ్స్ తీవ్రత ఆయన్ను బలంగా తాకుతోంది. చూస్తుండగానే 13 మంది ఎమ్మెల్యేలు జంప్ అయిపోగా.. మరో పది మంది వరకూ రెఢీగా ఉన్నారన్న వార్తలు జోరందుకున్నాయి. అదే కానీ జరిగితే తన పుట్టె మునిగితుందన్న విషయాన్ని గుర్తించిన జగన్.. ఆపరేషన్ ఆకర్ష్ మీద గళం విప్పటం మొదలు పెట్టారు. అయితే.. ఆయన ఎంత గింజుకున్నా జరిగేది జరగక మానదన్న చందంగా వెళ్లిపోతున్న ఎమ్మెల్యేల్ని ఎలా ఆపాలో అర్థం కాక తల పట్టుకునే పరిస్థితి.

ఏపీ ముఖ్యమంత్రి అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీకి బాబు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తూ.. ‘‘సేవ్ డెమోక్రసీ’’ పేరిట ఆందోళన కార్యక్రమాన్ని జగన్ మొదలెట్టారు. తాజాగా ఆయన గవర్నర్ ను కలిసి ఏపీ ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేసేందుకు రాజ్ భవన్ కు వెళుతున్న సమయంలోనూ మరో ఎమ్మెల్యే (అనంతపురం జిల్లా కదిరి) జంప్ కావటం గమనార్హం. జంపింగ్స్ కు పాల్పడుతున్న ఒక్కో ఎమ్మెల్యేకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ ఆఫర్ ఇస్తున్నారని.. ఒక్కొక్కరికి రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకూ నిధులు ఇస్తున్నట్లు చెబుతున్నారు.

పట్టపగలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ జగన్ మండిపడుతున్నారు. మరిప్పుడు బాబు చేసింది ఖూనీ అయితే.. గతంలో ఇదే రీతిలో వ్యవహరించిన జగన్ మాటేంటి..? అంతేకాదు.. జంపింగ్స్ కు పాల్పడిన వారికి భారీ మొత్తాన్ని బాబు ఇస్తున్నట్లు చెబుతున్న జగన్.. గతంలో తాను కూడా ఇదే తీరులో వ్యవహరించిన విషయానికి జగన్ ఏం సమాధానం చెబుతారు? అప్పుడు పార్టీలు వదిలి వచ్చిన వారికి జగన్ ఎంత ఇచ్చినట్లు..? లాంటి ప్రశ్నలు తెలుగు తమ్ముళ్ల నోటి నుంచి వస్తున్నాయి. ఇలాంటి వాటికి జగన్ ఏం సమాధానం చెప్పగలరు?