Begin typing your search above and press return to search.

రైతుల‌తో ఆత్మీయ స‌మ్మేళ‌నం.. జ‌గ‌న్

By:  Tupaki Desk   |   11 Jan 2018 2:13 PM GMT
రైతుల‌తో ఆత్మీయ స‌మ్మేళ‌నం.. జ‌గ‌న్
X
ప్రజా సంక‌ల్ప యాత్ర చేప‌ట్టిన ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి త‌న యాత్ర‌ను మ‌రింత ఆస‌క్తిక‌రంగా మ‌లుస్తున్నారు. ప్ర‌జ‌లు - కార్య‌క‌ర్త‌ల‌ను క‌ల‌వ‌డం - స‌భ‌ల్లో ప్ర‌సంగించ‌డం వంటి కార్య‌క్ర‌మాలే కాకుండా...ఆత్మీయ స‌మ్మేళ‌నాల పేరుతో ప్ర‌త్యేక స‌మావేశాల‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తాజాగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని నెమ్మళగుంటపల్లి గ్రామంలో రైతుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌ల‌తో రైతుల‌ను ఆలోచ‌న‌ల్లో ప‌డేశారు.

రెతుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో గెలిచేందుకు చాలా అబద్దాలు ఆడారని, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. మనందరి ప్రభుత్వం వచ్చాక రైతులకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. `చంద్రబాబు ప్రభుత్వం గురించి మాట్లాడాల్సి వస్తే .... ఆయ‌న నాలుగేళ్ల పాలనను చూశాం. ఇదే పెద్ద మనిషి సీఎం పదవి కోసం ఏమన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. వ్యవసాయ రుణాలు అన్నీ కూడా బేషరత్తుగా మాఫీ కావాలంటే బాబు రావాలన్నారు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను. బ్యాంకుల్లో బంగారం ఇంటికి వచ్చిందా? బ్యాంకుల వారు మాత్రం మన బంగారాన్ని వేలం వేస్తూ నోటీసులు పంపిస్తున్నారు. తాను చేస్తున్న రుణమాఫీ చివరకు వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. ఎన్నికలప్పుడు చంద్రబాబు రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నాడు. ఈ రోజు మిమ్మల్నే అడుగుతున్నాను. మీ గుండెలపై చేతులు వేసుకొని ప్రశ్నించుకోండి. ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా?. ఏ మైంది ఆ ధరల స్థిరీకరణ నిధి` అంటూ రైతుల‌ను ఆలోచ‌న‌లో ప‌డేలా...త‌ను చెప్పాల‌నుకున్న భావాన్ని వారికే తెలిసేలా వైఎస్ జ‌గ‌న్ చేశారు.

`రువు మండలాల క్రింద ఏమైనా ప్రకటిస్తే ప్రభుత్వం సాయం చేస్తుందని రైతులు భావిస్తారు. ఇన్‌ పుట్‌ సబ్సిడీ - రుణాలపై వడ్డీ మాఫీ అవుతుందని ఎదురు చూస్తాం. ఇన్‌ పుట్‌ సబ్సిడీ కానీ - కరువు సాయం కానీ ఏమైనా కనిపించిందా?. ఈ ఏడాది కూడా రాయలసీమలో జూన్‌ లో పంటలు వేస్తాం. మైనస్‌ 22 శాతం వర్షపాతం ఉంది. కరువు మండలాలుగా ప్రకటించాల్సి ఉంది. రైతులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని కరువు మండలాలుగా ప్రకటించడం లేదు. రైతులను సంతోషపెట్టే కార్యక్రమం ఏ ఒక్కటి కూడా జరుగలేదు. రైతులకు మేలు చేయాలనుకుంటే ఏ ప్రభుత్వమైనా కో–ఆపరేటివ్‌ రంగాన్ని ప్రోత్సహించాలి. చెరకు ఫ్యాక్టరీలు కో–ఆపరేటివ్‌ రంగంలో నడపాలి. అప్పుడే చెరకు రైతుకు లాభాలు వస్తాయి. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఉన్న రెండు చెరకు ఫ్యాక్టరీలు మూత వేయించారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబు ఊదరగొడుతున్నారు. రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చేస్తే బాగుంటుంది. ఎలా చేస్తే బాగుంటుందన్న విషయాలపై మీ అందరి సలహాలు తీసుకునేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేశాం. ఆ సూచనలు, సలహాలతో మనందరి ప్రభుత్వంలో మంచి పాలన అందించాలన్నదే ఆరాటం.` అని త‌న ఎజెండా ఏంటో వైఎస్ జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.