Begin typing your search above and press return to search.

జగన్ మార్క్ రూల్... రూల్ ఈజ్ రూల్ - రూల్ ఫర్ ఆల్

By:  Tupaki Desk   |   5 Sep 2019 1:30 AM GMT
జగన్ మార్క్ రూల్... రూల్ ఈజ్ రూల్ - రూల్ ఫర్ ఆల్
X
నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన మార్కు పాలనను పరుగులు పెట్టిస్తున్నారనే చెప్పక తప్పదు. తాను అధికారంలోకి వస్తే... పాలన ఎలా ఉండాలో ముందే నిర్ణయించుకున్న జగన్... అదికారం చేతికందాక ఆ లైన్ ను దాటేందుకు ససేమిరా అంటున్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా సరే... జగన్ తనదైన శైలి పాలనలోనే ముందుకు సాగుతున్నారు. ఈ విషయంలో ఆయన తన సొంత పార్టీ నేతలు - కేబినెట్ సభ్యులు చెప్పినా తాను గీసుకున్న గీతను దాటేందుకు ససేమిరా అంటున్నారు. అలాంటి తరహా జగన్ వైఖరికి నిదర్శనంగా బుధవారం నాటి కేబినెట్ భేటీ నిలుస్తోందని చెప్పక తప్పదు. తొమ్మిదేళ్ల పాటు అధికారానికి దూరంగానే నిలబడ్డా... తమ వెన్నంటి నడిచిన కార్యకర్తలకు ఏదో ఒకటి చేయాలంటూ మంత్రులంతా మక్తకంఠంతో చెప్పినా కూడా జగన్ వారి మాట వినలేదట. రూల్ ఈజ్ రూల్... రూల్ ఫర్ ఆల్ అంటూ జగన్ చెప్పడంతో మంత్రులు కూడా సైలెంట్ అయిపోయారట.

ఈ అరుదైన ఘటన వివరాల్లోకి వెళితే... రాష్ట్రంలో ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో నియామకాల కోసం పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ నియామకాల్లో పార్టీ కోసం కష్టపడిన పలువురు కార్యకర్తలకు అవకాశం కల్పిద్దామని - ఆ దిశగా తాము కొందరికి సిఫారసు చేస్తామని మంత్రులు కేబినెట్ భేటీలోనే జగన్ ముందు ఓ ప్రతిపాదన పెట్టారట. అయితే ఈ ప్రతిపాదనకు జగన్ ససేమిరా అన్నారట. రూల్ ఈజ్ రూల్... రూల్ ఫర్ ఆల్ అన్న మాటను ప్రస్తావించిన జగన్... ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రాజకీయ జోక్యాన్ని సహించనని - మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు - పార్టీ నేతలు ఏ ఒక్కరు కూడా ఈ నియామకాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తెగేసి మరీ చెప్పారట.

అయితే క్షేత్రస్థాయిలో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రులు ఏకరువు పెట్టేందుకు యత్నించినా... జగన్ ఈ విషయంలో మాత్రం మన వైఖరి ఇలాగే ఉండాలి అంటూ మరోమారు కరాఖండీగా చెప్పడంతో మంత్రులు మిన్నకుండిపోయారట. పార్టీ కార్యకర్తలు - నేతలకు చేసే మేళ్లు వేరే ఉంటాయని - సర్కారీ కొలువుల భర్తీలో రాజకీయ జోక్యంతో వ్యవస్థ నాశనం అవుతుందని - వ్యవస్థను కాపాడుకునేందుకే తాను ఈ నియామకాల్లో జోక్యం చేసుకోవద్దని చెబుతున్నానని జగన్ వివరించారట. దీంతో చేసేదేమీ లేక మంత్రులు కూడా మిన్నకుండిపోయారట. మొత్తంగా జగన్ ఓ నిర్ణయం తీసుకున్నారంటే... ఆ నిర్ణయాన్ని ఎవరూ ప్రభావితం చేయలేరన్న మాటతో పాటు... రూల్ ఈజ్ రూల్... రూల్ ఫర్ ఆల్ దిశగా జగన్ ముందుకు సాగితే... వ్యవస్థలో సమూల మార్పు తప్పదన్న భావన వ్యక్తమవుతోంది.